స్మర నారాయణీయం!

కొన్ని జ్ఞాపకాలు చెదరిపోవు. అట్లే అదను చూసి చెప్పిన పదునైన సంభాషణలు గాలిలో కలిసిపోవు. అట్లాంటి సంఘటనలు మహాకవి సి.నారాయణరెడ్డితో గడిపిన క్షణాలు నిత్య స్మరణీయాలు. సినారె కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, వెండితెర గీతాల వెలుగుగా మనకు సుపరిచితులే. వారు ఎన్నో హోదాలలో పనిచేశారు. ఆచార్యునిగా, ఉపకులపతిగా, సాంస్కతిక శాఖ సలహాదారుగా, అట్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. అన్ని పదవులకు తన వ్యక్తిత్వంతో గౌరవాన్ని, వన్నెను తెచ్చారు. కానీ అధికార భాష సంఘ అధ్యక్షునిగా ఉన్న కాలంలో కొంత అసంతప్తి వారికి ఉండేదేమో అని సన్నిహితులకు అన్పించేది. వారు ఆ పదవిలో ఉన్న కాలంలో ఒక విలేకరి మిత్రుడు సినారెను ‘సార్‌! మీ అధికార భాషా సంఘం పనితీరు ఎలా ఉంది?’ అని ప్రశ్నించాడు. వెంటనే ‘మూడు తెలుగు టైపు మిషన్లు, ఆరు తెలుగులో ఉత్తర్వులుగా విరాజిల్లుతున్నద’ని చమత్కరించారు. కొంచెం వివరంగా చెప్పండి సార్‌ అని ఆ విలేకరే ఆసక్తిగా అభ్యర్థించాడు. అప్పుడు సినారె అట్లా కాదు కానీ మీకు ఓ కథ చెబుతాను. అదే మీకు పూర్తిగా అర్థం చేయిస్తుందని కథ చెప్పడం మొదలుపెట్టారు. విలేకరుల సమావేశం తరగతి గదిలా మారిపోయింది.
కథ ఇలా… ఒక ఊరిలో అతి ప్రాచీనమైన దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. దాని చరిత్ర క్షేత్ర పవిత్రత దష్టిలో ఉంచుకొని ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని, జీర్ణావస్థ నుండి జీవావస్థకు తీసుకురావాలని ఊరి పెద్దలు నిర్ణయించారు. పలుమార్లు సమావేశమై ఒక అధ్యక్షున్ని, కొంతమంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎట్లాగైనా ఆ దేవాలయాన్ని పూర్వస్థితికి తీసుకురావాలన్నదే గ్రామస్తుల నిశ్చితాభిప్రాయం. గ్రామ నిర్ణయం తలదాల్చిన కమిటీ సభ్యులు అనేకమార్లు వాయిదా పర్వాల గండాలను అధిగమించి, ఎన్నోసార్లు సమావేశమై తుది నిర్ణయానికి వచ్చి ఈ తీర్మానాలు చేశారు. ఈ దేవాలయం పరమ పవిత్రమైనది. ఈ గుడి నిర్మాణానికి వాడిన మట్టి, రాయి, శిల్ప సంపద మహా పవిత్రమైనవి. నిర్మాణం గత ప్రణాళిక ఆధారంగా చేసుకొని యధాతథంగా వీటితోనే నిర్మించాలి. దేవాలయ వాస్తుకు భక్తుల విశ్వాసాలకు భంగం రానికుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు. చివరగా మరో తీర్మానాన్ని పేర్కొంటూ ప్రస్తుతానికి దేవాలయాన్ని నిర్మించడానికి చాలినన్ని నిధులు మన దగ్గర లేవు. కాబట్టి గుడి యథాతత స్థితిని కొనసాగించాలని పేర్కొని సమావేశాన్ని ముగించారు. అట్లా ఉంది అధికార భాషా సంఘం కార్యకలాపాలని చెప్పి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ కొయ్య గుర్రపుతనాన్ని వ్యంగ్యమైన ఈ ఈ కథతో జోడించి విషాదాన్ని విలేకరులకు పంచేసరికి అంతా విస్మయంలోకి జారుకున్నారు. ఇప్పటికీ అధికార భాషా సంఘం యధాతథ స్థితిలో కొనసాగడం పెను విషాదం. మహాకవి నారాయణరెడ్డి 93వ జయంతి సందర్భంగా ఈ సంఘటనను నెమరు వేసుకోవలసిన అవసరం ఉంది. లేక లేక ఈ కొత్త ప్రభుత్వం రుణమాఫీ ఉత్తర్వులు తెలుగులో వెలువరిస్తే అటు ప్రజలు ఇటు తెలుగు భాషాభిమానులు ఎంతగానో సంతోషించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి, తెలుగు భాషా వాడకాన్ని, వ్యాప్తిని మెరుగుపరుస్తారని ఆశిస్తూ సినారెలో రగిలిన అసంతప్తిని ఇప్పటికైనా చల్లారుస్తారని తెలుగు భాషాభిమానులుగా ఆశిద్దాం.
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261

Spread the love