హ్యూమనాయిడ్స్‌

Humanoidsఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తమకు తామే నిర్ణయాలు తీసేసుకోగల రోబోలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. మంచికి వాడుకుంటే వాటివల్ల ఎంత ఉపయోగమో.. చెడుకు వాడుకుంటే అంత నష్టమూ సంభవిస్తుంది. మరి ఫ్యూచర్‌ రోబోటిక్స్‌ ఎలా ఉండబోతున్నాయి?.. రోబో లోకం ఆవిష్కృతమవుతుందా?.. ఈ ప్రపంచం రోబోలతో నిండిపోతుందా?.. రోబో లేనిదే మనిషి బతకలేని స్థితికి వచ్చేస్తాడా? ఫ్యూచర్‌లో జరగవచ్చని భావిస్తున్న కొన్ని సంఘటనలకు ముందుగానే రోబో సినిమాలో చూపించారు. ఫీలింగ్‌ ఉండదు. స్పర్శ ఉండదు. కేవలం మరమనిషి. చెబితే తప్ప ఏ పనీ చేయదు. ఇవన్నీ రోబో లక్షణాలు. కానీ, ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే సెన్సిటివ్‌ రోబోలు తయారయ్యాయి.

రోబో టెక్నాలజీ రాబోయే రోజుల్లో మనుషులతో మరింతగా మమేక మవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోటిక్స్‌ అంతకంతకు అభివృద్థి చెందుతున్నప్పటికి అవి మనిషి చేతిలో కీలుబొమ్మేలే. సెన్సార్స్‌, కమాండ్స్‌ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకో గలుగుతున్నాం. మీడియం సైజ్‌లో ఉండే ఫ్రెంచ్‌ కంపెనీ ఆల్డీబరాన్‌ రోబోటిక్స్‌ తయారు చేసిన నోవో రోబో పూర్తిగా స్వతంత్ర రోబో. దానంతట అదే నిర్ణయాలు తీసుకొని అమలు చేసేస్తుంటుంది. మనుషులను గుర్తిస్తుంది. ఎవరైనా ఏమైనా చెబితే బుద్ధిగా వాటిని చేసేస్తుంది. తనలాంటి రోబోలు ఎదురుపడితే వాటితో ముచ్చటిస్తుంది కూడా. కేవలం అరమీటరు ఎత్తుండే ఈ నోవోకు మనిషి భావాలను తెలుసుకుని ప్రవర్తించడమూ తెలుసు. అందుకే రోబోటిక్స్‌లో ఇప్పుడు నోవో ఓ సంచలనం.
నోవో కన్నా పెద్దగా ఉండే మరో అద్భుతమైన రోబోను హోండా కంపెనీ తయారు చేసింది. అదే అసిమో. ఇళ్లల్లో ఉపయోగించుకోవడానికి పూర్తిగా అనువైన రోబో అని హోండా కంపెనీ చెబుతోంది. అంతేకాదు. మనిషిలా పనిచేయడానికి వీలుగా దీనికోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. మనిషి ఎలా నడుస్తాడన్న సూత్రాన్ని ఆధారంగా చేసుకుని, దీని కాళ్లను రూపొందించారు. అందుకే మెట్లను సైతం అవలీలగా అసిమో ఎక్కగలదు. ఇంటిలో చక్కగా తిరుగుతూ అన్ని పనులనూ అసిమో చేసిపెడుతుంది. చెప్పాలంటే ఓ మనిషి ఎలా పనిచేస్తాడో.. అలానే చేస్తుంది. మనుషుల్ని, వస్తువులను గుర్తించడం వాటిని గుర్తుపెట్టుకోవడం కూడా అసిమోకు వచ్చు. ఒక్కోసారి ఏదైనా వస్తువును సరిగ్గా చూడకుండా మనం కాలితో తన్నేస్తామేమో గానీ ఈ హోండా హ్యుమనాయిడ్‌ ఆ పని చేయదు.
రోబో సిటిజన్ల యుగం ప్రారంభం కాబోతోంది. అందరినీ ప్రేమించమని సందేశమిచ్చే ‘సోఫియా’ మనిషికి కబుర్లు చెబుతూ, కాఫీ, టీలిస్తూ, బోలెడన్ని విషయాలు చెబుతూ, చకచక అన్ని పనులు చేసిపెట్టేందుకు మన మధ్యకు రాబోబోతోంది. హాస్పిటల్‌కు వెళ్లినా, రెస్టారెంట్‌కు వెళ్లినా, షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా ఇక మనకు అన్నిచోట్లా రోబోలే దర్శనమివ్వనున్నాయి. అప్పుడే పబ్లిక్‌ ప్లేసుల్లో రోబోల సేవలను విస్తృతంగా మనదేశంలో ఉపయోగిస్తుండగా సోఫియా వంటి హ్యూమనాయిడ్స్‌ కూడా మార్కెట్లోకి ఎంటర్‌ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. హ్యూమనాయిడ్‌ రోబోలు ఈ ఏడాది చివరికల్లా మనకు పెద్దఎత్తున అందుబాటులోకి రానున్నాయి. సోఫియాను తయారు చేసిన హాంగ్‌ కాంగ్‌ బేస్డ్‌ రోబోటిక్స్‌ కంపెనీ ‘హాన్సన్‌ రోబోటిక్స్‌’ మరో 6 నెలల్లో రోబోలను మార్కెట్లో సప్లై చేయనున్నట్టు ప్రకటన చేసింది. 2016లో తొలిసారి ఆవిష్కరించిన ‘సోఫియా’ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా నిలువగా, ఇప్పుడు సోఫియా చెల్లి కూడా లాంచింగ్‌కు రెడీ అవుతోంది. 2021కల్లా ప్రపంచంలోని పలు దేశాలకు సోఫియా, ఇతర మోడల్‌ హ్యూమనాయిడ్స్‌ను భారీ ఎత్తున సప్లై చేయనున్న సంస్థ కరోనా మహమ్మారి నేపథ్యంలో మానవాళికి మరిన్ని సేవలందించేందుకు సిద్ధమైంది.
రోబోలపై మన అవగాహన రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా మనుషులకు సహాయం చేసే వినూత్న రోబోల కోసం నిరంతరం కృషి చేస్తున్నాయి. మానవులకు సాయం చేసేందుకు బోస్టన్‌ రోబోటిక్స్‌, రూపొందించిన రోబోడాగ్‌ వంటి వాటిని మనం ఇప్పటికే చూశాం. ఇప్పుడు బరువైన వస్తువులను మోయడంలో మనుషులకు సాయం చేసే కొత్తరకం రోబోను తయారు చేసింది మరో సంస్థ. డిజిట్‌ అని పిలువబడే ఈ హ్యూమనాయిడ్‌ రోబో ఫ్యాక్టరీల్లో, కార్యాలయాల్లో పెద్ద పెద్ద బాక్సులు, వస్తువులను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చగలుగుతుంది. ఇతర రోబోలతో పోలిస్తే ఈ రోబో డిజైన్‌ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ రోబోకు అసలు తల ఉండదు. రోబో కిందివైపు మోకాళ్ల వద్ద అసాధారణ వంపు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్‌ వల్ల ఆ రోబో బరువైన వస్తువులను చేతులపై పెట్టుకుని ముందుకు నడిచేందుకు ఉపయోగపడుతుంది. బరువైన వస్తువులను పట్టుకుని మెట్లపైకి కూడా ఎక్కగలదు ఈ రోబో. కిందకు వంగి బాక్సులను స్వయంగా ఎత్తుకోవడం ఈ రోబో మరో ప్రత్యేకత. ఈ రోబోను ఎజిలిటీ రోబోటిక్స్‌ అనే సంస్థ రూపొందించింది.
ఒకప్పుడు రోబోలంటే మెటాలిక్‌ బాడీతో డబ్బాలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆ గెటప్‌ పూర్తిగా మారిపోయింది. న్యూస్టైల్‌తో తయారైన హ్యూమనాయిడ్స్‌ వచ్చేశాయి. మనిషిలా కనిపిస్తూ మనిషిలా పనిచేయడం వీటి ప్రత్యేకత. వీటిని అభివృద్ధి చేయడంలోనే జపాన్‌, కొరియాలాంటి టెక్నికల్లీ డెవలప్‌డ్‌ కంట్రీస్‌ తలమునకలై ఉన్నాయి.
పైకి చూడడానికి మనిషి బాడీనే ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా అబ్జర్వ్‌ చేస్తే తప్ప అది రోబో అని చెప్పలేం. మనిషి చేయగలిగే పనులన్నీ చేయడమే ఈ నయా రోబోల స్పెషాలిటీ. మనం మాట్లాడినట్లే మాట్లాడతాయి. కనిపించివారితో ఇంటరాక్ట్‌ అవుతాయి. ఏవైనా ప్రశ్నలు వేస్తే.. వాటికీ సమాధానం చెబుతాయి. కానీ, స్కిన్‌ను తీసి చూస్తేమాత్రం లోపలంతా వైర్లు, చిప్స్‌తో నిండిపోయి ఉంటుంది.
ఇప్పుడు తయారయ్యే రోబోలు పవర్‌ఫుల్‌ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోగలుగుతాయి. ఆనందం, దు:ఖం, కోపం, విసుగు, నిరాశ ఇలాంటి ఫీలింగ్స్‌ అన్నీ ఇప్పటివరకూ మనిషికే సొంతం. ఇప్పుడు మనిషిలా మారుతున్న రోబోకూడా వీటిని అందిపుచ్చుకొంటోంది. ఫీలింగ్స్‌ను ప్రదర్శించగలిగే రోబోలు రెడీ అవుతు న్నాయి. సందర్భానికి తగ్గట్లుగా మాటలతో పాటు భావాలను పలికించడం వీటి ప్రత్యేకత. అందుకే వీటిని రోబోలని పిలవడం మానేశారు.
మనిషిలా మారాక కూడా మరమనిషని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? సింపుల్‌గా ‘హ్యుమనాయిడ్స్‌’ అంటున్నారు. యంత్రంలా కనిపించే దశనుంచి మనిషిలా కనిపించే స్థాయికి ఎదిగిన రోబో.. మరో రెండు మూడు దశాబ్దాల్లో పూర్తిగా మనిషిలా మారిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు.. వాస్తవం కూడా.
మరో ఇరవైఏళ్లలో రోబోలోకం సాకారం కాబోతోంది. ఈ ప్రపంచ మంతా రోబోలతో నిండిపోవచ్చు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో హ్యూమనాయిడ్స్‌ కనిపిస్తుండగా వచ్చే ఏడాది ప్రారంభానికల్లా హ్యూమనాయిడ్‌ స్టాఫ్‌ను పెంచుకునేందుకు పెద్ద ఆసుపత్రుల్లో పోటీ పెరిగింది. భౌతిక దూరం పాటించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో సోఫియా వంటి మనిషిని పోలిన హ్యూమనాయిడ్‌ రోబోలు, హెల్త్‌ కేర్‌ రంగంలో సేవలు అందిస్తూనే, వ్యక్తులకు తోడునీడగా ఉంటాయి కనుక వీటి అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఉందని హాన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ సగర్వంగా చెబుతోంది. ఐసోలేషన్లో ఉన్నవారికి సపర్యలు చేస్తూనే, మంచి కంపెనీ ఇచ్చే సోఫియా వంటి రోబోల ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని సంస్థలు కూడా గ్రహిస్తున్న నేపథ్యంలో హాన్సన్‌ కు బల్క్‌ ఆర్డర్లు ఇస్తున్నాయి. టిఫిన్‌ చేసుకోవడం.. వంట వండుకోవడం ఇబ్బందిగా ఉందా?.. ప్రతీరోజు కూరగాయలు తరగడం చికాకుగా ఉందా?.. వంటపనిలో సాయం చేయడానికి.. ఫుడ్‌ ఐటెమ్స్‌ తయారు చేయడానికి ఎన్నో రకాల రోబోలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇక స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన రోబో మరొకటుంది. ఇంటిపనులు చేసిపెట్టే ఆల్‌రౌండర్‌ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకులు తయారు చేశారు. భోజనం అయిపోయిన తర్వాత వదిలేసిన ‘డిష్‌’లను తీసుకు వెళ్లిపోతుంది. వాటిని క్లీన్‌ చేయమని రోబోటిక్‌ ఆర్మ్‌కు అప్పగిస్తుంది. మాసిన బట్టలుంటే వాటిని వాషింగ్‌ మెషిన్లో వేసేస్తుంది. అంతేకాదు.. ప్రతీరోజు ఇంటిని క్లీన్‌ చేయడం కూడా దీని డ్యూటీనే. ఇంటిపనులు చేసిపెట్టడానికి, పేషెంట్స్‌ ఉంటే హెల్ప్‌ చేయడానికి మరో రోబోను కూడా జపాన్‌ పరిశోధకులు డెవలప్‌ చేశారు. ఇంట్లో చెత్త ఎక్కువైతే దాన్ని పారబోయడానికి కూడా ప్రత్యేక రోబోలు తయారయ్యాయి.
ఇలా ఒకటీ రెండు కాదు, కాలు కిందపెట్టకుండానే మన పనులు చేసి పెట్టడానికి రోబోలు రెడీ అవుతున్నాయి. చిన్న ప్రోగ్రామ్‌ ఫీడ్‌ చేస్తే చాలు. వరసగా దానంతట అదే అన్ని పనులను చేసేస్తుంది. భవిష్యత్తులో మన అవసరాలను అర్థం చేసుకుని పనిచేసే రోబోలను తయారు చేయాలన్నది సైంటిస్టుల ప్లాన్‌.
అంతరిక్షంలోనూ
అంతరిక్ష ప్రయోగాల్లో రోబోలు ఎప్పటినుంచో పాలు పంచుకుంటున్నాయి. ఇవన్నీ చాలావరకూ క్రేన్‌ల రూపం లోనో, రోవర్ల రూపంలోనో ఉన్నాయి. మనిషిని పోలిన రోబో ఒక్కటి కూడా ఇంతవరకూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ ఘనత రోబోనాట్‌ – 2కు దక్కించుకోబోతోంది. నాసా, జనరల్‌ మోటర్స్‌ సంయుక్తంగా పరిశోధనలు చేసి రూపొందించిందే.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి 2011 లో చేరిన తొలి హ్యూమనాయిడ్‌ రోబోనాట్‌ – 2 (ఆర్‌- 2)కు 2015 నాసా ఇన్వెన్షన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. ఈ రోబో అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తూ ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములకు తోడ్పడుతోంది. జనరల్‌ మోటార్స్‌తో కలిసి నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ) దీన్ని రూపొందించింది. ఇది మనిషి మాదిరిగా సులభంగా కదులుతుంది. ఐఎస్‌ఎస్‌ చుట్టూ తిరుగుతూ మరమ్మతులు చేసేందుకు, స్పేస్‌ వాక్‌లో వ్యోమగాములకు తోడ్పడేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఈ రోబోనాట్‌కి సాధారణ రోబోల తరహాలో కాళ్లుండవు. కేవలం బాడీ మాత్రమే ఉంటుంది. జీరోగ్రావిటీలో సులువుగా పనిచేయడం కోసం ఈ తరహా డిజైన్‌ను రూపొందించారు. 350కి పైగా సెన్సార్లను ఇందులో అమర్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఉన్న వ్యోమగాములకు పరిశోధనల్లో సహాయం చేస్తుంది. చెప్పాలంటే, ఆస్ట్రోనాట్‌లు చేసే పనులన్నింటినీ ఈ రోబోనాట్‌ చేయగలదు. ఇక ఇంటర్నెట్‌ను వాడుకోవడంలో దీని స్టైలే వేరు. అంతరిక్ష కేంద్రం నుంచి ట్విట్టర్‌లో ట్వీట్స్‌ పంపిస్తుంది.
చంద్రుడిపై వ్యోమగాములు ఎక్కువ కాలం ఉండలేరు కాబట్టి, రోబో ద్వారా అన్వేషణ కొనసాగించాలన్నది నాసా ఆలోచన. పూర్తిగా మనిషిలా ఉండే ఈ రోబోనాట్‌.. చంద్రుడిపైకి వెళితే మాత్రం ఎన్నో విలువైన విషయాలు.. చంద్రుడిపై దాగున్న రహస్యాలు భూమికి చేరతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనిషిలా మారుతున్న రోబోకు మేథస్సు కూడా పెరుగుతోంది. స్వతంత్రంగా ఆలోచించగలుగుతోంది. ఈ ఆలోచనలే రోబోను మనిషికి శత్రువును చేస్తాయా.. మన వినాశనానికి దారి తీస్తాయా.. చాలామందిలో ఇప్పుడు ఇదే ఆందోళన.
రోబోటిక్స్‌ డెవలప్‌ అయ్యేకొద్దీ టెన్షన్‌ పెరుగుతోంది. మనలా ఆలోచించగలిగే శక్తిని సంపాదించుకుంటున్న రోబోలు, చివరకు మనల్నే నాశనం చేస్తాయోమేనన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. హాలీవుడ్‌లో వచ్చిన కొన్ని సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు ఈ టెన్షన్‌ను మరింత పెంచాయి.
సొంతగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే శక్తి రోబోకు వచ్చేసిందంటే మనిషి కంట్రోల్‌లో ఉండకపోవచ్చన్నది చాలామంది నమ్మకం. తనను బానిసగా చూస్తున్న మనిషిపై దాడిచేసి ప్రపంచాన్ని తనగుప్పిటలోకి సూపర్‌రోబోలు తెచ్చుకుంటాయేమోనన్న భయమూ ఉంది.
అయితే ఇదంతా సులువు కాదు. ప్రోగ్రామింగ్‌ ఆధారంగా తయారయ్యే రోబో ఆలోచనలకూ కొన్ని పరిమితులుంటాయి. మనిషిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన రోబోకు రాదనే చెప్పొచ్చు. కాబట్టి వాటివల్ల మనకు పెద్దగా సమస్యలు రావు. కానీ, సంఘవిద్రోహుల చేతికి రోబో టెక్నాలజీ అందిందంటే మాత్రం పెను ప్రమాదమే ముంచు కొస్తుంది.
మనిషికి మేలు చేసే రోబోను కాస్తా విధ్వంసకారిగా మార్చడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇలాంటి రోబోలు కొన్ని తయారైనా మానవాళికి మనుగడకు కష్టమే. అయితే నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా రోబోలను మన మేధో మధన వాడుకుంటే రాబోయే తరాలకు అద్భుతమైన సాంకేతిక ప్రతిభని అందించే వాళ్ళమవుతాం.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008 577 834

Spread the love