సైన్స్‌… ఒక సామాజిక నైతికత

సైన్స్‌... ఒక సామాజిక నైతికత ప్రపంచంలో మనుగడ సాగిస్తున్న ప్రతి సమాజానికీ తనకంటూ ప్రత్యేకమైన విశ్వాసాలు, ఆచరణలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న ప్రాకతిక అంశాలని పరిశీలించటం వల్ల ప్రధానంగా వారికీ ఈ విశ్వాసాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. భిన్న సమాజాలు, భిన్న సంస్కతులు ఉన్న నేలమీద ఈ విశ్వాసాలు కూడా బిన్నంగానే ఉంటాయి. కాని ఈ విశ్వాసాలతో ఎటువంటి సంబంధం లేకుండా, సష్టిని నడిపించే కొన్ని నిజాలు ఉంటాయి. ఆ నిజాల మీద ఆవిర్భవించిందే సైన్సు. ఇది కాలక్రమంలో పరిణితి చెందుతూ ఉంటుంది. కాని విశ్వాసాలు పరిణితి చెందవు. ఘనీభవించిన శిలాసాదశ్యాలుగా మిగిలిపోతాయి. అవి హేతువుకి లొంగవు. కాని సైన్సు హేతువు మీద ఆధారపడి వద్ధి చెందుతుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా పరిఢవిల్లిన సైన్సు ప్రస్థానం భారతదేశంలో కూడా అప్రతిహతంగా సాగింది. సర్‌ సి.వి. రామన్‌ వంటి అనేకమంది శాస్త్రవేత్తలు అపారమైన ప్రజ్ఞాపాటవాలతో భారతదేశ విజ్ఞాన శాస్త్ర ఖ్యాతిని దిగంతాల వరకు విస్తరింప చేసారు. ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు, నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవత్తే విజ్ఞానశాస్త్ర అభివద్ధికి బాటలు వేస్తాయని’ భారతరత్న అందుకున్న సమయంలో సర్‌ సి.వి. రామన్‌ చేసిన ప్రసంగం కాలాలను దాటుకుని, నేటికి యువతకు కావలసినంత ప్రేరణను ఇస్తుంది.
సీవీ రామన్‌గా పేరుగాంచిన చంద్రశేఖర్‌ వెంకటరామన్‌ భారత దేశ విజ్ఞాన రంగానికి భౌతికశాస్త్రంలో అందించిన సేవలను స్మరించుకుంటూ, ప్రతి సంవత్సరం ఆయన రామన్‌ ఎఫెక్ట్‌ ను కనుగొన్న ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకోవాలని 1986లో భారత ప్రభుత్వం ప్రకటించింది. నాటి నుండి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం బిన్నమైన థీమ్‌ లతో విద్యార్ధులు, పరిశోధకుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల జిజ్ఞాసని పెంపొందించడానికి జాతీయ సైన్స్‌ దినోత్సవం పేరుతో ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. 2024 సంవత్సరానికి సంబంధించిన జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ‘వికసిత భారత్‌ కోసం స్వదేశీ సాంకేతికతలు’ అనే నినాదంతో జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఈ మేరకు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖా మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఫిబ్రవరి 6న న్యూ ఢిల్లీలో ‘విక్షిత్‌ భారత్‌ కోసం స్వదేశీ సాంకేతికతలు’ పేరుతో ‘నేషనల్‌ సైన్స్‌ డే 2024’ థీమ్‌ను విడుదల చేశారు.
సైన్సు పుట్టుక, ప్రస్థానం…
సైన్సు అనేది ప్రపంచంలో మనకు తెలిసిన లేదా తెలియని అనేక అంశాలని, విషయాల్ని ఒక పరిశోధనా పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం. సైన్సు ద్వారా ఆవిష్కతమయిన అనేక ఆవిష్కరణలు వ్యవసాయ, మెడికల్‌, కాలుష్య నివారణ, మిలటరీ రంగాలలో అనేక విప్లవాత్మక మార్పులకి కారణమైయ్యాయి. ‘అల్‌ హజెన్‌’ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కాంతిశాస్త్రంపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడని చెప్పాలి. ఆదిమ కాలంలో విజ్ఞానశాస్త్రాన్ని సైన్సులా కాకుండా తత్వశాస్త్రంలో ఒక భాగంగా భావించేవారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలుగా భావించబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి రంగాల మీద విస్తతంగా పరిశోధన చేసేవారు. ప్రాచీన భారతీయులు, గ్రీకు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచాన్ని నేల, గాలి, నిప్పు, నీరు, నింగి అని వర్గీకరిస్తే, మధ్యప్రాచ్యానికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు, ప్రయోగ పూర్వక విధానాల ద్వారా ప్రకతిలోని వివిధ అంశాలని వివిధ రకాలకి చెందిన పదార్థాలుగా వర్గీకరించడం ప్రారంభించారు. అలా ప్రారంభమయిన ప్రపంచ శాస్త్రీయ విజ్ఞానశాస్త్ర పురోగతి 19వ శతాబ్దానికి పూర్తి పక్వదశకి చేరుకుంది. 19వ శతాబ్దం గడిచేకొద్దీ విజ్ఞాన శాస్త్రం అంటే పరిశోధనల ద్వారా, హేతుబద్దంగా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బలపడింది. దీంతో 19వ శతాబ్దంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి శాస్త్రాలు ఒక సమగ్రమయిన రూపాన్ని సంతరించుకున్నాయి. ఇదే శతాబ్దంలోనే శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధనా సంస్థ అనే భావనలు కూడా పుట్టుకొచ్చాయి.
ఆధునిక మానవుడు నేడు అనుభవిస్తున్న సకల సౌకర్యాలు ప్రపంచస్థాయిలో శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన ప్రగతి ద్వారానే సాధ్యమైనది అన్నది వాస్తవం. మానవుడు సాధించిన ప్రగతికి అంతా ప్రకతే ప్రేరణనిచ్చింది. పక్షిని చూసి విమానం కనిపెట్టిన మానవుడు, చేపని చూసి పడవని నిర్మించాడు. ఇలా ప్రపంచం సాధించిన సాంకేతిక ప్రగతిలో ప్రకతి అందించిన ప్రేరణే అంతఃసూత్రంగా కనిపిస్తుంది. మానవునిలో శాస్త్రీయ ఆలోచనా దక్ఫదం, పరిశోధనా దష్టి ఫ్రారంభం కాక ముందు సకల చరాచర సష్టికి కంటికి కనిపించని అతీంద్రియ శక్తులే కారణం అని విశ్వసించేవారు. కాలక్రమేణా ఈ విశ్వాసాల పునాదుల మీదనే మత భావజాలం విస్తరించింది. ఇది చాలాకాలం మానవులలో శాస్త్రీయ ఆలోచనా దక్పథాన్ని వద్ధి చెందకుండా అడ్డుకుంది. మానవ మేధస్సు వికాసం పొందిన తరవాత సష్టిలోని ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, అది ప్రకతి ద్వారా ప్రభావితమవుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అప్పటి వరకు భూమి బల్లపరుపుగా ఉంది అని ప్రభోదించిన మత గ్రంథాల్ని ధిక్కరిస్తూ కోపర్నికస్‌ భూమి గుండ్రంగా ఉంటుంది, అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనినే సూర్యకేంద్రక సిద్ధాంతం అంటారు. సరిగ్గా అటుఇటుగా ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాలను, కోపర్నికస్‌ కన్నా ముందు కొంతమంది ప్రతిపాదించినప్పటికీ, గ్రహాల కదలికల ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించింది మాత్రం కోపర్నికసే. భూమి తన అక్షం పైన తాను తీరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందని, తత్ఫలితంగానే రాత్రి పగలూ ఏర్పడుతున్నాయని ఆయన స్పష్టం చేసాడు. భూమి యొక్క భ్రమణ, పరిభ్రమణాల వల్లే శీతోష్ణ స్థితులు, ఋతువులు ఏర్పడుతున్నాయని తేల్చి చెప్పాడు. అయితే కోపర్నికస్‌ ప్రతిపాదనలు ఆ కాలంలో పెను ప్రకంపనాలు సష్టించాయి. అప్పటికే మత గ్రంథాలు, జ్యోతిష్య గ్రంథాలు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని బోధిస్తున్నాయి. మత భావనలతో నిర్మితమయిన ”ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులుగా చెయ్యాలని చూస్తున్న మూర్ఖుడు కోపర్నికస్‌” అంటూ మత పెద్దలు ఆయన మీద విరుచుకు పడ్డారు. ఈ సూత్రీకరణలతో కోపర్నికస్‌ రచించిన గ్రంథాన్ని విజ్ఞాన గ్రంధంగా నాటి సమాజం ఒప్పుకోలేదు. ఆ తరవాత వివిధ కాలాల్లో వచ్చిన ఎంతోమంది శాస్త్రవేత్తలు మత పెద్దల నుండి ఇంతకన్నా తీవ్రమయిన దాడినే ఎదుర్కున్నారు. ఇదే క్రమంలో నమ్మిన సిద్ధాంతాల్ని నిలబెట్టుకోవటం కోసం ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో వారి త్యాగాలని గుర్తు చేసుకోవటం మన కర్తవ్యం.
‘సత్యం వధ… సైన్సు చెర…’
కోపర్నికస్‌ 16వ శతాబ్దం ప్రారంభంలోనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరవాత కాలంలో వచ్చిన గెలీలియో కూడా ఇతర గ్రహాల పరిశీలనలు వల్ల భూమి కదలికలో ఉందని, అంతరిక్షంలో ఒక బిందువు వద్ద స్థిరంగా లేదని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదానికి గెలీలియో, కోపర్నికస్‌ సూర్యకేంద్రక సిద్ధాంతాన్నే ప్రాతిపదికగా తీసుకున్నాడు.
అప్పటికే పవిత్ర మత గ్రంధాలు బోధిస్తున్న భూకేంద్రీయ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ గెలీలియో, కోపర్నికన్‌ సిద్ధాంతాన్ని బలపరచటం మతాధికారులకి అంతులేని ఆగ్రహాన్ని కలిగించింది. ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా ప్రపంచానికి టెలిస్కోప్‌ అందించిన గెలీలియో రాజ్యం చేతిలో అనేక హింసలు అనుభవించి మరణించాడు. కాలాన్ని కొలవడానికి ఏ రకమయిన గడియారాలూ లేని సమయంలో వేలాడుతున్న చర్చి దీపాల కదలికలతో డోలనా కాలాలను గణించి సమయాన్ని అంచనా వేసిన ప్రతిభావంతుడు గెలీలియో. ఈ పరిశీలన ఆధారంగానే ఆయన ‘పల్స్‌ మీటరు’ని రూపొందించాడు. ఆయన రచించిన యాంత్రిక శాస్త్రం అనేక నూతన ఆవిష్కరణలకి ఉపిరి పోసింది. టెలిస్కోప్‌ ని తయారు చేయటం గెలీలియో పరిశోధనలో అత్యంత కీలకమైనది. కటకాలను ఉపయోగించి దూరపు వస్తువులను తలకిందులుగా చూడగలుగు తున్నారని తెలిసి, ఆరు నెలల స్వల్ప కాలవ్యవధిలో టెలిస్కోపును ఆవిష్కరించిన గొప్ప శాస్త్రవేత్త. దీనిద్వారా ఎన్నో విశ్వ రహస్యాలను కనుగొనటానికి సాధ్యమైంది. గెలీలియో కోపర్నికస్‌ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపర్చటం, మత సిద్ధాంతాల అధీనంలో నడుస్తున్న రాజ్యానికి, మతాధికారులకి నచ్చలేదు. అందువల్ల మతాధికారులు గెలీలియో చేస్తున్న ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించి, ఆ ప్రయోగ ఫలితాలు ఎన్నటికీ వెల్లడి చేయకూడదని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా గెలీలియో తన ప్రయోగాల సారంతో 1632లో ‘డైలాగ్స్‌ కన్సర్నింగ్‌ ది టూ ఛీఫ్‌ వరల్డ్‌ సిస్టమ్స్‌’ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. దీంతో ఆగ్రహించిన మతాధికారులు గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించటంతో పాటు, అతని పుస్తక ప్రచురణను అడ్డుకున్నారు. ఈ శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే ఆయన తన కంటిచూపు కోల్పోయి, ఆ తర్వాత అత్యంత దీనస్థితిలో గెలీలియో మరణించారు. తను నమ్మిన సత్యాన్ని నిర్భయంగా చాటటంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా గెలీలియో వెనకడుగు వేయలేదు. మానవుని కన్ను చూడలేని ఎన్నో ఖగోళ దశ్యాల్ని వీక్షించడానికి కారణమయిన టెలిస్కోప్‌ ని ప్రపంచానికి అందించిన ఆధునిక వైజ్ఞానిక పితామహుడు ఆఖరికి కంటిచూపు కోల్పోయి మరణించటం విషాదం.
కోపర్నికస్‌ సిద్ధాంతాన్ని సమర్ధించినందుకు, అదేవిధంగా తన భావాలని స్వేచ్చగా ప్రకటించినందుకు మరొక ప్రఖ్యాత శాస్త్రవేత్త కూడా తన ప్రాణాలని కోల్పోయాడు. అతనే గియోర్డానో బ్రూనో. ఈయన కూడా అప్పటికి సమాజంలో చెలామణిలో ఉన్న మతవిశ్వాసాలకి విరుద్ధంగా కోపర్నికస్‌ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించాడు. రాజ్యం నుండి ఎన్ని ఇబ్బందులు ఎదురయినా బ్రూనో తుదికంటూ, తను నమ్మిన సిద్ధాంతంపైనే నిలబడ్డాడు. దానికోసమే తన విలువయిన ప్రాణాల్ని కోల్పోవలసి వచ్చినా ఆయన వెనుదీయలేదు. చివరిగా తనకి ఉరిశిక్ష విధించిన అధికారుల్ని సైతం ధిక్కరిస్తూ, ”నా శిక్షను ఉచ్చరించేటప్పుడు, అది వింటున్న నా కన్నా, శిక్ష విధిస్తున్న మీకే ఎక్కువ భయం కలుగుతుంది” అంటాడు. ఇలా సత్యాన్ని నిలబెట్టటానికి, మానవ జాతికి శాస్త్రీయ ఆలోచనా దక్ఫథాన్ని అందివ్వటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ ప్రాణాలను కోల్పోయారు. సమాజంలో చెలమణిలో ఉంది కాబట్టి దేన్నీ గుడ్డిగా విశ్వసించకూడదు, తార్కికదష్టితో అన్ని అంశాలను పరిశిలించి హేతుబద్ధమైన వాటినే సత్యాలుగా అంగీకరించాలని భోధించిన సోక్రటీసు కూడా రాజ్యం విధించిన శిక్షకి బలై పోయాడు. ఇలా ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ప్రపంచంలో విజ్ఞాన శాస్త్ర వికాసానికి దారులు పడ్డాయి.
భారత దేశ విజ్ఞాన శాస్త్ర ప్రగతికి దారులేసిన ఆధునికుడు ‘రామన్‌’.
ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో దేదీప్యమానం చేసిన శాస్త్రవేత్తల్లో సర్‌ సీవీ రామన్‌ అగ్రగణ్యుడు. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్‌ రావడం గగనం. అలాంటిది సర్‌ సీవీ రామన్‌ ఆ ఘనత సాధించి చరిత్ర పుటల్లో నిలిచారు. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న ఏకైక ఆసియా వాసిగా కూడా ఆయన చరిత్ర సష్టించారు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా ‘నా మతం సైన్సు, దానినే నేను జీవితాంతం ఆరాధిస్తా’ అని ప్రకటించిన నిజమయిన శాస్త్ర విజ్ఞాన శిఖరం సర్‌ సీవీ రామన్‌. 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో శ్రీమతి పార్వతి అమ్మాళ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌ దంపతులకు జన్మించిన రామన్‌, చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో ఆయన జిజ్ఞాస మరింత పెరిగింది. చిన్ననాటి నుండే తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్‌ తన ప్రాథమిక విద్యను విశాఖపట్నంలో పూర్తి చేసారు. అనంతరం రామన్‌ 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి ఫిజిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించారు. ఆ తర్వాత మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి, భౌతిక శాస్త్రంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సష్టించారు.
తొలినాళ్ళలో శబ్దశాస్త్రంపై ఎక్కువగా పరిశోధనలు జరిపిన రామన్‌, ఆ తర్వాతి కాలంలో కాంతిశాస్త్రం వైపు తన పరిశోధనా దష్టిని మళ్లించారు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటం ఆయన్ని అమితంగా ఆకర్షించింది. సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే దానికి కారణమై ఉంటుందని ఆయన ఊహించారు. ఈ ఊహే భారత దేశం యొక్క ఖ్యాతిని నోబెల్‌ వరకు నడిపించింది. అప్పటి నుండి రామన్‌ తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం చెందటం గురించి విస్తతంగా పరిశోధనలు చేశారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి పొందిన కాంప్టన్‌ ఎక్స్‌ కిరణాల పరిశోధన నిజమైనపుడు, కాంతి విషయంలోనూ అది నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు. ఈ ఆలోచనే రామన్‌ ఎపెక్ట్‌ కి దారులేసింది. అధునాతనమైన పరికరాలు అందుబాటులో లేకపోయినా ఆయన తన ప్రయత్నాన్ని ఆపలేదు. మొక్కవోని దీక్షతో ఆయన జరిపిన పరిశోధన ఫలితంగా 1928 ఫిబ్రవరి 28 న రామన్‌ ఎఫెక్ట్‌ ను కనుగొన్నారు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్‌ తన పరిశోధన ద్వారా నిరూపించారు. ఈ దగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెల్లడించారు. దీనికి గుర్తింపుగా నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1929లో నైట్‌ హుడ్‌ బిరుదుతో రామన్‌ ను సత్కరించింది. రామన్‌ ఎఫెక్ట్‌ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ భౌతికశాస్త్రంలో రామన్‌ అందించిన సేవలని గుర్తించి 1930లో నోబెల్‌ బహుమతి ప్రధానం చేసింది. విజ్ఞాన రంగానికి రామన్‌ అందించిన సేవలకు గుర్తుగా భారత దేశం 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నతో రామన్‌ని సత్కరించింది. భౌతికశాస్త్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని సంపాదించుకున్న సీవీ రామన్‌ 1970 నవంబర్‌ 21న కన్నుమాశారు.
భారత్‌లో శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతి
సర్‌ సివి రామన్‌ అందించిన రామన్‌ ఎపెక్ట్‌ తో భారతదేశంలో కొత్తపుంతలు తొక్కిన విజ్ఞానశాస్త్ర ప్రగతి, ఆ తర్వాతి కాలంలో అతున్నత స్థాయికి చేరుకుంది. సీవీ రామన్‌, అన్నామణి, ఎపిజె అబ్దుల్‌ కలాం, ఎం.ఎస్‌.స్వామినాథన్‌ వంటి అనేక జగద్విఖ్యాత శాస్త్రవేత్తలు భారతదేశం యొక్క పరిశోధనా పటిమను ప్రపంచ దేశాలకి తెలిసేలా చేసారు. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ప్రధానంగా శాస్త్ర సాంకేతిక రంగాల అభివద్ధికి అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే 1951లో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన ప్రణాళిక ముసాయిదాలో ‘శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనల’పై ఒక ప్రత్యేక అధ్యాయాన్ని పొందు పరిచారు. తద్వారా దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు పునాది పడింది. అనంతరం దేశంలో అనేక పరిశోధన సంస్థల ఏర్పాటు జరిగింది. నేషనల్‌ ఫిజికల్‌ లాబొరేటరీ ఆఫ్‌ ఇండియా (ఢిల్లీ), నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీ (పూణే, మహారాష్ట్ర), సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కరైకుడి, తమిళనాడు) వంటి 11 జాతీయ స్థాయిలో పరిశోధనా సంస్థలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత రేడియో అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌, సెంట్రల్‌ సాల్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లకు కూడా ప్రతిపాదనలు జరిగాయి. ఇదేకాలంలో అంతరిక్ష పరిశోధనలకు కూడా భారత దేశంలో అడుగులు పడ్డాయి.
1957లో రష్యా తన మొదటి శాటిలైట్‌ స్పుత్నిక్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. దాని నుండి స్ఫూర్తి పొందిన హోమీ భాభా, అప్పటి ప్రధాని నెహ్రూ సహకారంతో 1962వ సంవత్సరంలో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ (ఇంకార్ప్‌) అనే సంస్థని ఏర్పాటు చేసారు. భారత దేశంలో ఏర్పాటైన మొదటి అంతరిక్ష కేంద్రం ఇదే. 1969లో ఇంకార్ప్‌ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)గా రూపాంతరం చెందింది. 1975నాటికి భారత దేశం సొంతంగా నిర్మిచుకున్న ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ని ప్రయోగించే స్థాయికీ ఎదిగింది. అనేక వైఫల్యాల అనంతరం 1980లో విజయవంతంగా ప్రయోగించిన ఎస్సెల్వీతో రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భారతదేశం ప్రయోగించిన తొట్టతొలి ఉపగ్రహంగా రోహిణి-1 చరిత్రలో నిలిచిపోయింది. అప్పటినుండి అప్రతిహతంగా సాగిన భారత్‌ అంతరిక్ష పరిశోధన ప్రయోగాల ప్రస్థానం చంద్రుని మీదికి ఉపగ్రహాలను విజయవంతంగా పంపించే స్థాయికీ వద్ధి చెందింది. భారత్‌ మూన్‌ మిషన్‌లో భాగంగా.. 2008 అక్టోబర్‌ 22న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-1 ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. ఈ విజయం అందించిన స్పూర్తితో మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌కు భారత్‌ శ్రీకారం చుట్టింది. 2013 నవంబర్‌ 5వ తేదీన మంగళ్‌ యాన్‌-1ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. 2014 సెప్టెంబర్‌ 24వ తేదీన ఇది అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. 2023 సంవత్సరంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3ని విజయవంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయటం ద్వారా ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఒక్క అంతరిక్ష పరిశోధనల్లోనే కాదు, వైద్య రంగం, బయోటెక్నాలజీ, అణు పరిశోధన రంగాల్లో సాంకేతిక పరంగా భారత దేశం ఎనలేని ప్రగతిని సాధించింది.
తిరోగమనంపైపు పయనం..
నిజానికి ప్రపంచ విజ్ఞాన శాస్త్ర ప్రస్థానం తొలినాళల్లో ఎంతటి గడ్డు స్థితిని ఎదుర్కొందో, సరిగ్గా అదే గడ్డు స్థితిని ఎదుర్కునే రోజులు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇది అక్షర సత్యం. భారత దేశంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయి. మానవ పరిణామక్రమాన్ని తిరుగులేని సాక్ష్యాలతో సిద్ధాంతీకరించిన డార్విన్‌ పరిణామవాదాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించటమే దీనికి నిదర్శనం. డార్విన్‌ సిద్ధాంతం సష్టివాదాన్ని తిరస్కరిస్తుంది. పరిణామ వాదాన్ని బలపరుస్తుంది. జీవుల చుట్టూ ఉన్న ఆవరణ వ్యవస్థల ప్రభావం జీవుల మనుగడని నిర్దేశిస్తుంది అని డార్విన్‌ తేల్చి చెప్పాడు. అతని సహజ ఎంపిక సిద్ధాంతం కొత్త జాతుల ఏర్పాటుపై గొప్ప తార్కిక, హేతుబద్ధమైన వివరణను అందించింది. అందుకే డార్విన్‌ని పరిణామశాస్త్ర పితామహుడిగా కొనియాడతారు. వనరుల కోసం జీవుల మధ్య జరిగే పోరాటం, పర్యావరణ ప్రభావం వంటి అనేక అంశాలతో పాటు, జీవులు అంతరించిపోవటం వంటి కీలక అంశాల మీద కూడా డార్విన్‌ జరిపిన పరిశోధన అసాధారణమైనది. డార్విన్‌ శాస్త్రీయ సిద్ధాంతం, అజ్ఞానంతో కూడిన మూఢనమ్మకాలను తిప్పికొట్టింది. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకొవాలని భావిస్తున్న పాలకపక్షాలని భయపెడుతున్న అంశం బహుశా ఇదే కావచ్చు. సమాజాన్ని అంధకారంలోకి నెట్టే సష్టివాదాన్ని తిరస్కరిస్తూ, పరిణామవాదంతో సమాజాన్ని విజ్ఞానపు వెలుగు తీరాలవైపు మళ్లించిన డార్విన్‌ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించటం ఆదిమకాలానికి చెందిన మూర్ఖపు ఆలోచనగానే పరిగణించాలి.
ఏ సమాజమైనా వాస్తవాల మీద, శాస్త్రీయత మీద ఆధారపడే అభివద్ధి చెందుతుంది. కేవలం వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాల మీద ఆధారపడి ఏ రకమైన సాంకేతిక, సామాజిక అభివద్ధి సాధ్యం కాదు.
ఆశాస్త్రీయమైన ఆలోచనలపై ఆధారపడితే సమాజం తిరోగమనం వైపు పయనిస్తుంది. శాస్త్రీయతతో కూడిన ఆలోచనా విధానాల ద్వారా మాత్రమే సాంకేతిక అభివద్ధి సాధ్యమయి సమాజం ముందుకు పోతుంది. భారత రాజ్యాంగం కూడా శాస్త్రీయ దక్ఫధాన్ని బలపరుస్తుంది. అంధ విశ్వాసం, మూఢనమ్మకాలు నుండి సమాజం విముక్తి కావాలంటే శాస్త్రీయ ఆలోచనా దక్ఫదం ఒక్కటే మార్గం. సహజ వనరులు, ప్రత్యేకించి శక్తి, వాతావరణ మార్పుల వినాశకరమైన ప్రభావాలను ప్రపంచం తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఇలాంటి తరుణంలో, దేశంలోని కోట్లాది మంది ప్రజలకు మెరుగైన జీవితాలను అందించాలంటే సైన్స్‌, శాస్త్రీయ దక్పథం తప్పనిసరి. హేతుబద్ధమైన, వాస్తవాధారిత ఆలోచనా క్రమంతో సర్వ మానవ సంక్షేమాన్ని కాంక్షించే శాస్త్రీయ దక్పధాన్ని ఈ జాతీయ దినోత్సవం భావి తరాలకి వాగ్దానం చేస్తుందని ఆశిద్దాం…

డా|| కె. శశిధర్‌ ,
9491991918 

Spread the love