యువతకు స్కిల్స్‌ ఎంతో అవసరం

హైదరాబాద్‌లో జూన్‌ 3, 4 తేదీల్లో జాబ్‌ మేళా : కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
దేశంలో యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే.. స్కిల్స్‌ ఎంతో అవసరం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఎన్‌ఎస్‌టీఐలో శుక్రవారం జరిగిన కౌశల్‌ మహోత్సవ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే జాబ్‌మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరుకావాలని చెప్పారు. ఈ మేళాకు 220 కంపెనీలు వస్తున్నాయని.. దీనిని యువత ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ జాబ్‌ మేళాలో పాల్గొనే యువత kaushal mahotsav.nsdcdigital.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని చెప్పారు. 8వ తరగతి పాసైన, ఫెయిలైన 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఈ జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఏమైనా ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్స్‌ ఉన్నా తీసుకురావాలని, ఒక ఫొటో ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస యోజన కార్యక్రమం రూపకల్పన చేసి స్కిల్‌ ఇండియా పేరుతో యువతను స్కిల్స్‌ వైపు నడిపించడం జరుగుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమావేశానికీ రారన్నారు. శుక్రవారం నిటి అయోగ్‌ సమావేశానికి కూడా ఆయన రావడం లేదని సమాచారం ఉందని.. ఇది బాధ్యతారహితమైన చర్య అని అన్నారు. సీఎం కేసీఆర్‌ పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే అదేమైనా ఆగుతుందా అని ప్రశ్నించారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసైని ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు.

 

Spread the love