వార్తల కోసం సోషల్‌ మీడియా పైనే ఆధారం

వార్తల కోసం సోషల్‌ మీడియా పైనే ఆధారం– 50 శాతం మందికి పైగా భారతీయుల మనోగతం
– ప్రధాన స్రవంతి మీడియాపై క్షీణిస్తున్న నమ్మకం
– ‘రాయిటర్స్‌’ నివేదిక
న్యూఢిల్లీ : ఒకప్పుడు వార్తలంటే రేడియో, టీవీలలోని పలు వార్త ఛానెళ్లు, వార్త పత్రికల మీదనే ప్రజలు ఆధారపడేవారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డిజిటలైజేషన్‌ రాజ్యమేలుతున్నది. దీంతో ప్రజల్లో సామాజిక మాధ్యమాల వినియోగం క్రమంగా పెరిగిపోయింది. మొదట్లో, సామాజిక మాధ్యమాలను కేవలం ఆటవిడుపు కోసం వాడేవారు. అయితే, ఇప్పుడా సామాజిక మాధ్యమాలు వార్తా ప్రసార మాధ్యమాలుగా మారాయి. ముఖ్యంగా, భారత్‌ వంటి దేశంలో 50 శాతం మందికి పైగా ప్రజలు వార్తల కోసం సోషల్‌ మీడియా పైనే ఆధారపడుతుండటం గమనార్హం. భారత్‌లోని ప్రధాన స్రవంతి మీడియాపై ప్రజలలో నమ్మకం క్షీణిస్తున్నది. రాయిటర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘2024 డిజిటల్‌ న్యూస్‌’ నివేదిక ఈ విషయాలను కనుగొన్నది. ఇది చాలా మంది భారతీయులను వార్తల కోసం వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్‌ యాప్‌లపై ఆధారపడేలా ప్రేరేపించిందని వివరించింది.
రాయిటర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన సర్వే చేసి రూపొందించిన నివేదిక ప్రకారం.. దాదాపు సగం మంది మంది భారతీయులు యూట్యూబ్‌ (54 శాతం), వాట్సాప్‌ (48 శాతం) ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఎక్స్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలు కొంత వరకు తమ ఆదరణను కోల్పోతున్నాయి. పెరుగుతున్న తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, విశ్వసనీయతలో రాజీపడటం, రాజకీయ నాయకులకు లొంగటం, అనిశ్చిత వ్యాపార వాతావరణం వంటి కారణాలతో ప్రధాన స్రవంతి వార్తా మాధ్యమాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సవాలును ఎదుర్కొంటున్నాయి. సోషల్‌ మీడియా నుంచి వచ్చే తీవ్రమైన పోటీ కారణంగా జర్నలిస్టుల తొలగింపు, మీడియా సంస్థల మూసివేత, పెరుగుతున్న వ్యయాలు, పడిపోతున్న ప్రకటనల ఆదాయాలు వంటి కోతలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.
అనేక దేశాల్లో, ముఖ్యంగా యూరప్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ వెలుపల వార్తల కోసం ఫేస్‌బుక్‌ వినియోగంలో గణనీయమైన క్షీణత నమోదైంది. ప్రయివేట్‌ మెసేజింగ్‌ యాప్‌లు, వీడియో నెట్‌వర్క్‌లతో సహా అనేక రకాల ప్రత్యామ్నాయాలపై ప్రజలు ఆధారపడుతున్నారు. గత సంవత్సరంలో అన్ని దేశాలలో ఫేస్‌బుక్‌ వార్తల వినియోగం 4 శాతం తగ్గటం గమనార్హం. ఇప్పటివరకు యూట్యూబ్‌.. వార్తల కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వేదికగా అభివృద్ధి చెందుతున్నది. సర్వేలో పాల్గొన్న మూడో వంతు మంది యూట్యూబ్‌ (31 శాతం), వాట్సాప్‌ (21 శాతం), టిక్‌టాక్‌ (13 శాతం)లపై ఆధారపడుతున్నారు. కాగా, 10 శాతం మంది వార్తల కోసం ఎక్స్‌ (గతంలో దీనిని ట్విట్టర్‌గా పిలిచేవారు)పై ఆధారపడుతున్నామని చెప్పటం గమనార్హం.
ఇక ఫార్మాట్‌కు సంబంధించి, ముఖ్యంగా యువతలో వార్తల కోసం వీడియోను ఎక్కువగా కోరుకుంటున్నారు. దాదాపు మూడింట రెండు వంతుల (66 శాతం) మంది చిన్న వార్తల వీడియోల ద్వారా వార్తలను పొందటానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 51 శాతం పొడవైన వార్తల ఫార్మాట్‌లను ఇష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 మందిలో ఆరుగురు (59 శాతం) ఇంటర్నెట్‌లో ఏది అసలైన, నకిలీ అనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది కాలంలో ఈ సంఖ్య 3 శాతం పెరగటం గమనార్హం. కేవలం 40 శాతం మంది మాత్రమే వార్తలను విశ్వసిస్తున్నారు. ఇక 20 సంపన్న దేశాలలో.. కేవలం 17 శాతం మంది గత సంవత్సరంలో ఏదైనా ఆన్‌లైన్‌ వార్తల సభ్యత్వానికి చెల్లింపు చేసినట్టు చెప్పారు. ఈ జాబితాలో నార్వే (40 శాతం మంది), స్వీడన్‌ (31 శాతం) అగ్రస్థానంలో ఉండగా.. జపాన్‌ (9 శాతం), యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (8 శాతంతో) దిగువ స్థానాల్లో ఉన్నాయి.

Spread the love