తీయని బంధం

తీయని బంధంఅర్ధరాత్రి అయింది. దిగ్గున మంచం మీద నుండి లేచాను. బెడ్‌ లైట్‌ వెలుగు తూనే ఉంది. చుట్టూ చూశాను. అలివేణి నిద్రపోతోంది. ‘హమ్మయ్య’ అనుకున్నాను. చడీ చప్పుడు కాకుండా మంచం మీద నుండి జాగ్రత్తగా దిగాను.
గోడ గడియారంలో తిరుగుతున్న ముల్లుల శబ్దం బాగా వినబడుతోంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అలా వినబడుతుంది కదా అనిపించింది. హాల్లోకి వచ్చాను. వెనక్కి చూశాను. అలివేణి ఇంకా పడుకునే ఉంది. నా పనికి ఆటంకం లేదనుకంటూ హాల్లో నుండి ముందుకు కదిలాను.
పిల్లి కంటే మెల్లగా అడుగులు వేస్తూ వంటగదిని చేరాను. దగ్గరగా వేసిన తలుపును నెమ్మదిగా తీశాను. లైటు వేశాను. గోడమీదే తచ్చాడుతున్న బల్లి నన్ను చూసి పక్కకు తప్పుకుంది. ‘బల్లి చూసినా అలివేణితో అది చెప్పలేదుగా’ లోపల నవ్వుకుంటూ అలమారు తలుపు తీశాను.
అక్కడ పెట్టెలో ఉన్న తీపి వంటకాల ను చూడగానే జిహ్వ లేచొచ్చింది. లాలాజలం ఊరింది. కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూత రేకులు లాంటి తీపి వంటకాలెన్నో..ఒక్కటేమిటి? అన్నీ చవులూరించేవే. అనకూడదు కానీ, తీపి అంటే ఎంతిష్టమో నాకు.
నలభై ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో పని చేసి, పదవీ విరమణ చేసిన నాకు ఏ రోగమూ లేదు. ఏమిటో? రిటైర్‌ అయ్యాక ఖాళీ ఎక్కువైంది.
రెండు కాళ్లూ నెల రోజులుగా విపరీతంగా లాగడం మొదలు పెట్టాయి. అరికాళ్ళు తిమ్మిరెక్కడం, ఆకలి ఎక్కువ వేయడం, ఇన్ని మార్పులు ఒకేసారి వచ్చాయంటే శారీరకంగా ఏదో మార్పు జరిగినట్టే. ఆ మార్పే…నాకు మధుమేహం రావడం.
డాక్టర్స్‌ వాకింగ్‌ ‘తప్పద’న్నారు. స్వీట్స్‌ తినడం ‘తప్ప’న్నారు. కాఫీ షుగర్‌ లేకుండా తాగమన్నారు. ఇన్నాళ్లూ పిల్లలకు పాఠాలు చెప్పిన నాకు, వాళ్ళు జాగ్రత్తలు చెబుతూ పాఠం చెప్పేసరికి నవ్వుకున్నాను. డిగ్రీ లు తీసుకున్నారు కదా. వాళ్ళకేం? వాళ్లేన్నైనా చెబుతారు. ఆరు దశాబ్దాలుగా తీపి అలవాటైన నాలుకకు, తీపి చూపించకుండా ఉండగలమా? ఉండ తరమా?
కానీ, ‘చక్కెర లేకుండా చక్కగా బతికేస్తా!’ అంటూ ఇంట్లో వాళ్ళందరి ముందూ చక్కెర శపథం చేసాను. ఇక ఆరోజు నుండీ నాకు కష్టాలు మొదలయ్యాయి. చక్కెర లేని కాఫీతో న్యూస్‌ పేపర్‌ చదవలేక పోతున్నాను. తీయని తీపి బాధలు కాఫీతో మొదలు.
అలివేణి బొబ్బట్లు చేయడంలో నేర్పరి. బూరెలు వండితే బుట్టలో పడి పోవాల్సిందే. కాజా చేస్తే కాకినాడ దిగి రావాల్సిందే. అన్నీ చేస్తుంది. అడిగిన వెంటనే పెడుతుంది. ఇప్పుడవన్నీ బంద్‌ చేసేసింది.
జీడిపప్పు లేకపోయినా, పాయసం తాగేయచ్చు. కానీ చక్కెర లేని పాయసం తాగడం అంటే… పెద్ద శిక్షే అనిపించింది.
మొన్న మనవడి పుట్టిన రోజున.. ఇంటిల్లి పాదీ చక్కెరతో చేసిన చిక్కని పాయసం తాగారు. నాకు మాత్రం షుగర్‌ లెస్‌ అంటూ ఇచ్చారు. ఒక్క చెంచాడు బలవంతంగా తాగినా కూడా గొంతు దిగలేదు. నాలుక ముందుకు రావడం లేదు.
ఎవరూ చూడకుండా సింక్‌ లో షుగర్‌ లెస్‌ పాయసం పారపోసి.. అందరి ముందూ పాయసం తాగినట్టుగా నటించాను.
”అలివేణీ.. ఒక్క చెంచాడు చక్కెర ఉన్న పాయసం ఇవ్వవే” గోముగా అడిగాను.
అలివేణి నా కేసి జాలిగా చూస్తూ, ”మనవడి పుట్టినరోజు కదా!” అంటూ ఒక్కటే ఒక్క చెంచాడు ఇచ్చింది.
అంతే నా నాలుక బుట్ట తీయగానే బుసకొట్టే పాములా ముందుకు వచ్చింది. తీపిని ఆస్వాదించింది.
”తీపి లేకుండా బతికే బతుకూ. ఒక బతుకేనా?” అనిపించింది ఆ క్షణంలో.
అప్పటి నుండీ… రక్తం రుచి మరిగిన పులి లా.. ఇంట్లో వాళ్ళందరి కళ్లు కప్పి.. వాళ్ళు పడుకున్న తర్వాత గోడ దూకి వచ్చే దొంగలా సమయం కోసం ఎదురు చూడసాగాను. మొన్న ఆదివారం మధ్యాహ్నం.. ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు వంటింట్లోకి పోయాను. ఇదే సరైన సమయం అనుకుంటూ కాజా నోట్లో పెట్టొకోబోయాను. అంతే… పోలీసులా మా అబ్బాయి వచ్చాడు. ‘నాన్నా’ అంటూ అరిచాడు.
”పెద్దవారు! మేము తప్పు చేస్తే మాకు బుద్ధి చెప్పాలి. మీరే తప్పు చేస్తే ఎలా?” అంటూ కాజాను లాక్కున్నాడు.
అప్పుడు అలివేణి కేసి సూటిగా చూడలేక తల దించుకుంటూ బయటకు నడిచాను.
”అమ్మా! ఇకనుండీ స్వీట్స్‌ ఇంట్లో చేయకు. అభి కోసం బయట ఎన్నో దుకాణాలు ఉన్నాయి. అక్కడ కొంటాను” అన్న మా వాడి స్వీట్‌ వార్నింగ్‌ నా దృష్టి దాటిపోలేదు.
ఆ రోజు నుండీ కొడుకు, కోడలు, అలివేణి విడతల వారీగా వళ్ళంతా కళ్ళు చేసుకుని నన్ను గమనించ సాగారు. పగటిపూట తీపి తినడం ‘పగటి కలే’ నని నాకు అర్ధమైంది.
సాయంత్రం అలవాటులో భాగంగా ఈవినింగ్‌ వాక్‌ కోసం గాంధీ పార్కుకు బయలు దేరాను. అప్పటికే రోజూ నాతో పార్క్‌లో వాకింగ్‌ చేసే నా మిత్రులు… నా వయసే ఉన్న నారాయణ, మిలట్రీలో పనిచేసి రిటైరైన అచ్యుతం, రెవెన్యూలో పని చేస్తున్న సత్యం నా కోసం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. పార్కులో గాంధీ బొమ్మకు ఒక వైపుగా నిల్చొన్నారు.
”ఏం పురుషోత్తం? చక్కెర వ్యాధి వచ్చిందట గా” అచ్యుతం అడిగాడు. నాతో కలిసి నడుస్తూ.
”పన్నెండేళ్ళు దాటాకా యవ్వనం, అరవై ఏళ్లు దాటాకా చక్కెరవ్యాధి రావడం కామన్‌. ఇందులో వింతేముంది?” నా వెనకే నడుస్తున్న నారాయణ నన్ను సమర్ధిస్తున్నట్టుగా అన్నాడు.
”మరి.. మీ వయసూ అరవై దాటింది కదా. మీకింకా రాలేదే?” నారాయణను దాదాపు వెక్కిరిస్తున్నట్లుగా అడిగాడు అచ్యుతం.
”అది నా అదృష్టం” ఏం చెప్పాలో తెలియక అలా అనేశాడు నారాయణ.
అంటే పురుషోత్తం, నేనూ దురదృష్ట వంతులమా?” వెంటనే చెక్‌ పెట్టాడు అచ్యుతం.
ఇక లాభం లేదనుకుని ఒక నవ్వు నవ్వాడు నారాయణ.
అచ్యుతం నాతో, ”పురుషోత్తం! పొరపాటున కూడా లడ్డు, గిడ్డు.. అంటూ గడ్డి కరవకు. జిహ్వ లాగితే జిందగీ మొత్తం క్లోజ్‌. జాగ్రత్త చాలా అవసరం.”
అచ్యుతం మాటలతో జేబులో ఉన్న, మడతకాజాను మడత పెట్టి తెచ్చుకున్న కవర్‌ ను జాగ్రత్తగా బైటకు తీసాను.
”యూజ్‌ మీ” అని ఉన్న డస్ట్‌ బిన్‌ బొమ్మలో పడేసి చేతులు దులుపుకున్నాను.
కాసేపు అందరం కలసి నవ్వుతూ నడిచాం. గంట తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలు దేరాం.
”పురుషోత్తం… వ్యాధికి మనం లొంగకూడదు. ఆ వ్యాధే మనకు లొంగాలి. నన్ను ఆదర్శంగా తీసుకో!” మంటూ మళ్ళీ జాగ్రత్తలు చెప్పాడు అచ్యుతం.
”ఆ! ఒకటి రెండు సార్లు తింటే చచ్చిపోతామా?” అంటూ అచ్యుతం మాటలను మనసులో తేలికగా తీసి పారేశాను.
ఎప్పుడూ లేనిది, నారాయణ నా వెంట వస్తూంటే, ”ఈ రోజు నా కూడా, నా దారిలో వస్తున్నావ్‌. ఏమిటి స్పెషల్‌?” అడిగాను.
”నువ్వు డస్ట్‌ బిన్‌లో మడత కాజా పడేయడం చూసాను” అన్నాడు భుజంపై చేయి వేస్తూ.
”ఏం? అలివేణికి ఆ విషయం వచ్చి చెబుతావా?” చిరుకోపంతో అడిగాను.
”ఉడుక్కోకురా! నువ్వెళ్లే దారిలో బద్రి స్వీట్‌షాప్‌ ఉంది కదా”
”ఉంటే?”
”ఇంటికి చుట్టాలొచ్చారు. స్వీట్స్‌ కొని ఇంటికి పట్టుకెళ్లాలి” కారణం చెప్పాడు.
”అదే షాపులో స్వీట్స్‌ కొని..జిహ్వ కు తృప్తి కలిగేలా తినాలనుకున్నాను.
వీడి పుణ్యమా అని అది కూడా తీరడం లేదు. ఈ అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళ కన్ను గప్పైనా సరే స్వీట్స్‌ తినాలని నిర్ణయించు కున్నాను. అదే ఆలోచనతో అందరికంటే ముందుగా పడుకున్నట్లుగా నటించాను.
పంచాంగంలో మంచిరోజు కోసం ఎదురు చూసినట్టుగా అర్ధరాత్రి దాటాకా.. లేచి నా జిహ్వ చాపల్యం తీర్చుకోవాలని అనుకున్నాను. నరం లేని నాలుక కోరిక తీర్చాలనుకున్నాను.
చేతిలో జారిపోయే పూత రేకును తీసుకోగానే లాలాజలం ఊట బావిలా ఊరింది. తీపి తినకుండా బతకడం కంటే తీపి తిని చచ్చిపోయినా జన్మ ధన్యమైనట్టే ననిపించింది. పూతరేకు నోట్లో పెట్టబోయాను. అంతే!
”తాతయ్యా” అంటూ ఆరేళ్ళ నా మనవడి పిలుపు.
కాపీ కొడుతూ పరీక్ష రాసే పిల్లాడు టీచర్‌కు పట్టిబడినట్లుగా , నా అభీ కి అడ్డంగా దొరికి పోయానని పించింది.
”దొంగతనం తప్పు” అంటూ రోజూ కథల్లో చెబుతావు. అటువంటిది.. నువ్వు దొంగలా ఇలా చేయవచ్చా?” వాడు అమాయకంగా నాకేసి చూస్తూ అడిగాడు.
”ఆరి! భడవా! బామ్మ పక్కన పడుకున్నావనుకున్నాను. ఎప్పుడు లేచావ్‌?”
మాట మారుస్తూ అడిగాను.
వాడు నా చేతిలోనున్న పూతరేకు లాక్కుంటూ.. ”రాత్రి నేను నీ కథ వింటూ పూతరేకు తింటుంటే …నువ్వు నాకేసి విచిత్రంగా చూశావు. నా కంటే ముందుగా పడుకున్నావు. అనుమానం వచ్చింది. అందుకే లేచాను!” అన్నాడు.
నేను ఒక్కసారిగా మోకాళ్ళ పై వంగుతూ.. అభీ ని దగ్గరకు తీసుకున్నాను.
”ఒక్క స్వీట్‌ తింటాను. ఎవ్వరితో చెప్పకు. ఈ రోజు నీకు మరో గొప్ప కథ చెబుతాను. సరేనా” అంటూ లంచం ఇవ్వబోయాను.
”తాతయ్యా! నాకు రోజూ నువ్వు చెప్పే కథలు ఇష్టం. బడిలో స్నేహితులకు కూడా చెబుతాను. నీతో ఆడుకోవడం ఇంకా ఇష్టం. ఇలా నువ్వు తీపి తింటే.. నీకు జబ్బు ఎక్కువవుతుందని బామ్మ చెప్పింది. తినకుండా చూడమని కూడా అంది.
”ఒక్కటి తింటే ఏమీ కాదు” అంటూ వాడిని వారించాను.
”కడవలో పాలు పాడై పోవడానికి ఒక్క ఉప్పు రాయి చాలని” ఒక కథలో నాకు నువ్వే చెప్పావు.
నువ్వంటే నాకిష్టం. నువ్వుంటేనే ఇష్టం” అన్నాడు.
”నువ్వు ఎన్ని చెప్పినా, స్వీట్స్‌ తింటాను” మనవడితో అన్నాను.
”అయితే తాతయ్యా! సృష్టి లో బాగా తీయ నైనది ఏది?” అడిగాడు.
”సమాధానం చెబితే తినవచ్చా?” చిన్న పిల్లాడిని, ‘చిన్న పిల్లాడి’లా అడిగాను.
”ఓ!తప్పకుండా!” అన్నాడు.
”తేనె” అని చెప్పాను.
”మరి తేనె కన్నా తీయనిది?” మళ్ళీ అడిగాడు.
”స్నేహం” ఠక్కున చెప్పాను.
స్నేహం కన్నా తీయనిది పెడతాను. స్వీట్స్‌ తినకుండా ఉంటావా?” మాట ఇమ్మన్నుట్టుగా చేయి చాపుతూ అడిగాడు.
”ఏమై ఉంటుందా? నన్న ఆత్రంలో ”అయితే పెట్టు” అన్నాను.
అంతే.. అమాంతం వాడి చిట్టి పెదాలతో నా చెక్కిలిపై ముద్దు పెట్టాడు. అసలు కన్నా వడ్డీ తీపి. కొడుకు కన్నా మనవడు మరింత తీపి. ఇక వాడిచ్చిన ముద్దు మరింత తీపిగా అనిపించింది.
అప్రయత్నంగా కళ్ళు తడిబారాయి. నరం లేని నాలుక కంటే.. మనవడి ముద్దుతో వచ్చిన చర్మం స్పర్శ నాకు తీపి రుచి తెలిపింది.
అంతే ఆ క్షణంలో.. కృత్రిమంగా ఉండే తీపిని వదిలేసాను. ఆ రోజు నుండీ మనవడి ముద్దులో ఉన్న తీపిని ఆస్వాదించాలని అనుకున్నాను.
”మనవడా! నీ ముద్దు కంటే తీయనిది సృష్టిలోనే లేదు రా. మనది ”తీయని బంధం” అన్నాను నవ్వుతూ.
వాడి చేయి పట్టుకుని బెడ్‌ రూమ్‌ లోకి నడిచాను.

Spread the love