సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి

నవతెలంగాణ-మణుగూరు
ఈ నెల 13వ తేదీ పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనంతో కూడిన ఇవ్వాలని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆదేశానుసారం సింగరేణి జిఎం పర్సనల్‌ సర్క్యులర్‌ జారీచేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏరియా ఎస్‌ఓటు జీఎం డి.శ్యాంసుందర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరావు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సింగరేణి పర్మినెంట్‌ కార్మికులతో పాటు కాంటాక్ట్‌ కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు దినం అని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ప్రకటించారనీ, పర్మినెంట్‌ కార్మికులకు సంబంధిత జీఎం పర్సనల్‌ పేరుతో సర్క్యులర్‌ జారీ అయినప్పటికీ కాంట్రాక్ట్‌ కార్మికులకు సంబంధించి ఇప్పటివరకు మాకున్న సమాచారం మేరకు ఎలాంటి సర్క్యులర్‌ జారీ కాలేదన్నారు. ఈ వారంలోగా సర్కులర్‌ రాకపోతే వేతనం చెల్లింపుకు మరలా నెల రోజులు జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. దయచేసి సర్క్యులర్‌ జారీకి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ.మంగీలాల్‌, ఉప్పల శివరామకృష్ణ, లక్ష్మణ్‌, రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love