సంక్రాంతి ఆనందాల క్రాంతి

సంక్రాంతి ఆనందాల క్రాంతి దక్షిణ భారతదేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతికి చాలా ప్రాధాన్యం ఉంది. తెలుగు ప్రజలంతా ఎక్కడ ఉన్నా ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగ అత్యంత వైభవంగా సాగుతుంది. ఎంత దూరంలో ఉన్నా సరే సంక్రాంతికి సొంత ఊరు రావాలని తహ తహ లాడుతారు. అంతటి ఆనందాలను పంచే సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేక వ్యాసం…
సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ.. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. ఇలా మూడు రోజు పాటు సందడి కనిపిస్తుంది. దీనిలో ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంవత్సరంలో వచ్చే పండుగలన్నింటిలోకి వేడుకగా చేసుకునే పండుగ ఇది. మిగిలిన అన్ని పండుగలతో పోలిస్తే మూడు రోజులు పాటు ఘనంగా చేసుకునే పండగ కాబట్టి దీనిని పెద్ద పండుగ అని వ్యవహరిస్తారు. దీన్ని పితదేవతలను స్మరించుకునే పండుగగా కూడా భావిస్తారు. అందు చేత పెద్దల పండుగ అని కూడా అంటారు.
సంస్కతి సంప్రదాయాల నెలవుగా…
ఖగోళ శాస్త్రానికి ప్రకతి సమతుల్యతకు మధ్య సమన్వయమే సంక్రాంతి పండుగ. మనం జరుపుకునే ఇతర పండుగలన్నీ ఏదో ఒక దైవానికి సంబంధించినవే! కానీ ఈ పండుగ మాత్రం పెద్దల పండుగ, పంటల పండుగ, రైతన్నల పండుగ. ఈ పండుగకు మూల పురుషుడు రైతన్న. సంక్రాంతి కేవలం పండగ కాదు, ఓ జీవన విధానం. మూడు రోజులు పాటు జరిగే ఈ పండుగలో అనేక ప్రత్యేకతలు మనకు గోచరిస్తాయి. దేశమంతటా విభిన్నరీతుల్లో జరుపుకోబడే ఈ పండుగ కుటుంబ పరమైన అనుబంధాలకీ, సామాజిక పరమైన సమైక్యతకు వేదికగా నిలుస్తుంది.
సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సౌరమానం ప్రకారం సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ఒక్కొక్క రాశిలో సంక్రమించే సమయాన్ని ‘సంక్రాంతి’ అని పిలుస్తారు. ఈ విధంగా సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. అయితే సూర్యుడు ధనూరాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈ సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యతే ఏడాది మొత్తంలో దీనిని ‘పెద్ద పండుగ’ చేసింది. సౌరమానం ప్రకారం ఇక్కడి నుంచి మకర మాసం. నేలలో, నింగిలో వచ్చే పరిణామాలు సకల శుభాలను ప్రసాదించాలని సద్భావంతో జరుపుకొనే పర్వమే- సంక్రాంతి. ఈ సంక్రాంతిలో ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక ఇది ”సంక్రాంతి”గా వాడుకలోనికి వచ్చిందని పెద్దలు చెబుతుంటారు.
సౌరమానం.. చాంద్రమానం..
భారతీయులు సాధారణంగా చాంద్రమానాన్ని పాటిస్తారు. కొన్ని సందర్భాలలో సౌరమానాన్ని కూడా అనుసరిస్తారు. ఈ రెండు మానాల సమన్వయం సంక్రాంతి పండుగ చేసుకోవటంలో కనపడుతుంది. మనం చేసుకునే దీపావళి, దసరా, వినాయక చవితి వంటి పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం. ఒక్క సంక్రాంతి పండుగ విషయంలో మాత్రం సౌర గమనాన్ని అనుసరిస్తాం. ఈ పండుగ ఎప్పుడూ జనవరి 14, 15 తేదీల్లోనే రావడానికి కారణం మనం అనుసరించే గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ కూడా సౌరమానాన్ని అనుసరించడమే. అందుకే సంక్రాంతి ఏటా ఇంచుమించు ఒకే తేదీన వస్తుంది. మిగిలిన మన పండగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. అందుకే వేరే తేదీల్లో వస్తాయి. చాంద్రమానం ప్రకారం సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తాడు.
సంక్రాంతి ఆనందాల క్రాంతి
ఇంటింటా రంగవల్లులు.. బంతిపూల గొబ్బెమ్మలు.. బొమ్మల కొలువులు. భోగి మంటలు.. హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల మేళాలు.. రైతుల కళ్లలో మెరుపులు.. కొత్త బియ్యపు అరిసెలు.. గాలిపటాల రెపరెపలు.. కొత్త అల్లుళ్లకు బహుమానాలు.. పశువులకు కతజ్ఞతా పూజలు.. కోడి పందాలు.. పిండి వంటల ఘుమఘుమలు.. అంతటా అందాల విరిజల్లులు.. ఆనందాల సంక్రాంతి సంబరాలు.
మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండుగ వస్తుంది. ఈ పండుగ భోగి మంటలు వేయడంతో మొదలవుతుంది. మానవులందరినీ భోగము ననుభవించమని, ఆనందంగా ఉండమనీ ఈ పండుగ చెప్తుంది. భోగి మంటలలోని అంతరార్ధం ఏమిటంటే, బాధ కలిగించే ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను, కోపతాపాలను అగ్నిలో దగ్ధం చెయ్యాలని. అంటే రాగద్వేషాలను వదిలెయ్యాలని గ్రహించటం. అందరితో సామరస్యంతో ఉండాలనే సందేశాన్ని భోగి మంటలు అందిస్తాయి.
భోగిమంటల్లో సంకటాలు దగ్ధమవుతాయి. ఆ మంటలు మానవాళి కల్మషాల్ని పటాపంచలు చేస్తాయి. మనలోని దుష్ప్రభావాన్ని, దుర్గుణాలను జ్ఞానమనే ఈ మంటలు దహిస్తాయి అనే విశ్వాసం ప్రచారంలో ఉంది. భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ముత్తైదువులను పిలిచి, పెద్దలందరూ కలిసి ఇంట్లో ఉన్న ఐదారు సంవత్సరాల లోపు పిల్లలకు దష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ, చిల్లర నాణేలతో రేగిపండ్లు, పూలు కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం. రేగి పండ్లలో, సౌరశక్తి ఉంటుంది. శిరస్సు మీద పడితే ఆ శక్తి, తేజస్సు పిల్లలకి వస్తుందని, రావాలని ఆకాంక్షిస్తూ, సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది.
బొమ్మల కొలువు
బొమ్మల కొలువులు ఇంటింటా వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ఓ వేడుక. మన దేవుళ్లు, దేవతలు, స్వాతంత్య్రోద్యమ నాయకులు బొమ్మల రూపంలో పిల్లలకు పరిచయమవుతారు. భారతీయ సంస్కతీ సంప్రదాయాలకు బొమ్మల కొలువు రూపంలో స్పూర్తినిస్తుంది. పురాణేతిహాసాలు, చరిత్ర, సాంఘిక జీవన స్థితిగతులను ప్రతిబింబించేటట్లుగా, అత్యంత విజ్ఞాన దాయకంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించేయడం కాదు. వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి ఉంటుంది. సాధారణంగా బొమ్మలను మూడు, ఐదు, తొమ్మిది వరుసలలో పేరుస్తారు. ఈ కొలువు పేర్చేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సష్టి పరిణామ క్రమం, మానవుడి అభివద్ధి క్రమం దష్టిలో పెట్టుకుని వివిధ ప్రమాణాల్లో బొమ్మలు అమరుస్తారు
రంగ వల్లులు
రంగవల్లులు/ ముగ్గులు నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలంటారు. ప్రకతిలోని తోటి జీవుల పట్ల దయతో ఉండటమే ముగ్గులు పెట్టడంలో అంతరార్థం. ముగ్గులను బియ్యపు పిండితో వేస్తారు. ఆ పిండిని తినడానికి ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలన్నీ గుమ్మం బయటికి చేరతాయి. తద్వారా ఇల్లు శుభ్రం అవుతుంది. ఇది పర్యావరణంలో మనతోపాటు జీవిస్తున్న చిన్న జీవులకు ఆహారం అందించడమే! ముగ్గు ఇంటికి అలంకరణే కాదు. అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును ఏకాగ్రతను అందించే ఓ ప్రక్రియ. ఎన్ని చుక్కలు పెట్టి వేస్తే అంత మంచి ముగ్గు వస్తుంది. ఎంత మంది మనుషుల్ని కలుపుకు పోతే అంత ఓర్పు మన సొంతం అవుతుంది అని కూడా ముగ్గులు మనకు బోధిస్తాయి.
గొబ్బెమ్మలు
కష్ణ భక్తురాలైన గోపెమ్మ పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. గొబ్బెమ్మలు సంతాన ప్రతీకలు. ఇంట్లో పెళ్లి కాని వారికి వివాహం, పెళ్లి అయిన స్త్రీలకు సంతానం కలగడానికి పెద్దలు ఈ గొబ్బెమ్మల ఆచారాన్ని ఏర్పరచారు. ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు. వీటికి గుమ్మడిపూలు, చామంతిపూలు, రేగుపండ్లను అలంకరిస్తారు. గొబ్బెమ్మలు చేయటానికి శాస్త్రీయ పరమైన కారణం కూడా ఉంది. ధనుర్మాసంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ తేమకి రకరకాల పురుగులు, ఇతర జీవాలు వాటి ఆవాసాల నుంచి బయటకు వచ్చి మన ఇళ్లలోకి రాకుండా ఉండేందుకే పేడతో చేసిన గొబ్బెమ్మలను ఇంటి ఆవరణలో ఉంచుతారు. పేడలో ఉండే ఓ రకమైన రసాయనం క్రిమికీటకాలను ఇళ్లలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఈ కారణంగానే భోగి పండుగ రోజు వేసే భోగి మంటలలో కూడా ఆవు పేడతో తయారుచేసిన పిడకలనే వేస్తారు.
హరిదాసులు
సంక్రాంతి నెలల్లో కనిపించే సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. తెలతెలవారుతూనే ప్రత్యక్షమయ్యే హరిదాసులు ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, తలపై అక్షయ పాత్రను ధరించి ఒక చేతితో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ ”హరిలో రంగ హరి.. శ్రీమద్రమారమణ గోవిందో హరీ” అంటూ శ్రీకష్ణుని గాథలను హరినామ సంకీర్తనామతాన్ని కీర్తిస్తూ దోసిళ్ళతో అందించే దోసెడు బియ్యాన్ని కష్ణార్పణమంటూ స్వీకరిస్తూ గ్రామ సంచారం చేస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతమని ప్రచారంలో ఉంది. గ్రామస్తులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు, భోగాభోగ్యలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసి, గ్రామస్థులు ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందూ ఆగడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. అందుకే గ్రామాలో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. హరిదాసు ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక భార్య ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది. నేడు హరిదాసుల సంప్రదాయం కూడా చాలా గ్రామాలలో కనుమరుగవుతోంది.
జంగమ దేవరులు
తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర, జంగం దేవరల ఆహార్యంగా ఉంటుంది. చేతిలో గంటనాదం చేస్తూ ”హరహర మహాదేవ శంభోశంకర” అంటూ శంఖం ఊదుతూ ఇంటి ముందుకు వస్తారు. జంగమ దేవరులు కేవలం ఒక్క ధనుర్మాస నెలలోనే వస్తారు. వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంట మోగిస్తూ, శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియ తిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు. వీరు చేసే ఈ నాదాల కారణంగా గ్రామాల్లో భూత ప్రేత పిశాచాలు గ్రామం విడిచి పోతాయని పూర్వీకుల నమ్మకం. వీరిని శివుని ప్రతిరూపంగా భావించి వారికి సముచిత రీతిలో దానాలు చేస్తుంటారు. రాను రాను జంగమ దేవరుల సంస్కతి కనుమరుగై పోయింది. ఎవరో పాత తరం వారు ఉంటే తప్ప కొత్త వారు ఎవరు ఈ వత్తిలోనికి రావడం లేదు.
గంగిరెద్దులు
హరిదాసు ఇంటిలోని వారిని పలకరించి ఇంటి ఆడపడుచులు వేసిన రంగవల్లులపై ఆశీస్సులు కురిపించాక… ”అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, బాబు గారికి దండం పెట్టు, పాప గారికి దండం పెట్టు” అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి, రైతు బతుకును అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటి ముంగిట్లో ఎడ్ల ఆట ఆడించి ఇంటిలోని చిన్నాపెద్ద అందరినీ అలరించిన తర్వాత వారు పెట్టిన ధాన్యం స్వీకరించి సన్నాయి ఊదుకుంటూ వెళ్ళిపోతారు.
పిత తర్పణాలు
రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజున పితదేవతలకు తర్పణాలను అందించే ఆచారం ఉంది. తిథులతో సంబంధం లేకుండా పితదేవతలకు తర్పణాలు వదిలే అతికొద్ది సందర్భాలలో సంక్రాంతి ఒకటి. కాబట్టి దీన్ని ‘పెద్దల పండుగ’ అనీ అంటారు. తర్పణాలతో పాటు దానాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు గుమ్మడిపండు దానం చేస్తారు. బంధువులను ఇంటికి ఆహ్వానించి, విందు వినోదాలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవసాయంలో తమకు సాయపడిన వారికి ధన, ధాన్య, వస్త్ర రూపంలో కానుకలు ఇస్తారు.
అల్లుళ్ల పండుగ
కొత్తగా వివాహమైన ఆడ పడుచులు, అల్లుళ్లను సంక్రాంతికి ఇంటికి ఆహ్వానిస్తారు. అల్లుడిని పిలిచి అతనికి తగిన మర్యాదలు చేయాలంటే చేతిలో కాస్తో కూస్తో ధనధాన్యాలు ఉండాలి. అలాంటి శుభసమయం సంక్రాంతే! వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశంలో అల్లుడికి కావల్సిన పంచభక్ష్యాలు, బహుమానాలు అందించేందుకు సరైన సమయం సంక్రాంతి. ఈ పండుగకి ఇంటికి కొత్త అల్లుడు వస్తున్నాడంటే అప్పుడు చేసే మర్యాదలే వేరు. మరదళ్ల సరసాలు, బావ మరదుల వేళకోళాలు.. అవి కావాలని.. ఇవి కావాలని అడిగే అల్లుడు.. తర్వాత ఇస్తామంటూ.. మామ.. ఆ సందడి వేరు. ఏ పండగకైనా ఇంటి అల్లుడి రాక సర్వసాధారణమయితే ఈ సంక్రాంతి రోజున అల్లుడికి విశిష్ఠమైన స్థానం ఉన్నది. జ్యోతిర్మండలంలో మకర రాశి పదో రాశి. అంటే విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారి ఇంటిలోకి అడుగు పెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటి అల్లుడిని తప్పనిసరిగా పిలవాలని బహుమతులు అందించాలనే సంప్రదాయం ఏర్పడింది.
మకర సంక్రమణ సందేశం
సంక్రమణ కాలం నాటికి రైతులకు పంట ఇంటికి వచ్చి చేతికి డబ్బు వస్తుంది. ఈ డబ్బుతో ధార్మిక కార్యక్రమాలు చేయమని సూర్యుడి మకర సంక్రమణం మనకి బోధిస్తుంది. రైతుకి డబ్బు వచ్చిందంటే వ్యాపారులకు, ఇతర వర్గాలకు కూడా ఆదాయం వచ్చినట్టే కదా. అందుకని కేవలం రైతులను మాత్రమే కాక ప్రతి ఒక్కరినీ కూడా ధర్మ కార్య నిర్వహణకు సన్నద్ధంగా ఉండమని సంక్రాంతి సంక్రమణ సందేశం ఇస్తోంది. అంతేకాదు చీకటి నుంచి వెలుగులోకి అడుగు పెట్టమని అంతర్లీనంగా చెబుతోంది.
కనుమ
సంక్రాంతి మరునాడు జరిపేదే కనుమ. వ్యవసాయ వత్తికి చేదోడు వాదోడుగా నిలిచే గోజాతికి కతజ్ఞత చూపుతూ కనుము పండుగ నాడు పశువుల్ని పూజిస్తారు. ప్రతిఫలం ఇచ్చేవారికి ఫలితం పొందినవారు కతజ్ఞత తెలపడం, గౌరవించడం సంప్రదాయం, ఆనవాయితీ. ఆ నేపథ్యంలో సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే అది పశువుల పుణ్యం. తమకు పాడిపంటలు అందించిన పశువులను పూజించడం ఈరోజు ప్రత్యేకత. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటికి కతజ్ఞత చెప్పుకోవాలంటుంది ఈ కనుమ పండుగ. ఈ రోజున పశుశాలలు శుభ్రపరచడం, అలంకరించడం వంటివి చేస్తారు. ఆ రోజు రైతులు నాగలి కట్టరు, ఎద్దుల మీద కాడి మోపరు, బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు. కనుమనాడు పశువులను పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పశువులకు పూజతో పాటుగా ఇళ్ల ముందు ధాన్యపు కంకులను కట్టి పక్షుల పట్ల సైతం తమ కతజ్ఞతను ప్రకటిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి చేసి పశువులకు పెట్టే సంప్రదాయం కూడా కొన్నిచోట్ల ఉంది.
పొంగల్‌
కొత్త బియ్యంతో, ఆవుపాలతో పరమాన్నాన్ని వండి నివేదించడాన్ని ‘పొంగల్‌’ అంటారు. దీనినే పొంగలి లేదా హగ్గి అని కూడా అంటారు. తమిళంలో పొంగల్‌ అంటే ఉడకబెట్టడం లేదా బుడగ పెట్టడం. ఇది రెండు రకాలుగా చేస్తారు. చక్కరతో తయారైన పొంగల్‌ తీపిగా ఉంటుంది.
ముక్కనుమ
శాస్త్రం ప్రకారం అసలు ముక్కనుమ అన్న పండుగే లేదు. కాకపోతే కనుమ మర్నాడు మాంసాహారులు గ్రామదేవతలకు జంతువులను బలులిచ్చి, మాంసాహారాన్ని వండుకునే ఆచారం మాత్రం ఉంది. అదే క్రమంగా ముక్కనుమగా మారింది. తమిళనాట ముక్కనుమను ఘనంగా జరుపుకొంటారు. వారు ఈ రోజుని కరినాళ్‌ అని పిలచుకుంటారు. ఈ రోజు బంధువులను కలుసుకుంటే మంచిదని చెబుతారు. ఒకరకంగా బంధుత్వాలను కలుపుకునేందుకు, సంబంధీకుల మంచిచెడులను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యతనిస్తారు. అంతేకాదు ఈ రోజున కుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లే ఆనవాయితీ కూడా ఉంది.
పతంగులు
ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగుర వెయ్యడంలోని ఆనందం ఆనిర్వచనీయం. వాటిని బ్యాలన్స్‌ చేయడం వచ్చిన వారు జీవితంలో వచ్చే కష్టసుఖాలను కూడా జాగ్రత్తగా బ్యాలన్స్‌ చేయగలరని మనోవైజ్ఞానికుల అభిప్రాయం.
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగలో భాగంగా పతంగుల పండుగ ఘనంగా జరుగుతుంది. విదేశీ కైట్‌ ప్లేయర్స్‌ కూడా హైదరాబాద్‌ నగరానికి వచ్చి రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేస్తారు. గతంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కైట్‌ ఫెస్టివల్‌ జరిగింది. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పతంగులు ఎగురవేయడం కనిపిస్తుంది. ఇదే రోజు అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం జరుగుతుంది. రాత్రిపూట ‘తుకల్‌’ అనే దీపాల పతంగులను ఎగరేస్తారు.
కోడి పందాలు
సంక్రాంతికి కోడి పందాలు సంప్రదాయంగా వస్తున్న ఆచారం. అయితే నేడు కోడి పందాలు చట్టరీత్యా నేరం కనుక వీటిని రహస్యంగా నిర్వహిస్తుంటారు. ప్రభుత్వాలు ఈ పండుగ మూడు రోజులు వీటిని చూసి చూడనట్లు వదిలి వేయమని పోలీస్‌ సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇవ్వడం కారణంగా నేడు కోడి పందాలు నిర్వాహకులు అధునాతన సౌకర్యాలతో కోడి పందాలు బరులు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సినీ నటుల చేత ఘనంగా వీటిని ఆరంభిస్తున్నారు. మహిళలు సైతం ఉత్సహంగా ఈ పందాలకు రావడం నేడు చూస్తున్నాం.
రథం ముగ్గు
ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాం. కానీ పండగ చివరి రోజు కనుమ నాడు మాత్రం రథం ముగ్గువేసి ఆ రథాన్ని వీధి చివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. ఈ రథం ముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుంది. మూడ్రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే సంక్రాతిని ఘనంగా సాగనంపడానికి పుట్టిందే ఈ రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు కలిసి సహజీవనం సాగించాలనే సంకేతాలతో ఒక ఇంటి ముందు వేసే రథం ముగ్గు తాడును మరొక ఇంటి ముందు వేసిన రథం ముగ్గుతో కలుపుతారు. ఈ రోజుతో సంక్రాంతి పండుగ పూర్తి అవుతుంది.
కీడు పండుగ
తెలంగాణలో సంక్రాంతి కీడు పండుగ అంటారు. సంక్రాంతి శూన్య మాసం ముగిసేప్పుడు వస్తుంది. అనగా ఈ సమయంలో వర్షాకాలం పూర్తయి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పుల వల్ల అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. ఈ సమస్య పరిష్కారానికి పెద్దలు కొన్ని నియమాలు చేశారు. డిసెంబర్‌ నెల మధ్య నుండి మకర సంక్రాంతి వరకు ఎవరూ కూడా శుభకార్యాలు చేయరాదని, ఇది పీడ నెల అని భావిస్తారు. దక్షిణాయపు చివరి రోజైన భోగితో మన ఇంట్లో, ఒంట్లో ఉన్న కీడు అంతా తొలగిపోతుందని నమ్ముతారు. అందుకే ఈ నెల పూర్తయిన పిదప వచ్చే సంక్రాంతి పండుగను కీడు పండుగ అని అంటారు.
కనుమరుగవుతున్న సాంప్రదాయాలు
రెండు దశబ్దాల ముందు అయితే ఈ మకర సంక్రమణ కాలంలో మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్లు పోగు, కోతల రాయుడు పిట్టల దొరలు, భవిష్యత్‌ ఫలాలను చెబుతానంటూ ”సోదె చెపుతానమ్మ సోదె చెబుతాను లేనిదేమీ చెప్పను తల్లీ” అంటూ మన భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పే సోదమ్మలు; రైతుని అతని వంశాన్ని అతని పెద్దలనూ పొగుడుతూ ఆ రైతు కుటుంబం నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తూ పద్యాలల్లి ఆశీస్సులను వెదజల్లే భట్రాజులు; పెరట్లో చెట్టుకొమ్మ నెక్కి ”అప్పయ్య గోరో పడతా పడతా నే పప్పుదాకలో పడతా, పడతా పడతా నే పాతరగోతిలో పడతా” అంటూ అల్లరి చేసే కొమ్మదాసర్లు వంటి వారు దాదాపు నేడు కనుమరుగై పోయారు.
జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా పండుగ కళలు గ్రామాల్లో రోజు రోజుకు తరిగి పోతున్నాయి. అనేక జానపద కళారూపాలు, జానపద వాద్యాలు ఆదరణ లేక కనుమరుగైపోతున్నాయి. బతుకు తెరువు కోసం కొత్త దారులు వెదుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. వివిధ ఒత్తిడులు, సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా పండుగ సాంప్రదాయాలకు దూరమవుతూ, పెద్దగా ఆసక్తి చూపిండంలేదు. సంక్రాంతి పర్వదినం పిండి వంటలకు ప్రసిద్ధి. కానీ నేడు పిండివంటలు చేసుకునే తీరికా, ఓపిక లేకపోవడంతో బేకరీలకో, స్వీట్‌ దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
హరిదాసులు, డూడూ బసవన్నలు, జంగమదేవరలు కనుచూపుమేర కానరావడం లేదు. ఆధునిక పోకడల కారణంగా పట్టణ ప్రాంతాల్లో సంక్రాంతి సెలవుగా మిగిలిపోగా పల్లెసీమల్లో కాస్తో కూస్తో బోగిమంటలు, రంగ వల్లులు వంటివి సంక్రాంతికి క్రాంతిని నింపుతున్నాయి. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన ఈ సాంప్రదాయాలు ప్రస్తుతం అరుదుగా దర్శనమిస్తుస్తున్నాయి. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటో తేదీకి ఇచ్చే ప్రాధాన్యత కూడా మన పండుగలకు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా పెల్లుబుకుతున్నాయి.
ఇప్పుడు గ్రామాలకు వెళితే వెతికి చూసినా పొల్లాలో పనిచేసే పశువులు కనిపించవు. అక్కడక్కడ మాత్రం పాలిచ్చే పశువులు కనిపిస్తాయి. సేద్యంలో యాంత్రీకరణ ఫలితంగా ఎడ్లు దున్నలకు ఆదరణ లేకుండా పోయింది. దీనిఫలితంగా నేడు కనుమ పండుగకు అర్ధమే లేకుండా పోయింది. ఒక పక్క సాంప్రదాయం మరొక పక్క చట్ట విరుద్ధమైన కోడి పందాలు, జూదాలు మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రేపటి తరం వాళ్ళు ఈ సంప్రదాయాలు, ఆచారాల గురించి కేవలం చిత్రాలు ద్వారా, కథనాలు ద్వారా తెలుసుకునే పరిస్ధితులు తప్పనిసరి కానున్నాయి. ఈ తరుణంలో దైనందిన జీవితంలో మానసిక వికాసాన్ని ఆనందాన్ని ఇచ్చే ఈ పండుగల ప్రాధాన్యతను గుర్తించి, కళలను ఆదరించవలసిన బాధ్యత నేటి తరంపై ఎంతైనా ఉంది.

సంక్రాంతి జరుపుకునే దేశాలు
 మకర సంక్రాంతి పండుగను నేపాల్‌లో ‘మాఘె సంక్రాంతి’ అంటారు.
పాకిస్థాన్‌, సింధ్‌ ప్రాంతంలో వాళ్లు సంక్రాంతి పండుగను ‘తిర్‌మూర్‌’ పేరుతో చేసుకుంటారు.
కాంబోడియాలో సంక్రాంతిని ‘మోహ సాంగ్‌క్రాన్‌’ అంటారు. వాళ్లకు కూడా ఇది పంటల పండుగే.
శ్రీలంకలో మకర సంక్రాంతిని ‘సూర్యపకరణ్‌’ అంటారు. వాళ్లకు కూడా ఇది పంటల పండుగే కావడంతో మతాలతో సంబంధం లేకుండా రైతులందరూ ఈ పండుగ చేసుకుంటారు.
బంగ్లాదేశ్‌లో ‘పౌష్‌ సంక్రాంతి, సంక్రెయిన్‌’ అంటారు. పిల్లలు, పెద్దవాళ్లు గాలి పటాలు ఎగురవేయడంలో మునిగిపోతారు.
ఢాకాలో సంక్రాంతికి పతంగుల పండుగ నిర్వహిస్తారు. ఈ వేడుకను వాళ్లు ‘ఘౌరి ఉత్సబ్‌’ అంటారు.
వీటితో పాటు థారుల్యాండ్‌, వియత్నాం వంటి మరికొన్ని దేశాలు కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటాయి.
దేశంలో వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి
మకర సంక్రాంతి పండుగను తెలుగువారితో పాటు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ ఇలా వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా జరుపుకుంటారు.
తమిళనాడులో మకర సంక్రాంతి మాదిరిగానే ‘పొంగల్‌’ జరుపుకుంటారు. ఈ రోజున సూర్య భగవానుడికి ఖీర్‌ లేదా పొంగల్‌ సమర్పిస్తారు తమిళులు.
ఉత్తరప్రదేశ్‌లో సంక్రాంతిని ‘ఖిచ్రి’ అంటారు. గంగా తీరంలో పెద్ద ఎత్తున భోగిమంటల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
మధ్యప్రదేశ్‌లో సంక్రాంతిని ‘సుకరాత్‌’ పేరుతో ఆనందంగా జరుపుకుంటారు.
పంజాబ్‌, ఢిల్లీ, హర్యానాతో సహా కొన్ని ఇతర ప్రదేశాలలో భోగి పండుగను ‘లోహ్రీ’ అని, మకర సంక్రాంతిని ‘మహీ’ అని అంటారు.
కర్ణాటకలో ‘మకర సంక్రమణం’ పేరుతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు.
గుజరాత్‌లో మకర సంక్రాంతిని ‘ఉత్తరాయణ పండుగ’గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గాలిపటాలను ఎగురవేస్తారు.
క పశ్చిమ బెంగాల్‌లో మకర సంక్రాంతిని ‘పుష్య సంక్రాంతి’ అంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం పుష్య మాసంలోనే జరగడంతో ఇది పుష్య సంక్రాంతిగా ప్రసిద్ధి చెందింది.
ప్రభల తీర్ధం
తెలుగు సంస్కతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమవ్యాప్తంగా మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలలో కనుమ రోజున ప్రభలతీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారు జగ్గన్నతోటలో దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభల తీర్థానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలలో గంగలకుర్రు అగ్రహారం ప్రభలు ఎగువ కౌశిక నదిని దాటి వస్తున్న తీరు చూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణకాలంలో ప్రభలను ఊరిపొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి అద్భుతమైన, కన్నుల పండుగగా, సంప్రదాయ బద్దంగా వేలాది మందితో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం చూసే భాగ్యం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కలుగుతుంది. కనుమ పండుగ రోజున ఎటువంటి ఆలయం గాని, గోపురం గాని, కనీసం చిన్న విగ్రహం గాని లేని రెండు ఎకరాల కొబ్బరి తోటలో జరిగే విశిష్ఠమైన తీర్థం ఇది. వేలాది మంది కోనసీమ వాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది ఈ ఏకాదశ రుద్రులను దర్శించే తరించేందుకు ఇక్కడకు వస్తూ ఉంటారు.
– రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578 

Spread the love