పాకిస్తాన్‌కు 300కోట్ల డాలర్ల ఐఎంఎఫ్‌ రుణం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకై ఆ దేశంతో 300కోట్ల డాలర్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. స్టాండ్‌ బై అరెంజ్‌మెంట్‌ (ఎస్‌బిఎ) ద్వారా మద్దతివ్వగలిగే విధానాలపై సిబ్బంది స్థాయిలో ఒప్పందం కుదిరినట్లు ఐఎంఎఫ్‌, పాక్‌ అధికారులు తెలిపారు. దాదాపు 300కోట్ల డాలర్ల మొత్తానికి 9మాసాల ఎస్‌బిఎపై కుదిరిన సిబ్బంది స్థాయి ఒప్పందాన్ని జులై మధ్యలో ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోదించాల్సి వుందని ఒక ప్రకటనలో ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ కొత్త స్టాండ్‌ బై అరెంజ్‌మెంట్‌ వలల్ల అధికారులు తక్షణమే ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే చర్యలు చేపట్టడానికి వీలవుతుందని ఆ ప్రకటన తెలిపింది. ద్వైపాక్షిక, బహుళ పక్ష భాగస్వాముల నుండి ఆర్థిక సాయం పొందడానికి ఒక చట్రపరిధిని రూపొందించడం, సూక్ష్మ ఆర్థిక సుస్థిరతను పరిరక్షించడం ఇందులో భాగంగా వుంటాయి. కొత్త ఎస్‌బిఎతో, దేశీయ రెవిన్యూ వసూళ్ళను మెరుగుపరచడం ద్వారా సామాజిక, అభివృద్ధి వ్యయానికి మరింతగా స్థానం కల్పించబడుతుందని పేర్కొంది.
మరింత ఆర్థిక క్రమశిక్షణను పాటించడంతో సహా ప్రస్తుతమున్న సవాళ్ళను అధిగమించడానికి నిలకడగా విధానాల అమలు అనేది చాలా కీలకమని ఐఎంఎఫ్‌ వ్యాఖ్యానించింది.

Spread the love