”అరే, రాము గీ ఫోను పనిజేయట్లే ఒకసారి సూడురా” అంది ముసలవ్వ సూరమ్మ.
”పని చేస్తుందే. సిగల్ వుంది, చార్జింగ్ కూడా ఉందే. పనిజేత్తలేదని నీకెట్లా తెలిసిందే?” అడిగాడు రాము సూరమ్మకు ఫోను ఇస్తూ.
”ఆ.. ఏం లేదురా మావోడు లచ్చుగాడు, మూణెల్ల సందీ ఫోన్ జేయట్లేదురా” అంది చీరకొంగుతో వచ్చిన కన్నీటిని ఆపుకుంటూ.
”సూరమ్మత్తా, గాడు పని చేసేది పట్నంల. రోజుకు ఎన్ని పనులు ఉంటాయి. గట్ల దిగులుపడకు. ఈసారి పండగకు వస్తాడు. అప్పుడు అడుగుద్దాం తీయి. అన్నం, కూర గిన వండుకున్నవా అత్తా?” అన్నాడు రాము షాపులో చక్కెర జోకుతూ.
సూరమ్మ నుండి ఎటువంటి సమాధానం లేదు.
”గీ చాయి తాగి, నిమ్మలపడి ఏమయిందో జర చెప్పు” అంటూ చాయి కప్పు అందించాడు రాము.
సూరమ్మ బల్లమీద టీ కప్పును పెట్టి, డబ్బులు తీయబోగా ”అత్తా, నీకాడ నాకు పైసలెందుకే చిన్నప్పటి సందీ ఎన్ని చాయిలు, డబల్ రొట్టెలు లక్ష్మణ్‌నితో పాటు, నాకు ఇచ్చినవో గుర్తిందే? ఏమొద్దు. నీకాడ్నే వుంచుకో అత్తా” అని పర్సులోంచి తీసిన డబ్బులను ఆమె చేతిలో పెట్టి సూరమ్మ చేతులు పట్టుకొని ”ఏమైంది అత్తా? నాకు చెప్పు. నేను, నీ కొడుకులాంటోడినే”
భోరున ఏడ్చింది, కన్నీళ్ళు వచ్చాయి.
గతం గుర్తుకు వచ్చింది రాముకు. సూరమ్మ – శీనయ్యలకు ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మణ్. మొదటి ఐదుగురు సంతానం పుట్టిన కొన్ని రోజులు నెలల తేడాతో ఐదుగురు చనిపోగా, ఏ ఆశా లేకపోయినా, ఆఖరి అవకాశంగా ఎదురు చూడగా లక్ష్మణ్ ఆర్యోగంగా పుట్టాడు. పల్లెటూర్లో పుట్టినా, ఏ కష్టం తెలియకుండా పెంచారు తల్లిదండ్రులు. రాము వాళ్ళు ఎనిమిది మంది సంతానం, వేసుకోవడానికి సరైన బట్టలు, తిండి కూడా కష్టంగా గడిచేది.
రాము, లక్ష్మణ్ లు స్నేహితులు కావడంతో సూరమ్మ… ఉదయం టీ నుండి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకు లక్ష్మణ్‌తో పాటు రాముకు కూడా సమానంగా వండేది. ఇక్కడే ఆడుకుండూ తిని వెళ్ళేవాడు.
”అరే రామూ, మనం టౌన్‌కు పోయి సినిమా చూసొద్దాం, రేపు తొందరగా రారా” అన్నాడు లక్ష్మణ్ సైకిల్ తొక్కుకుంటూ వచ్చి.
”మా నాన్నకు చెప్పకుండా నేను రానురా! చెప్పకుండా బోతే సంపుతడు నన్ను” భయపడుతూ చెప్పాడు రాము.
”బడికి పోతున్నమని నమ్మించి, మార్నింగ్ షోకి పొయ్యి, మళ్ళీ ఎమ్మటే స్కూల్ కాడికి వచ్చి, ఇంటికి పోదాం. ఎవ్వరికి తెల్వదులే. నేను జూసుకుంటా రారా” సైకిల్ ఆపి చేతులు పట్టుకొని బతిమిలాడాడు లక్ష్మణ్ రాముని.
వాస్తవానికి, రాముకి సినిమా టికెట్టుకు పైసలు లేవు. అయినా స్నేహితుడు అన్నీ అందిస్తాననే సరికి ఒప్పుకున్నాడు.
9 గంటలకు బడిగంట మొదలయ్యేసరికి స్కూలు గేటు దగ్గర ఇద్దరూ కలుసుకొని, గోడ బయట నుండి బ్యాగులు లోపలేసి అటూ ఇటూ చూసి, పరిగెత్తడం మొదలు పెట్టారు. ఊరి చివరికి అటువైపు వెళ్తున్న టివిఎస్ కు రెండు వైపులా సంచులు వేళాడేసుకుని వెళ్తున్న వాళ్ళ ఊరి సేటు బండిని ఆపి, ”సేటూ మా నాయిన నన్ను టౌన్లో, వరి విత్తనాలు తెమ్మని పైసలు ఇచ్చి పొలం దున్నేటందుకు పోయిండు. జర తీస్కపోరాదు సేటూ మమ్మల్ని” చేతుల్ని కట్టుకుని వినమ్రం నటించాడు లక్ష్మణ్. తనతో పాటు రాము కూడా.
సినిమా చూసి వచ్చేటపుడు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. ఇంట్లో ఆ విషయం తెల్వడం, ఇద్దరినీ చితకబాదారు.
ఇంతలో ఒకరోజు, శీనయ్య మోటారు ఆన్ చేసివద్దామని, తెల్లవారు జామున పొలానికి వెళ్ళాడు. కరెంటు వైరు, కాలికి తగిలి అక్కడిక్కడే చనిపోయాడు. సంతోషంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. ఊరందరికి తలలో నాలుకలాగా, కలిసిమెలిసి వుండే శీనయ్య లేకపోవడం ఆ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. బంధువులు, ఇరుగు పొరుగు వారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. అప్పుడు లక్ష్మణ్ 5వ తరగతి చదువుతున్నాడు. ”నువ్వు నీకొడుకు చదువు బందు చేసి, నీతోని పనికి తీస్కపో, తిండికెళ్తది అని” అందరూ, ఎత్తిపొడవడం మొదలు పెట్టారు.
లక్ష్మణ్‌ను స్కూల్ మాన్పించకుండా, ఇంకా కొన్ని గంటలు ఎక్కువ పని చేయడం మొదలు పెట్టింది సూరమ్మ. అమ్మకు తోడుగా వెళ్ళేవాడు స్కూలు అయ్యాక లక్ష్మణ్.
”అరే లక్ష్మణా.. ఈ బర్లను కొట్టుక పో కొడుకా, ఇయ్యాల నాకు చేతకాట్లే” పడుకుని మూల్గుతూ జర్వంతో అంది సూరమ్మ.
”గట్లనే… నేను పోయి టానిక్ సీసా తీసుకొస్తా” అని సైకిల్ మీద ఒక్క ఉదుటన తెచ్చాడు. అన్నం, కూర తనకు తోచినట్టుగా వండి ఆ గిన్నెలను మంచం కింద పెట్టి పొలం వెళ్ళినాడు.
”అరే! లక్ష్మణ్ ఇయ్యాల బడికి రాలేందేంది రా”? అన్నాడు.
”అమ్మకి జ్వరం వచ్చి లేవలేదురా. నేనే గదా ఉన్నది. బర్ల కాడికి పోయి గడ్డి గోసుకొస్తున్నారా” అని పచ్చిగడ్డి మోపులు కింద వేశాడు.
ఇంటరు, డిగ్రీ, దగ్గర్లో లేకపోవడంతో టౌన్కు బయలుదేరారు లక్ష్మణ్, అతని స్నేహితులు.
రాము వాళ్ళ తల్లిదండ్రులు అతనిని చదివించలేక పదితోనే ఆపివేయాల్సి వచ్చింది.
వెళ్ళిన కొత్తలో బాగానే ఉత్తరాలు, రాయడం వచ్చి పోవడం జరిగేది. సూరమ్మ టౌన్ నుంచి ఎవరు వచ్చినా కొడుకు గురించి అడిగేది. బియ్యం, కారం, పచ్చడ్లు, తినుబండారాలు చేసి పంపేది. లక్ష్మణ్ చదువు కోసం, వున్న 3 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. వద్దని ఎవ్వరూ వారించినా వినకుండా ఆ డబ్బులు పంపింది. కొన్ని నెలల తర్వాత ఉత్తరాలు రాకపోకలు తగ్గాయి.
లక్ష్మణ్ ఆ డబ్బును, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. చాలా వ్యాపారాలు మొదలు పెట్టి, నష్టాల పాలయ్యాడు. ఆ సమయంలోనే తనకు రాధిక అనే అమ్మాయి పరిచయం అవ్వడం, చెప్పకుండా పెళ్ళి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. రాధిక వాళ్ళ నాన్నకు చాలా బిజినెస్ లు వున్నాయి. ఒక్కతే కూతురు. లక్ష్మణ్‌కు బంగారు బాతు దొరికినట్టయ్యింది.
5 సం||ల తర్వాతగానీ సూరమ్మకు తెలియదు… తన కొడుకు పెళ్ళి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలని. ఆ మాట విని, బిత్తరపోయి కొన్ని రోజుల వరకు కోలుకోలేదు. ఇప్పుడు, కొడుకు ఒక్కసారి కూడా రావడం మానేశాడు.
అరే రామూ, మీకు ఏం తక్కువ జేసినరా? నా ఆకలి నా బట్టలు, నా తిండి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తినా? ఫంక్షన్లు, చుట్టాలు అనుకుంటా ఏడికి తిరిగితిని? లేచిన కానించి, బర్ల పాలు పిండడం, వ్యవసాయం చేయడం, పొద్దుగూకే దాకా బాయికాడి నుండి ఎల్లనైతిని? ఆ బాయిని గూడా దూరం చేసుకుంటిని. లక్ష్మణ్ నుంచి గంటెడు ప్రేమ, గుక్కెడు బువ్వనే నేను గోరుకుంటిని. నేనేం పాపం జేసినా? ఇన్ని బాధలు కష్టాలు ఇచ్చిండా దేవుడు” అని రాముని పట్టుకుని ఏడ్చింది సూరమ్మ.
”ఆడు, నేను ఫోను జేసినా ఎత్తట్లేదు అత్తా. నేను ఇక్కడికి ఆడ్ని రప్పిస్తా, నువ్వు అన్నం వండుకో పో అత్తా అని, చేతులు ఇంటి వైపు చూపిస్తూ పంపాడు రాము.
రాము టెన్త్ క్లాసు బ్యాచ్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక మెసేజ్ పెట్టాడు. వెంటనే ఆదివారం రోజు అందరూ వచ్చారు, లక్ష్మణ్‌తో సహ. దాని సారాంశం ఏమంటే, ‘కేంద్రం ఇటీవల విడుదల చేసిన జి.ఒ గురించి తల్లిదండ్రులను, ఎవరైతే పట్టించుకోక పోవడం, దూషించడం, తిండిపెట్టకపోవడం, శారీరకంగా, మానసికంగా హింసించడం చేస్తే, 6 నెలల జైలు శిక్ష, వారి ఆస్తి జప్తు చేయడం జరుగుతుంది అని.
మీటింగులో రామూ మాట్లాడుతూ ”అత్యవసరంగా ఎందుకు రమ్మన్నామంటే, తల్లిదండ్రుల కన్నా అత్యవసరం ఏమీ లేదు. రేపు మన పిల్లలు కూడా మనకన్నా ఎక్కువ చేస్తారు. మన నుండి వాళ్ళు నేర్చుకోవల్సింది, పెద్దవారికి ప్రేమ పంచడం, వారి ఆలనాపాలన దగ్గర ఉండకపోయినా, కనీసం ఫోనులో మాట్లాడి తెలుసుకోవడం. ఇది కూడా చేయలేకపోతే ఎట్లా? మీరందరూ మీ తల్లిదండ్రులకు వారి ఖర్చుల వరకు జాయింట్ ఎకౌంట్ వేయండి. ఇక్కడ మేము వారికి కావల్సినవి అందిస్తాం. ఇది అందరికీ సమ్మతమైతే తీర్మానం రాయండి. కానీ ఖచ్చితంగా 2 నెలలకు ఒక్కసారి ప్రతి ఒక్కరు వచ్చి వెళ్ళాలి. అనగానే లక్ష్మణ్ తన తప్పుని తెలుసుకుని, భార్యా పిల్లలతో వెళ్ళి సూరమ్మను క్షమించమని అడిగాడు.