రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి

– ప్రతిపక్షాల మధ్య బంధం మరింత బలోపేతం కావాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఉద్ఘాటన
– మణిపూర్‌లో శాంతిని నెలకొల్పండి
– అమెరికా ముందు మరింతగా సాగిలపడిన మోడీ సర్కార్‌

అస్సాం పునర్విభజన
2023వ సంవత్సరంలో, 2001 జనాభా లెక్కల ప్రాతిపదికగా కేవలం అస్సాంలోనే అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడాన్ని పొలిట్‌బ్యూరో వ్యతిరేకిస్తోంది. పునర్విభజన కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయ కుండానే, పాలక బీజేపీ రాజకీయ లక్ష్యా లను మరింత ముందుకు తీసుకెళ్ళేం దుకు గానూ ఎన్నికల కమిషనే ఈ ప్రక్రియను చేపట్టిందన్నది సుస్పష్టం.

రాష్ట్రాలకు బియ్యం సరఫరా పునరుద్ధరణ
రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం అమ్మరాదని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)ని మోడీ ప్రభుత్వం ఆదేశించిన తీరు అత్యంత నిరంకుశమైనది, అప్రజాస్వామికమైనది. ఉపశమనం కలిగించేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీియేతర ప్రభుత్వాలను అడ్డుకోవడానికే ఈ చర్య ఉద్దేశించబడింది.

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ తదుపరి సమావేశం ఆగస్టు 4,5,6 తేదీల్లో న్యూఢిల్లీలో ఉంటుంది.
న్యూఢిల్లీ : ప్రజాతంత్ర హక్కులు, పౌర స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు మన రాజ్యంగం ప్రసాదించిన హామీలను, మన రిపబ్లిక్‌ యొక్క లౌకిక, ప్రజాతంత్ర స్వభావాన్ని కాపాడుకు నేందుకు ప్రతిపక్షాల మధ్య సహకారం మరింతగా పెంపొం దాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఉద్ఘాటించింది. పార్టీ పొలిట్‌బ్యూరో ఈ నెల 24, 25 తేదీల్లో ఢిల్లీలో సమావేశమై దేశం నేడు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించింది. అనంతరం సోమవారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీ, మణిపూర్‌ సంక్షోభం, ప్రధాని మోడీ అమెరికా పర్యటన, ఉమ్మడి పౌర స్మృతి, ప్రజా ధనం లూటీ, రాష్ట్రాలకు ఆహారధాన్యాల సరఫరాలో అడ్డం కులు, స్మార్ట్‌ మీటర్లు, రెజ్లర్ల నిరసన తదితర అంశాలపై పార్టీ తన వైఖరిని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది.
మణిపూర్‌
మే 3న ప్రారంభమై గత ఏడు వారాలుగా అడ్డూ అదుపు లేకుండా కొనసాగు తున్న జాతుల హింస పట్ల పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తంచేస్తున్నది. పరిస్థితిని అదుపు చేయడంలో డబుల్‌ ఇంజన్ల బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్కడి పరిస్థితులపై కనీసం వ్యాఖ్యానించడానికి కూడా ప్రధాని మోడీ తిరస్కరించారు ! హింస ప్రారంభమైన 26 రోజుల తర్వాత మే 29న కేంద్ర హోం మంత్రి పర్యటించారు. కానీ అక్కడ శాంతి భద్రతల పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులను సమర్ధవం తంగా నియంత్రించలేని, పైగా ఉదాసీనంగా వ్యవహరించిన బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం తిరస్కరించడంతో కేంద్ర హోం మంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం వల్ల ఎలాంటి ఫలితం లేకపోయింది. తక్షణమే మణి పూర్‌లో హింసను విరమించి, సాధారణ పరిస్థితులను పునరు ద్ధరించాలని పొలిట్‌ బ్యూరో పిలుపిచ్చింది.
ఉమ్మడి పౌర స్మృతి
ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) అంశంపై లా కమిషన్‌ మళ్ళీ చర్చలు, సంప్రదింపులు ప్రారంభించింది. గత లా కమిషన్‌ కూడా ఇదే తరహా ప్రక్రియ చేపట్టి, ”ఈ తరుణంలో యుసిసి అవసరం లేదు, వాంఛనీయం కూడా కాదు.” అని 2018లో నిర్ధారణకు వచ్చింది. సిపిఎం ఈ వైఖరిని బలపరిచింది. ఏకరూప తను సమానత్వంతో సమం చేయలేం. అన్ని కమ్యూనిటీలకు చెందిన మహిళలకు సమాన హక్కులు కావాలని పోరాడడంలో సీపీఐ(ఎం) ఎప్పుడూ ముందుంటుంది. అన్ని కమ్యూనిటీలకు చెందిన స్త్రీ, పురుషుల క్రియాశీలమైన ప్రజాస్వామిక భాగస్వామ్యంతో, వివిధ కమ్యూనిటీలకు వర్తించే వ్యక్తిగత లేదా సాంప్రదాయ చట్టాలను సంస్కరించడం ద్వారా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళవచ్చు.
ప్రజా ధనం లూటీని చట్టబద్ధం చేయడం
పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించే సామ ర్ధ్యం వున్నా కూడా చెల్లిం చడానికి తిరస్క రించే విల్‌ఫుల్‌ డీఫాల్టర్లు (ఉద్దేశ్యపూర్వక ఎగవేత దారులు) చేసే ప్రజా పొదుపు మొత్తాల దోపిడీని చట్టబద్ధం చేస్తూ ఆర్‌బిఐ తీసుకొచ్చిన సర్క్యులర్‌ను ఉపసంహరించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఇటువంటి ఎగవేతదారులు బ్యాంకులతో రాజీ పరిష్కారం కుదుర్చుకోవడానికి ఆర్‌బిఐ సర్క్యులర్‌ అనుమతిస్తోంది. అటువంటి వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి, వాటి నుండి బ్యాంక్‌ రుణాలను పూర్తిగా రికవరీ చేయాలి.
ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రాజెక్టు రద్దు
విద్యుత్‌ వినియోగదారుల కొరకు ముందస్తు బిల్లుల చెల్లింపు ఏర్పాట్లతో తీసుకొచ్చిన స్మార్ట్‌ మీటర్ల ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయాలని, తద్వారా విద్యుత్‌ పంపిణీ బాధ్యత నుండి వైదొలగి, గరిష్ట స్థాయిలో లాభాలు కోసం ప్రైవేటు కార్పొరేట్లకు విద్యుత్‌ పంపిణీని అప్పగించాలంటూ అనేక రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ చర్యలు పేదలపై, రైతులపై భరించలేని భారాన్ని మోపుతాయి. అందువల్ల తక్షణమే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలి.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే నుండి వైకల్యానికి సంబంధించిన ప్రశ్నలు మినహాయింపు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 నుండి వైకల్యానికి సంబంధించిన ప్రశ్నలను తొలగించడం పట్ల పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత రౌండ్‌లో వేసిన ప్రశ్నలు లోపభూయిష్టంగా వున్నప్పటికీ, ఈసారి మొత్తంగా వాటిని తొలగించడమనేది తిరోగమన చర్య. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-6లో వైకల్యానికి సంబంధించిన ప్రశ్నలను చేర్చాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.
పశ్చిమ బెంగాల్‌ పంచాయితీ ఎన్నికలు
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో ఎప్పటిలాగే ఆనవాయితీగా పెద్ద ఎత్తున హింసాకాండ, భయోత్పాతం నెలకొన్నాయి. కొనసాగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 10మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సిపిఎం యువ కార్యకర్త కామ్రేడ్‌ మన్సూర్‌ ఆలమ్‌ కూడా వున్నారు.
ఇటువంటి హింస, భయోత్పాత రాజకీయాలు నెలకొన్నప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని ఇలా హత్య చేయడాన్ని పశ్చిమ బెంగాల్‌ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ప్రజా పంచాయితీలు పెట్టడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు. గత పంచాయితీ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో భయోత్పాతం నెలకొనడంతో 34శాతం సీట్లలో ఎలాంటి పోటీ లేకుండా పోయింది. ఈసారి అటువంటి భయాందోళనలను ప్రతిఘటిస్తూ, ఈ ఎన్నికల్లో పోటీ లేకుండా పోయిన సీట్ల సంఖ్య గణనీయంగా దాదాపు మూడింట రెండు వంతులు తగ్గిపోయింది.
పాట్నా సమావేశం
బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 23న పాట్నాలో 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. మన రిపబ్లిక్‌ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని, ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛ, ప్రాథóమిక హక్కులకు మన రాజ్యాంగం ఇస్తున్న హామీలను పరిరక్షించేందుకు ప్రతిపక్ష పార్టీల మధ్య సహకారం నెలకొనాల్సిన అవసరం వుందని సిపిఎం నొక్కి చెప్పింది. జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే కీలకాంశాలపై అఖిల భారత స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ సంయుక్తంగా ప్రచారాలు నిర్వహించాలని, వేగంగా క్షీణిస్తున్న ప్రజల జీవనోపాధి అంశాలపై ఉమ్మడిగా నిరసన కార్యాచరణలు చేపట్టాలని సిపిఎం ప్రతిపాదించింది. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లలో చీలిక నుండి బిజెపి ప్రయోజనాలు పొందే అవకాశాన్ని వీలైనంత వరకు తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాల స్థాయిలో ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు మొదలుకావాలి.
రెజ్లర్ల నిరసన
తమపై లైంగిక వేధింపులకు సంబంధించి మహిళా రెజ్లర్లు ప్రాధమిక సాక్ష్యాధారాలు అందచేసినప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపిని మోడీ ప్రభుత్వం, బీజేపీ నిస్సిగ్గుగా సమర్ధించుకోవడం చూస్తుంటే తమ మద్దతుదారులను ఎలాగైనా కాపాడుకో వాలనే కృత నిశ్చయం వారి చర్యలో ప్రతిబింబిస్తోంది. బాధితురాలిపై ఒత్తిడి తీసుకొచ్చి, ఆమె తన ప్రకటన ఉపసంహరించుకునేలా చేసేందుకై నిందితుడికి కావాల్సిన సమయం ఇచ్చేందుకు గానూ పోస్కో కింద అభియోగాలు నమోదు చేయడంతో పాటు కేసులో దర్యాప్తులను ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేసే చర్యలన్నీ చేపట్టారు. ఇకపై లైంగిక వేధింపులు ఎదుర్కొనే మైనర్లయిన బాధితులు ఫిర్యాదులు చేసే అన్ని కేసులకు దీనివల్ల తీవ్రమైన పర్యవసానాలు వుంటాయి. నిందితుడైన ఎంపీని ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను సిపిఎం పునరుద్ఘాటించింది.
ప్రధాని మోడీ అమెరికా పర్యటన
తాజాగా అమెరికాలో ప్రధాని మోడీ జరిపిన అధికార పర్యటనతో, అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్‌ భాగస్వామిగా భారత్‌ మరింతగా సాగిలపడేలా బంధాన్ని ముడివేసుకుంది. సంయుక్తంగా జిఇ-ఎఫ్‌ 414 జెట్‌ ఇంజన్లను తయారు చేయడంతో సహా ఈ పర్యటనలో కుదిరిన రక్షణ ఒప్పందాలు, అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా భారత్‌ గతంలో కుదుర్చుకున్న ప్రధాన సైనిక, రక్షణ ఒప్పందాలన్నింటి కన్నా మిన్నగా వున్నాయి. ప్రపంచ గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తహతహ లాడుతున్న అమెరికా, చైనాను ఏకాకిని చేసేందుకు భారత్‌ను కీలకమైన వ్యూహాత్మక, సైనిక భాగస్వామిగా చూస్తోంది. మోడీ ప్రభుత్వ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య క్షీణత వంటి అంశాలను ప్రస్తావించేందుకు బైడెన్‌ ప్రభుత్వం తిరస్కరించడం విస్తృతంగా విమర్శలకు గురైంది. చివరకు అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామా కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. మానన హక్కులు, ప్రజాస్వామ్యంపై మోడీ ప్రభుత్వ రికార్డు పట్ల అమెరికా కాంగ్రెస్‌కు చెందిన 75మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని ప్రస్తావించారు.

Spread the love