దర్జీ

దర్జీ
”మర్యాదల టేపు కొలతలతో
విలువల అంబరాన్ని కలిపికుట్టి
మనిషికి సిగ్గు కప్పే దర్జీ” అంటారు ప్రముఖ కవి రావి రంగారావు.
నిజమే కదా! మనకు టైలర్‌ అనగానే చెవిలో పెన్సిలు, చేతిలో కత్తెర, మనిషి దేహపు కొలతలను తీసుకోవడానికి టేపు, సైజుల వారీగా కొన్ని కుట్టిన బట్టలు.. పక్కన కుప్పలుగా ఉన్న దృశ్యం మన మనోయవనికపై ప్రత్యక్షమౌతుంది. కొంచెం పోష్‌గా, సిటీలలో షాపులలో గాజుతలుపుల మధ్య, అలమార్లలో- హ్యాంగర్లకు తగిలించిన గుడ్డలు గుర్తుకొస్తాయి. అనేక సినిమాల్లో స్త్రీల ఇంట్లో కుట్టు మిషనుపై టకటకా బట్టలు కుట్టేస్తూ, తమ పిల్లలను పెంచి, పెద్ద చేసిన ఉదంతాల ఇతివృత్తాలు ఎన్నో. వాస్తవ జీవితంలోనూ అవి వాస్తవాలే.
బట్టను కత్తిరించి, కలిపి కుట్టి ఓ రూపు తెచ్చేది దర్జీలు.. ఆ దుస్తులు మనిషికి దర్జాను తీసుకువస్తాయి. ఇలా ఓ మనిషికి బట్టలతో హుందాతనాన్ని తీసుకువచ్చేది దర్జీలే. ఒకప్పుడు టైలర్‌ అంటే.. టైగర్‌! ఆ వీధికి రారాజు అన్నట్టే! కుట్టు మిషన్‌ మీద కూర్చుని, పట్టుదలతో పని మొదలు పెడితే.. నేత వస్త్రం మీద ముగ్గేసినట్టే. దర్జీ దర్జాయే వేరు. ఊరి సర్పంచ్‌ వచ్చినా లేవడు. ఏంతటి వారైనా ఆయన ముందు విధేయంగా నిలబడాల్సిందే. చేయి ఎత్తమంటే ఎత్తాలి. దించమంటే దించాలి. పండుగలు, శుభకార్యాల సమయంలో వారికి చేతినిండా పని ఉండేది. తిందామన్నా తీరిక ఉండేది కాదు. కాల క్రమంలో రెడీమేడ్‌ దుస్తుల రాకతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కొత్త ఫ్యాషన్‌లకు అనుగుణంగా బట్టలు కుట్టే నేర్పు ఉన్నా.. రెడీమేడ్‌ దుస్తుల వల్ల వారికి ఆదరణ తగ్గుతూ వస్తోంది.
బ్రాండెడ్‌ దుస్తుల హవా మొదలైన తర్వాత అతని ఘనత మసకబారింది. తెగిపోయిన కుట్లు వేసివ్వడానికే పరిమితం అయ్యాడు. ఆల్టరేషన్‌కే అంకితమైపోతున్నాడు. బతుకుల్లో మాత్రం దర్జా మాయమవుతోంది. రెడీమేడ్‌ దుస్తుల రాకతో ఉపాధి కరువైంది. కుల వృత్తినే నమ్ముకున్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. చాలామంది బతుకుదెరువు కోసం తెలంగాణ వాసులెందరో గల్ఫ్‌బాట పడుతున్నారు. కొందరు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. దర్జీల బతుకుల్లో దర్జా లేదిప్పుడు… ఒక నాడు దర్జాగా బతికిన వాడు నేడు కార్పొరేట్లకు కూలీగా మారిపోయాడు.

కానీ, లగ్జరీ సెగ్మెంట్‌లో మాత్రం.. టైలర్‌ కుట్టు మిషన్‌ చక్రం తిప్పుతూనే ఉన్నాడు. షర్టు.. అక్షరాలా పదివేల రూపాయలు. ప్యాంటు.. పద్దెనిమిదివేలా ఐదొందలు, జాకెట్‌.. నలభై ఐదువేలు. సూటు.. డెబ్బై వేలకు తగ్గదు. ఇవన్నీ ధరలు కాదు. కుట్టు కూలీలు. ‘లగ్జరీ టైలర్స్‌’కు సమర్పించుకోవాల్సిన బిల్లులు. ఒకవైపు బ్రాండెడ్‌ రెడీ-టు-వేర్‌ సెగ్మెంట్‌ దూసుకుపోతున్నా.. లగ్జరీ టైలర్ల హవా కొనసాగుతూనే ఉంది. ఈ ‘లగ్జరీ టైలర్లు.. పాత రూల్స్‌కు పాతరేస్తారు. కొత్త డిజైన్స్‌కు జాతర చేస్తారు. డిజైనింగ్‌లో ఆడ, మగ అంతరంగం తగ్గిస్తారు. దుస్తుల్లో వ్యక్తిత్వం ప్రతిబింబించేలా చూస్తారు’ అంటారు నవతరం టైలరమ్మలు. పాతతరం టైలర్లు బ్రాండింగ్‌ను పట్టించుకోలేదు. ఈ తరం దర్జీ బాబులు ఆ విషయం మీద బాగా దష్టి పెడుతున్నారు. కస్టమర్లు కూడా ప్రయోగాలను ఇష్టపడుతున్నారు. అదే సమయంలో.. అలనాటి మహారాజులను, జమీందార్లను తలపించే సంప్రదాయ వస్త్రాలకూ ఆదరణ పెరుగుతున్నది. ఆ పాతకొత్తల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు మనవాళ్లు. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ, కుట్టుపనికి ఆధునిక టెక్నాలజీని కూడా జోడించాల్సిన అవసరం వచ్చింది.
”రైతుతో పోటీ పడగలిగినవాడు/ ఈ ప్రపంచంలో టైలరొక్కడే/ రైతు రాయి వస్త్రాన్నిస్తే టైలరు దాన్ని శిల్ప సంస్కారంగా మారుస్తాడు…/ హైబ్రిడ్‌ కన్నా దేశీయ ఆహారం మేలు/ మిల్లు డ్రస్సుల కన్నా మిషను బట్టలు హాయి…” అని కవి అన్నట్టు చేనేతకు చేయూత ఇస్తున్నట్టు దర్జీలకు ఆదరణ పెరగాలి.

Spread the love