– 214మంది పాక్ సైనికులను హతమార్చాం: బెలూచ్ తిరుగుబాటుదారుల వెల్లడి
– పాక్ సర్కారు ‘ఆపరేషన్ సక్సెస్’ ప్రకటనకు ఖండన
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బెలూచ్ తిరుగుబాటుదారులు జరిపిన ప్యాసింజర్ రైలు హైజాక్ ఘటన విషాదాంతంగా ముగిసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) కీలక ప్రకటన చేసింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగియడంతో తమ చెరలో ఉన్న 214 మంది పాక్ సైన్యాన్ని చంపేసామని వివరించింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందంటూ పాక్ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా బీఎల్‌ఏ ఖండించింది. ఆ దేశ మిలిటరీ అహంకారాన్ని, మొండి వైఖరిని తప్పుబట్టింది. ”మా రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్థాన్ సైన్యానికి 48 గంటల సమయం ఇచ్చాం. మా చెరలో బందీలుగా ఉన్న వారిని రక్షించుకునేందుకు సైన్యానికి మేమిచ్చిన చివరి అవకాశం. కానీ, పాక్ తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించింది. ఫలితంగా శత్రు సైన్యానికి చెందిన 214 మందిని మేం హతమార్చాం. బీఎల్‌ఏ ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. అయితే ఇస్లామాబాద్ సైన్యం తమ సిబ్బందిని కాపాడుకునేందుకు బదులుగా మాతో పోరాడాలని ప్రయత్నించింది. ఫలితంగా బందీలను కోల్పోయింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ బోగిల్లోని బందీలను రక్షించేందుకు పాకిస్థాన్‌లోని ఎస్‌ఎస్‌జీ కమాండోలు రాగానే మా యోధులు వారిని చుట్టిముట్టి భీకర దాడి చేశారు. గంటల పాటు సాగిన ఈ దాడుల్లో పలువురు బందీలను ఉరితీయగా.. ఎస్‌ఎస్‌జీ కమాండోలు భారీ ప్రాణనష్టాన్ని చవిచూశారు. మా వాళ్లు చివరి బుల్లెట్ వరకు పోరాడారు. చనిపోయిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని ఇస్లామాబాద్ ప్రభుత్వం వాస్తవాలను కూడా కప్పిపుచ్చుతోంది. సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్నప్పటికీ బందీలను రక్షించుకోవడంలో శత్రు సైన్యం విఫలమైంది. యుద్ధ సూత్రాలకు కట్టుబడి మేం విడుదల చేసిన వారిని కాపాడినట్టు ప్రకటించుకుంటుంది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. బెలూచ్ యోధులు వివిధ ప్రాంతాల్లో మెరుపుదాడులతో ఆక్రమిత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఆపరేషన్‌లో బెలూచ్ విజయం సాధించింది” అని మిలిటెంట్ సంస్థ పేర్కొన్నది. హైజాక్ సమయంలో మరణించిన బీఎల్‌ఏ సభ్యులకు మిలిటెంట్ సంస్థ నివాళులర్పించింది.
పాక్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బెలూచ్ వేర్పాటువాదులు మంగళవారం హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది బందీలు మరణించగా.. దాదాపు 33 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టి మిగతా ప్రయాణికులు అందరినీ సురక్షితంగా విడిపించామని పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. బెలూచ్ మిలిటెంట్లు చంపిన 26 మంది బందీల్లో 18 మంది సైనికులని పాక్ ఆర్మీ కూడా పేర్కొన్నది. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్టు ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే, బెలూచ్ మిలిటెంట్లు ఇందుకు విరుద్ధంగా పేర్కొన్నారు. పాక్ ప్రకటనను ఖండించటం గమనార్హం.