‘సినిమాను తక్కువగా అంచనా వేయకండి. సినిమావాళ్ళు ఏదో ఒకనాడు ‘మానవజాతికి శాసనకర్తలవుతార’న్న జాన్ బెర్నార్డ్ షా వాక్యానికి అద్దం పట్టే విధంగా రోనాల్డ్ రీగన్ (అమెరికా), కరుణానిధి, యంజీయార్, జయలలిత (తమిళనాడు), ఎన్టీఆర్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), భగవంత్ మాన్ (పంజాబ్) నిలుస్తారు. షా చెప్పిన పైవాక్యం సినిమావాళ్ళ నుంచి కలిగే సమిష్టి ప్రయోజనానికి సంబంధించినది. ఇదికాకుండా సినిమావాళ్ళతో జరిగే వ్యష్టి ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. దిక్కుతోచకున్నప్పుడు ‘అనుకున్నమని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని..’ (ఆత్రేయ: మురళీకృష్ణ) గీతం బాధ సాంద్రతను తగ్గిస్తుంది. నిరాశలో వున్నప్పుడు ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..’ (సిరివెన్నెల:పట్టుదల) అంటని స్పూర్తివైపు నడిపిస్తారు. పొద్దుపోనప్పుడు ‘ఊరుకోమ్మా నువ్వు దుద్దుద్దూ అంటావు’ (బ్రహ్మానందం:కింగ్) అంటూ నవ్వులలో ముంచి కాలం విలువ పెంచుతారు. ఈ ప్రయోజనాల ద్వారా ఆ పూటకుగానీ, ఆరోజుకు గానీ, జీవితం మొత్తానికిగానీ సానుకూల భావనను పెంచి ప్రయోజనం చేకూరుస్తారు. తెలుగువాళ్ళకు అటువంటి సినిమావాళ్ళలో బ్రహ్మానందం ఒకరు. ఇటీవల తన తెరవెనుక జీవితాన్ని ‘నేను మీ బ్రహ్మానందమ్’గా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు.
1956 ఫిబ్రవరి 01న చాగంటివారిపాళెంలో (సత్తెనపల్లి) కన్నెగంటి నాగలింగం-లక్ష్మీనరసమ్మగారి దంపతులకు ఎనిమిది మందిలో ఆరవ సంతానంగా బ్రహ్మానందం జన్మించారు. రెక్కాడితేగానీ డొక్క నిండని వడ్రంగి (విశ్వబ్రాహ్మణ) వృత్తిమీద ఆధారపడిన కుటుంబం. పిల్లలకోడిలాంటి సంతానం. బ్రహ్మానందానికి బడిలో పంతులుకంటే ముందే ‘పరిస్థితులు’ ‘అన్నప్రయాస’ను చేయించాయి. ‘పేదరికం’ పలకపై బతుకు పాఠాలు దిద్దించింది. ‘నెలకు బడి ఫీజు మూడు రూపాయలు. ఆ ఫీజే నా బడికి దడి కట్టేసేలా నడిపించింది. నా ఆశలు బడి వెంబడి పడి పరుగులు పెడుతుంటే నా ఇంటి స్థితి నన్ను చీకటి వాకిట నిలబెట్టి’న (పుట:46) పరిస్థితుల మధ్య ప్రాథమికవిద్య కొనసాగింది. ఉన్నతవిద్య బరువును సున్నం యోగీశ్వరమ్మ మేడం కొంత తేలిక చేసింది. ‘సాహిత్యం’ ఎంచుకోవడం ద్వారా తన మిమిక్రీలకు, అనంతర సినీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది. అత్తిలిలో తెలుగు బోధకులుగా జీవితం ప్రారంభించేంతవరకు ఆర్థికకష్టాలు పగటిపూట నీడలా రాత్రిపూట చీకటిలా వెన్నంటే ఉన్నాయి. కానీ, బ్రహ్మానందం ”అడుగు, అడిగింది- వెనకడుగు వేస్తావా అని, ఆశ బదులు చెప్పింది- ముందడుగు తప్ప ఇంకే అడుగు వేసినా తప్పటడుగూ” (పుట:51) అంటూ ఏనాడూ వెన్ను చూపలేదు. అనుకోని పరిస్థితుల్లో హైదరాబాదు రావడం, జంధ్యాల, ఇ.వి.వి.గార్ల కంట్లోపడడం, ‘శ్రీ తాతావతారం’లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినీ జీవితం ప్రారంభించడం, ‘అహ నా పెళ్ళంట’తో విశేష గుర్తింపు రావడం… ఇక అక్కడినుంచి అందరికి బ్రహ్మానందం జీవితం ‘చూసిన చిత్రమే’.
మనిషికి ‘జీవితం’ మించిన ఎర ఏదీ ఉండదు. ‘ఆర్థికలేమి’ బంధనాలు సడలించుకొని చదువు అందుకోవడానికి బ్రహ్మానందం చాలా వ్యయాప్రయాసలే పడ్డారు. ఉన్నతవర్గాలు టెన్నిస్ ఆడుతుంటే బంతులు అందించడం, భీమవరంలో డి.యన్.ఆర్ కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు రోజూ 12 కి.మీ. సైకిల్ తోక్కుకొంటూ వెళ్ళి పాలు-పెరుగు తీసుకురావడం, గుంటూరులో పీజీ సెంటర్లో (నేటి నాగార్జున విశ్వవిద్యాలయం) చదువుతున్నప్పుడు లారీలకు పెయింటింగ్స్ వెయ్యడం, అత్తిలిలో లెక్చరర్ గా(ఎస్.వి.ఎస్. కాలేజ్) పనిచేస్తున్నప్పుడు అదనపు అవసరాలకోసం మిమిక్రీ షోలు చెయ్యాల్సి రావడం ఇవన్నీ ‘పెక్కురు పొట్టకూటికే’ కాక ‘తల్లి మదేకపుత్రక.. కానక కన్నా సంతానంబు.. జీవనస్థితికేన తావలంబు’ అంటూ పోరాడాల్సి వచ్చింది.
ఇవేకాక కాలేజ్ జాయిన్ అవ్వడానికి వెళ్లి సర్టిఫికెట్లు మరిచిపోవడం, యార్నాల ట్రంకుపెట్టె నెత్తిమీద పెట్టుకొని హాస్టల్లో ప్రవేశించడం, ఫైవ్ స్టార్ హోటళ్ళలో టీస్పూన్లు, టేబుల్ స్పూన్లు కొట్టేసారని చెకింగ్ వాళ్ళు పట్టుకోవడం వంటి కామిక్ సన్నివేశాలతోపాటు ‘వీడు పుట్టి తల్లిని మింగేసి తోబుట్టువుల ఉసురు పోసుకోనేలా వున్నాడు’ (పుట:24) అంటూ మంత్రసానులు వాపోవడం, కుటుంబ నిట్టూర్పులు చూశాక కొత్త నిక్కరు కొనిపెట్టరన్న నిజం అర్థమయ్యింది. సూదీదారంతో నిక్కరు కుట్టుకోవడం మొదలుపెట్టడం (పుట:30), ఆకలేస్తుందంటే ‘ఆహారం లేకపోతే మనిషి పద్దెనిమిదిరోజులు బతకగలడు, ఓపిక పట్టు’ అంటూ తండ్రి చెప్పడం, తల్లి ఆరోగ్యం కోసం కొత్తగా పెళ్ళైన భార్య లక్ష్మీ నగలను తాకట్టు పెట్టాల్సి రావడం, సీమంతం కోసం అన్ని సిద్ధం చేసివున్న రోజునే భార్యకు అబార్షన్ కావడంలాంటి సంఘటనలతో నవ్వుతున్న పాఠకుడి ముఖంలోకి దు:ఖం ‘మెరుపు తీగ’లా సర్రుమని వచ్చిపోతుంది.
‘ఆ వాక్కు విని అవాక్కయ్యాను’, ‘అవసరం అనవసరమైన ఆశలు పెంచుతుంది’ వంటి ప్రాసలతోపాటు ‘స్థాయి అనేది కోరుకొంటే రాదు. నేర్చుకొంటే వస్తుంది’, ‘పేదరికమే పెద్దరికం నేర్పుతుంది’, మాటలు నేర్చుకోవడానికి రెండు సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో నేర్చుకోవడానికి జీవితం సరిపోతుంది’, ‘అవసరం నన్నెప్పుడూ దిగజార్చలేదు. అవకాశం నన్నెప్పుడూ గర్వించేలా చేయలేదు’ వంటి జీవితపాఠాలు నేర్పే సూక్తులున్నాయి. ఎదుగుదలలో బాసటగా నిలిచిన అక్కకు, గురువులు సున్నం ఆంజనేయులు, ఎస్.వి. జోగారావులు, శిష్యుడు నాగశేషు వంటివారిపట్ల నిరంతరం కృతజ్ఞతపూర్వకంగా ఉండడం బ్రహ్మానందం వినయానికి తార్కాణం.
‘యోగివేమన’ చిత్రంలో చిత్తూరు నాగయ్య నటనను చూసి ఒకరు బాలయోగిగా మారిపోయిట్టు, శ్రీశ్రీ గీతం విని(కలకానిది విలువైనది:వెలుగునీడలు) ఒక యువకుడు ఆత్మహత్య ప్రయత్నం విరమింపజేసుకొన్నట్టు ఈ ఆత్మకథ చదివితే ఆ గరిమస్థాయి ప్రయోజనాలు కలగకపోవచ్చు. కానీ, చార్లీచాప్లీన్ లాగే తెలుగువారికి హాస్యాన్ని పంచే బ్రహ్మానందం జీవితంలో కూడా చార్లీచాప్లీన్ జీవితంలో ఉన్నన్ని సాధకబాధలు వున్నాయని అర్థమవుతుంది. 65 ఏళ్ళ జీవితసారాన్ని ఒక పుస్తకంలోకి కుప్పపోస్తే ‘నో కాపిస్’-‘రీప్రింట్స్’ అని ‘అన్వీక్షికి’ ప్రచురణలవాళ్ళు (వెంకట్ సిద్ధారెడ్డి, మహి బెజవాడ) చెబుతుంటే బ్రహ్మానందంతోపాటు పుస్తకప్రియులకు కూడా ‘హౌస్ ఫుల్’ ఫీలింగ్ కలుగుతుంది. ఒక మ్యాట్నీ ధరని (275), ఒక మ్యాట్నీ టైంని కేటాయిస్తే మనకు నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై గులాబీ నవ్వులు పూయించిన వనమాలికైన గాయాల్ని, కంటి బాష్పాల్ని అక్షరాల తెరపై దర్శించవచ్చు.
బ్రహ్మానందం పాఠశాల దశనుండే మిమిక్రీ స్కిట్లు వేసి అందరిని నవ్వించేవాడినని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఒకటి, రెండు స్కిట్లు పేర్కొని వుండుంటే బాగుండేది. అప్పటి బ్రహ్మానందం హాస్యచెణుకులు తెలిసివుండేవి. ఇంకా ఎక్కడో కొన్ని సంఘటనల్ని మనసు విప్పి పంచుకోలేదేమో అన్న భావన కూడా కొంత కలుగుతుంది. రచయిత రాసినదాన్ని వరకే చర్చించడానికి ఇది ‘సజన’ కాదు. జీవితకథ. అతనిపై ప్రీతి కలిగిన పాఠకుల అంచనాకు అక్కడక్కడ అందుతూ జారుతూ, ఉందన్న భావన కలుగుతుంది. బ్రహ్మానందం సినిమాల్లోకి వచ్చిన తర్వాతదంతా తెరిచిన పుస్తకమేగా అన్నది కారణం కావచ్చు.
‘ఇందులో నేను నా గొప్పతనాన్ని రాసుకోలేదు. బ్రహ్మానందం ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడ్డాడు అనేది మాత్రమే రాయగలిగానంటున్న’ ఈ ‘నేను మీ బ్రహ్మానందమ్’ అన్న పుస్తకం తన జీవితంలో పూర్వార్థానికి సంబంధించినది మాత్రమే. ఇంకో పదేళ్ళ తర్వాతనైనా పాఠకులకు ఉత్తరార్థపు జీవితానికి సంబంధించిన ‘కితాబ్ భాకీహై బ్రహ్మానందం’ తెలుసుకోగలుగుతామేమో!
– బుగడూరు మ.మో.రె,
998989 4308