– జూన్‌తో పోలిస్తే జులైలో 3,248 మెట్రిక్ టన్నులు అధిక దిగుబడి
– గతేడాది ఇదే కాలంతో పోల్చినా వృద్ధి నమోదు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఆయిల్‌పామ్ కర్మాగార పరిధిలో పామాయిల్ తాజా గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ) దిగుబడి ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు చీడపీడల ప్రభావం తగ్గుముఖం పట్టడం, తోటల నిర్వహణ మెరుగుపడటం వంటి కారణాలతో దిగుబడి ఆశాజనకంగా నమోదవుతోంది. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ పరిధిలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ కూడా ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడుతోంది.
2026 జూన్ నెలలో అశ్వారావుపేట ప్లాంట్‌కు మొత్తం 11,224.165 మెట్రిక్ టన్నుల ఎఫ్‌ఎఫ్‌బీ గెలలు చేరగా, జులై నెలలో 14,471.980 మెట్రిక్ టన్నులకు చేరాయి. అంటే ఒక్క నెలలోనే 3,247.815 మెట్రిక్ టన్నుల అదనపు దిగుబడి నమోదైంది.
అలాగే గతేడాది జూన్‌లో 11,960 మెట్రిక్ టన్నులు, జులైలో 12,590 మెట్రిక్ టన్నులు మాత్రమే గెలలు నమోదయ్యాయి. ఈ ఏడాది అదే కాలంతో పోలిస్తే జులై నెలలో దాదాపు 1,882 మెట్రిక్ టన్నుల అధిక దిగుబడి నమోదవడం గమనార్హం. నెలవారీ గణాంకాల ప్రకారం జూన్, జులై నెలల్లోనూ చివరి వారంలోనే అత్యధికంగా గెలలు కర్మాగారానికి చేరాయి. జూన్ చివరి వారంలో నెల మొత్తం దిగుబడిలో 45.61 శాతం, జులై చివరి వారంలో 38.08 శాతం గెలలు నమోదయ్యాయి. దీంతో రైతులు నెలాఖరులో పెద్దఎత్తున కోతలు చేపట్టి గెలలను కర్మాగారానికి తరలిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.



