కేంద్రమంత్రులతో సీతక్క భేటీ

కేంద్రమంత్రులతో సీతక్క భేటీ– రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర మంత్రులతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం భేటీ అయ్యారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద పది లక్షల గృహాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు నిధులు కేటాయించా లని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి చంద్రకాంత్‌ రఘునాథ్‌ పాటిల్‌ను, పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ. 1,544 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌లతో కలిసారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 53.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందని, కొత్తగా నిర్మించిన గృహాలకు నల్లాల ద్వారా నీటిని అందించేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి శాఖా మంత్రిని కోరారు. రాష్ట్రంలో 6,176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని రాజీవ్‌ రంజన్‌ సింగ్‌కు నివేదించారు.
తాత్కాలిక భవనాల్లో ఆఫీసులు కొనసాగుతున్నాయని, స్వంత భవనాలు కాకపోవడం వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ స్కీం ద్వారా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
రాహుల్‌ను కలిసిన సీతక్క
న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శాలువా కప్పి రాహుల్‌ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను అప్యాయంగా పలుకరించిన రాహుల్‌ గాంధీ, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Spread the love