కొన్నినీడలు..

కొన్నినీడలు..కొన్నినీడలు..
నువ్వు కాసేపు ఊరడిల్లడానికి
నీకు తోడుగా అట్లా
ఉదయపు నీరెండలోనో
సాయంత్రపు నీరెండకో
పరచుకొని ఉంటాయి అలా.
వాటిని చూస్తూ
కాలంతో పోటీపడి
చేస్తున్న పరుగులాటను ఆపి
కాసేపు మైమరచిపోతావు.

గాలికి కదలాడుతున్న కొమ్మను చూస్తూనో,
నేలమీద గిరికీలు కొడుతున్న ఆకును చూస్తూనో,
బాల్యపు దొంతరల్లోకో
ప్రేమను హత్తుకున్న క్షణాల్లోకో
జారిపడిపోతావు.

ఇక అట్లా నీడలు
నీలోకి నడచి వస్తూ ఉంటాయి.
నీడల్లాంటి మనుషులు
నీకు నీడనిచ్చినవాళ్లు
నీడల్లాంటి జ్ఞాపకాలు..
అక్కడి నుండి ఎక్కడికీ
ఇక కదలాలనిపించదు.
అలాఎంతసేపు
ఆ నీడల అబ్‌స్ట్రాక్ట్‌
పెయింటింగ్‌లో
నువ్వొక రంగువయ్యావో
లెక్కతేలక ముందే..
కాలం గంట కొడుతుంది.

ఏ దిక్కు నుండో ఎగిరొచ్చిన పిట్టలు
మెల్లగా గూళ్లకు చేరుతుంటాయి.
పిల్లలు ఆడిఆడి అలసిపోయి
ఆటలు చాలించి ఇక ఇండ్లకు
పరిగెత్తినట్టు.. నీకూ వెళ్లాలనిపిస్తుంది
చూస్తూ చూస్తుండగానే నీడలు
అస్తమయపు చీకటిలోకి
నెమ్మదిగా మాయమవుతాయి.

ఆ నీడల్లాగే
అక్కడే ఉండలేక, వెళ్లలేక..
చేసేదేమీలేక నువ్వూ లేచి ఇక
వీధి దీపాలు దారి చూపుతుండగా
తడుముకుంటూ నడకసాగిస్తావు.
తప్పిపోయిన కుక్కపిల్లలా
కుయ్యుకుయ్యుమంటూ
నీ నీడ వెంటరావడం
గమనించకుండానే.
– శైలజ బండారి

Spread the love