డిడిలు కట్టిన ప్రతి ఒక్కరికీ  గొర్రెల పంపిణీ  చేయాలి

– ఎమ్మెల్యేల జోక్యం లేకుండా డిడిలు కట్టిన ప్రతి ఒక్కరికీ  గొర్రెల పంపిణీ  చేయాలి
– రెండో విడత గొర్రెల పంపిణీ మరింత వేగవంతం చేయాలి.. జి. యం. పి.యస్
– జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి
నవ తెలంగాణ-సూర్యాపేట:
గొర్రెల పంపిణీలో  ఎమ్మెల్యేల జోక్యం లేకుండా డిడి కట్టిన ప్రతి ఒక్కరికి గొర్రెలను పంపిణీ చేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసారం, దాసాయిగూడెం, ఇమాంపేట గ్రామ సొసైటీ సమావేశం సోమవారం స్థానిక కేసారంలో సొసైటీ అధ్యక్షులు మెంతపోయిన గంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో విడత గొర్రెల పంపిణీ మరింత వేగవంతం చేసి, లబ్ధిదారులందరికీ గొర్ల పంపిణీ వెంటనే చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తారని ఆశతో  అప్పు తెచ్చి ఇప్పటివరకు జిల్లాలో 3500 మంది  లబ్ధిదారులు గొర్రెల కోసం డీడీలు కట్టి  నెలలుగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం గొల్ల కురుమలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. టేకుమట్ల, పెన్బహాడు ,లింగాల, కూడా కూడా గ్రామంలో కూడా 45 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి 43, 750 రూపాయలు చొప్పున డీడీలు తీయడం జరిగిందని తెలిపారు. బంగారం కుదరవబెట్టి అప్పులు తెచ్చి డీడీలు కట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. గోర్లు పంపిణీ చేయడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల వారు గొర్రెలు వస్తాయో రావు అని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గొర్రెలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే ను కలవగా గ్రామంలో ఉన్న యాదవులు అందరూ బిఆర్ఎస్ కండువా కప్పుకోవాలని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తానని ప్రమాణం చేయాలని అంశాలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల పంపిణీలో ఎమ్మెల్యేల, మంత్రుల ప్రమేయం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ఇప్పటికైనా రాజకీయ జోక్యం లేకుండా గొర్రెలు పంపిణీ చేయాలని లేనియెడల గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న గొల్ల కురుమల అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో జిఎంపిఎస్ సొసైటీ  అధ్యక్షులు మెంతబోయిన గంగయ్య, మన్యం లింగయ్య, గుండెబోయిన లక్ష్మయ్య, మట్టి పెళ్లి లింగస్వామి, బోయిన సైదులు, సందయ లింగయ్య, లక్ష్మయ్య, శ్రీను, వెంకన్న ,కొమ్ములయ్య, బోర సైదులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love