సిరిసిల్ల టూ న్యూయార్క్‌ తొలిసారి విదేశాలకు జీఏపీ కంపెనీ ప్రొడక్ట్స్‌

– పెద్దూరు అపెరల్‌ పార్క్‌లో ఇంటర్నేషనల్‌బ్రాండ్‌ కంపెనీ ఉత్పత్తుల తయారీ
– త్వరలోనే టెక్స్‌పోర్ట్‌ కంపెనీ అల్లికల యూనిట్‌ ప్రారంభం
– ట్విట్టర్‌లో ప్రజలతో పంచుకున్న మంత్రి కేటీఆర్‌
ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు అభినందనల వెల్లువ
దేశంలోనే మొట్టమొదటిసారి జీఏపీ కంపెనీ ఉత్పత్తులు సిరిసిల్ల నుంచి విదేశాలకు నేరుగా ఎగుమతి కావడాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రజలతో పంచు కున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నుంచి అంతర్జాతీయ బ్రాండెడ్‌ ఉత్పత్తులు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో ఎగుమతి కావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఆయన ట్వీట్‌ను చాలా మంది రీ ట్వీట్‌ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
రెండు షిప్టుల్లో సుమారు 800 మందికి ఉపాధి
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ వస్త్ర ఉత్పత్తులు సిరిసిల్లలో రూపుదిద్దుకుని ముంబయి టూ న్యూయార్క్‌కు ఎక్స్‌పోర్ట్‌ అవుతున్నాయి. జిల్లా కేంద్ర శివారులోని పెద్దూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెరల్‌ పార్క్‌లో ఇండిస్టీ నెలకొల్పిన గోకుల్‌ అపెరియల్‌ సంస్థ స్థానికంగా 800 మంది మహిళలతో జీఏపీ బ్రాండ్‌ ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. సంస్థ స్థాపించిన కొద్దిరోజుల్లోనే ఉత్పత్తులను న్యూయార్క్‌కు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో జీఏపీ ఆర్గానిక్‌ కాటన్‌ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడం గర్వకారణమని ట్వీట్‌ చేశారు. మరో అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థ టెక్స్‌పోర్టు త్వరలోనే ప్రారంభవుతున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ కంపెనీ అయిన జీఏపీ ఉత్పత్తులు బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌ వంటి దేశాల నుంచే ఎక్కువగా విదేశాల్లోకి ఎగుమతి అవుతుం టాయి. అలాంటి కంపెనీకి చెందిన ఉత్పత్తులు సిరిసిల్లలోని పెద్దూరు అపెరల్‌పార్క్‌లో తయారై ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో శుక్రవారం ముంబయి నుంచి న్యూయార్క్‌కు ఎగుమతి అయ్యాయి. వస్త్ర పరిశ్రమకు జవసత్వాలు నింపేందుకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌కు రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్పత్తులైన బతుకమ్మ చీరలు, రంజాన్‌, క్రిస్మస్‌ గిఫ్ట్‌ప్యాక్‌లు, కేసీఆర్‌ కిట్స్‌, ఆర్‌వీఎమ్‌ వస్త్రాల ఆర్డర్లు ఇక్కడి నేతన్నకు ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో వర్కర్‌ టూ ఓనర్‌ పథకం కింద పెద్దూర్‌లో అపెరల్‌, వీవర్‌ పార్క్‌లను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇతర సంస్థలు, పెట్టుబడిదారులు ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న పెద్దూర్‌లో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.174కోట్లతో అపెరల్‌ పార్క్‌ను నిర్మించింది. 5వేల వరకు కుట్టుమిషన్ల ఏర్పాటుతో 8వేల మంది మహిళలకు ఉపాధి కల్పిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఇండిస్టీని స్థాపించిన ‘గోకుల్‌ అపెరియల్‌ సంస్థ’కు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) రూ.14.50కోట్లతో షెడ్డును కేటాయిం చింది. ప్రస్తుతం ఆ ఇండిస్టీలో 800 మంది మహి ళలు రెండు షిప్టుల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండెడ్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పంద ఉత్పత్తులు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. బాక్సుల్లో ప్యాక్‌ చేసి నేరుగా ఎగుమతి అవుతున్నాయి.మరోవైపు టెక్స్‌పోర్ట్‌ ఓవర్‌సీస్‌ కంపెనీ సైతం పెద్దూర్‌ అపెరల్‌ పార్క్‌లో ఏర్పాటు అయ్యేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అల్లికల యూనిట్‌ రంగంలో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందు కొచ్చింది. ప్రస్తుతం ఆ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒప్పందం పూర్తయింది. కంపెనీకి అవసర మైన షెడ్డు, ఇతర పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. వచ్చే నెలలో ఆ పనులు పూర్తవనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Spread the love