హేలీ బాప్టిస్ట్ చేతిలో ఓటమి
మాడ్రిడ్ ఓపెన్ 2026
మాడ్రిడ్ (స్పెయిన్) : మహిళల సింగిల్స్ వరల్డ్ నం.1, వరుసగా 15 మ్యాచ్‌ల జైత్రయాత్ర జోరుమీదున్న అరినా సబలెంక (బెలారస్)కు చుక్కెదురు. అమెరికా అమ్మాయి హేలీ బాప్టిస్ట్ మూడు సెట్ల సమరంలో టాప్ సీడ్‌కు షాక ఇచ్చింది. 2-6, 6-2, 7-6(8-6)తో సబలెంకపై బాప్టిస్ట్ గెలుపొందింది. హేలీ బాప్టిస్ట్ 12 ఏస్‌లు, 10 డబుల్ ఫాల్ట్స్‌తో మెరువగా.. సబలెంక ఐదు ఏస్‌లతో సరిపెట్టింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన సబలెంక.. మ్యాచ్‌లో ఆరు సార్లు బాప్టిస్ట్ సర్వ్‌ను బ్రేక్ చేసింది. సబలెంక సర్వ్‌ను సైతం ఆరుసార్లు అడ్డుకున్న బాప్టిప్ట్ కీలక రెండో సెట్‌లో గెలుపొంది మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన మూడో సెట్ టైబ్రేకర్‌కు వెళ్లింది. 8-6తో బాప్టిప్ట్ పైచేయి సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. పాయింట్ల పరంగా 105-104తో బాప్టిప్ట్ పైచేయి సాధించింది. రెండో సీడ్ ఎలెనా రిబకినాకు సైతం క్వార్టర్‌ఫైనల్లో ఓటమి ఎదురైంది. అనస్తాసియ పొటపొవ 7-6(10-8), 6-4తో వరుస సెట్లలో అగ్రశ్రేణి క్రీడాకారిణిపై విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 2 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లతో రిబకికాను పొటపొవ ఇరకాటంలో పడేసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లో అల్జెగాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 6-7(4-7), 6-3తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా, కొబాలి (ఇటలీ) 6-3, 5-7, 6-4తో రష్యా స్టార్ ఆటగాడు డానిల్ మెద్వదేవ్‌పై గెలుపొందాడు.
సబలెంకకు షాక్
- Advertisement -
- Advertisement -



