లెఫ్టినెంట్‌ జనరల్‌తో సహా ముగ్గురు అధికారుల్ని తొలగించిన పాక్‌

ఇస్లామాబాద్‌ : మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు తరువాత జరిగిన హింసాకాండను నిరోధించడంలో విఫలమైనందుకు లెఫ్టినెంట్‌ జనరల్‌తో సహా ముగ్గురు అధికారుల్ని పాకిస్థాన్‌ సైన్యం తొలగించింది. అలాగే ముగ్గురు మేజర్‌ జనరల్‌లు, ఏడుగురు బ్రిగేడియర్‌లపై కూడా చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని పాక్‌సైన్యం సోమవారం వెల్లడించింది. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు తరువాత మే 9న పిటిఐ పార్టీ మద్దతుదారులు పాక్‌లోని వివిధ సైనిక స్థావరాలపై దాడికి దిగి వాటిని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాక్‌ సైన్యం ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అర్హద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ఇప్పటికే అధికారులపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే, మే 9న జరిగిన హింసాకాండలో పాల్గొన్న వారందరూ రాజ్యాంగం, చట్ట ప్రకారం శిక్షించబడతారని కూడా షరీఫ్‌ చెప్పారు.

Spread the love