– సెబీ మాజీ చీఫ్‌పై కేసు నమోదు చేయండి
– ఏసీబీకి ముంబయి కోర్టు ఆదేశం
ముంబయి: స్టాక్ మార్కెట్ మోసం, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలపై సెబీ మాజీ చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్, మరో ఐదుగురు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ను ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ”స్టాక్ మార్కెట్ మోసం, ఉల్లంఘన విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం” అని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి శశికాంత్ ఏక్‌నాథరావు బంగర్ తన ఆదేశాల్లో వివరించారు. ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షిస్తుందనీ, 30 రోజుల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కూడా ఆదేశాల్లో స్పష్టం చేశారు. సెబీలోని జరిగిన ఆర్థిక మోసాలు, నియమాల ఉల్లంఘన, అవినీతి నేరాలపై దర్యాప్తు చేయాలని ఒక మీడియా రిపోర్టర్ కోర్టును ఆశ్రయించారు. సెబీ చట్టం 1992ను ఉల్లఘించారనీ, ముఖ్యంగా సెబీ అధికారుల సహకారంతోనే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఒక కంపెనీ మోసపూరితంగా లిస్టయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్, నియంత్రణ సంస్థలను అనేక సార్లు సంప్రదించినా వారు ఎటువంటి చర్యా తీసుకోలేదని వివరించారు. ఈ విషయాలను పరిశీలించిన కోర్టు ముంబయి రీజన్‌లోని వర్లీలోని ఏసీబీని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కాగా, సెబీకి తొలి మహిళా చీఫ్ అయిన మాధబి పూరి బుచ్ పదవీ కాలం శుక్రవారంతో పూర్తయింది. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా మూడేండ్ల పదవీ కాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు.