– సత్తుపల్లి సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి
– చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకుంటే ప్రభుత్వాలు దుందుడుకుగా వ్యవహరిస్తారు
– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మాదినేని, మన్నేపల్లి
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని సత్తుపల్లి అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి స్పష్టం చేశారు. బుధవారం సత్తుపల్లిలోని ప్రజా సంఘాల భవన్లో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో భారతి మాట్లాడారు. ఈ తొమ్మిదిన్నర యేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. డిగ్రీ పట్టాలున్నా ఉపాధిలేక దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క డీఎస్సీ వేయలేని పరిస్థితి ఉందన్నారు. గ్రూపు-1 వేసి పరీక్షలు రాయించి మరీ పథకం ప్రకారంగానే రద్దు చేయించారని భారతి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఉద్యమాలను అణచివేసేందుకు ఉపయోగించుకొనే ఒక్క పోలీసు రిక్రూట్మెంట్ తప్ప లక్షలాదిగా వివిధ ఖాళీగా పడివున్న పోస్టుల భర్తీపై కేసీఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేకుండా పోయిందన్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేశ్, మన్నేపల్లి సుబ్బారావు కోరారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకుంటే ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులు పెట్టే చట్టాలకు పదును పెడతాయన్నారు. ప్రశ్నించే గొంతుకలు లేనప్పుడే పాలకులు నిరంకుశత్వ పాలన సాగిస్తారని వారన్నారు. ప్రజలు కూడా నోటుకు ఓటుకు దూరంగా ఉండాలన్నారు. స్వచ్ఛందంగా, నిజాయితీ ఓటుహక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందన్నారు. వాళ్లిచ్చే డబ్బులకు ఆశపడితే ఈ ఐదేండ్లు మనల్ని బానిసలుగా చూస్తారని రమేశ్, సుబ్బారావు అన్నారు. సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి గెలుపుకోసం సుత్తీ, కొడవలి నక్షత్రం గుర్తుపై అత్యధికంగా ఓట్లేసి అఖండ మెజారీతో గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు, జాజిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) నుంచి మాచర్ల, కొలికపోగు నామినేషన్
సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి సీపీఐ(ఎం) పార్టీ నుంచి మాచర్ల భారతి, కొలికపోగు సర్వేశ్వరరావు బుధవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థి వెంట మరో నలుగురికి ఎన్నికల అధికారులు అనుమతినిచ్చారు. ఈ నలుగురిలో ఒకరు మాత్రమే అభ్యర్థి నామినేషన్ను బలపర్చారు. నామినేషన్ పత్రాలను పూరించే విషయంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మాదినేని రమేశ్, మన్నేపల్లి సుబ్బారావు సహకరిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు చలమాల విఠల్రావు, జాజిరి శ్రీనివాస్, రావుల రాజబాబు, సీహెచ్ బాలకృష్ణ, బండి వేలాద్రి, మాచర్ల గోపాల్, పాకలపాటి ఝాన్సీ పాల్గొన్నారు.
సత్తుపల్లిలో ఇప్పటి వరకు 12 నామినేషన్లు దాఖలు
ఇప్పటి వరకు సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే 8 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సీపీఐ(ఎం) నుంచి మాచర్ల భారతి, కొలికపోగు సరేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ప్రజాపంథా నుంచి బీరెల్లి లాజరు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఆకుల పాల్, జకల జనుల పార్టీ నుంచి కుక్కముడి బాల ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థులుగా ఇస్నపల్లి రామారావు, మాడుగుల చిన్న కృష్ణయ్య నామినేషన్లు వేశారు.