గాల్లో ప్రాణాలు !

– కేబుల్‌ కార్‌లో చిక్కుకున్న చిన్నారులు
– 1200 అడుగుల ఎత్తులో విలవిల
– పాక్‌లో ఘటన
ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో పర్వతప్రాంతమైన ఖైబర్‌ ఫక్తూన్‌ఖవా (కెపి)లోని బట్టగ్రామ్‌లో 8 మంది చిన్నారులు సహా 9 మంది కేబుల్‌ కారులో చిక్కుకొని విలవిల్లాడారు. స్కూలుకు వెళ్ళేందుకు ఈ పిల్లలు ప్రతి రోజూ లోయను దాటాల్సి వుంటుంది. అందుకోసం కేబుల్‌ కారును ఉపయోగిస్తారు. అయితే మంగళవారం నాడు మారుమూల పర్వత ప్రాంతంలో ప్రయాణం మధ్యలో కేబుల్‌ కారు వైర్‌ తెగింది. దీంతో 1200 అడుగుల ఎత్తులో పిల్లలు వేలాడుతూ విలవిల్లాడారు. చిన్నారులను రక్షించేందుకు హెలికాప్టర్‌ను రంగంలోకి దింపినా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఫలితం లేకుండాపోయింది. దీంతో కేబుల్‌ కార్‌ వరకూ వెళ్లిన హెలికాప్టర్‌ చిన్నారులను రక్షించకుండానే వెనుదిరిగింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పసి పిల్లలు బిక్కుబిక్కుమంటూ కేబుల్‌ కారులోనే వేలాడుతున్నారు. రక్షణ కోసం చిన్నారులు ఎదురుచూపులు చూస్తున్నారని సీనియర్‌ అధికారి అబ్దుల్‌ బసిత్‌ ఖాన్‌ తెలిపారు. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

Spread the love