ఆపదొస్తే ఆత్మీయులతో మాట్లాడాలనిపిస్తుంది. కష్టమొస్తే కన్నీటిని తుడిచే స్నేహితుల చెంత సేదతీర వచ్చు. మరి, మనసుకు బాధ గలిగితే? మనతోనే మనం కాసేపు నిశ్శబ్దంగా ప్రయాణించాలనిపిస్తుంది. అప్పుడు మనసుకు స్వాంతన ఇచ్చే చిరకాల నేస్తం ‘పుస్తకం’. బుక్ షెల్ప్ నుంచి మనకు ఇష్టమైన పుస్తకాన్ని తీసుకుని చదువుతుంటే… మనల్ని మనమే మరిచిపోతాం. కొత్త లోకానికి వెళ్లిపోతాం! అప్పటి వరకు చుట్టుముట్టిన మనోవ్యాకులత మాయమైపోతుంది. మనసు తేలికవుతుంది. అదే పుస్తకం గొప్పతనం. అదే మనసుకు దివ్యౌషధం. అంతటి విలువైన పుస్తకాల పండగ మళ్లీ వచ్చింది. ఎన్నెన్నో కొత్త కొత్త పుస్తకాలతో మన ముందుకు తరలివచ్చింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం(తెలంగాణ కళాభారతి) ప్రాంగణంలో ఈ నెల 9న మొదలైన 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం 19 వరకు కొనసాగుతుంది. ఒకవైపు నాగోబా జాతర, మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, నడుమ హైదరాబాద్ మహా నగరంలో పుస్తకాల కుంభమేళ.
ఈ బుక్ ఫెయిర్ కు గొప్ప చరిత్ర ఉంది. సాహిత్య, సాంస్కృతిక వారసత్వం ఉంది. ప్రతి తరంలోనూ కొత్త పాఠకులను తయారుచేయడం, సాహిత్యాభిలాషను పెంచడం, విలువల సమాజానికి తోడ్పడటం, పౌరుల వ్యక్తిత్వ నిర్మాణానికి, మనో వికాసానికి కృషిచేయడం వంటి ఎన్నో మంచి పనులను చేస్తున్నారు ప్రచురణకర్తలు, సాహితీవేత్తలు, నిర్వాహకులు.
1985లో కేవలం ఇరవై పుస్తక ప్రచురణ సంస్థలతో హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ నేడు జాతీయ పుస్తక మహోత్సవంగా విరాజిల్లుతోంది. బాల సాహిత్యం నుంచి భక్తి సాహిత్యం వరకు, అభ్యుదయ సాహిత్యం నుంచి పోటీ పరీక్షల పుస్తకాల వరకు అన్ని రకాల పుస్తకాలు ఒక చోట చేరి పుస్తక ప్రియులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
అందరూ సమానమే
పండితుడైనా, పామరుడైనా, సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా పుస్తకం ముందు అందరూ సమానమే అని చాటి చెబుతోంది బుక్ ఫెయిర్. ఇందులో జరిగే సాహిత్య చర్చలు, సభలు, ప్రచార కార్యక్రమాలు పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాసను మరింత పెంచుతుంది.
కలబోత
బుక్ ఫెయిర్ అంటే కేవలం పుస్తకాల అమ్మకాలే కాదు. పుస్తకాలతోపాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కలబోత. ఒక వైపు పుస్తకాల అమ్మకాల జోరు, మరోవైపు కొత్త పుస్తకాల ఆవిష్కరణలు, సాహిత్య చర్చలు, విమర్శన కోణాలు, పిల్లల కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, నాటకాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీలు వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి.
తరలి వస్తున్న యువత
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఎక్కువగా కనిపించేది యువతే. యువతలో సాహిత్య అభిలాష బాగా పెరగడమే అందుకు కారణం. యువతరం రాసే సాహిత్యంతోనే కొన్ని స్టాల్స్ నడుస్తున్నాయాంటే అతిశయోక్తి కాదు. పైగా బుక్ ఫెయిర్‌కు వస్తే ఆ పుస్తకాల రచయితలతో స్వయంగా కలిసే అవకాశాలుండటం కూడా ఇందుకు కారణం కావచ్చు. అంతేకాదు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు ఎక్కువగా ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం చుట్టుపక్కలే ఉండటం, వారి కోసం సైతం కొన్ని ప్రత్యేక స్టాల్స్ ఉండటం మరో కారణం.
నయా ట్రెండ్
గతంలో లాగా ప్రచురణకర్తలు పుస్తకాల ముద్రణకే పరిమితం కావడంలేదు. మార్కెటింగ్ వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. రచయితలను తమ స్టాల్స్ వద్దే కట్టిపడేసే కొత్త తరహా పుస్తకాలను అందమైన కవర్ పేజీలతో ముద్రిస్తున్నారు. డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నవతరాన్ని ఆకట్టుకునేలా ఆసక్తి కలిగించే పోస్టర్లతో ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టా, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు.
పుస్తక రూపమే శాశ్వతం
విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిలో కుదించాలన్నా, పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృష్టించాలన్నా అది అక్షరానికే సాధ్యం. సాహిత్యానికి ఎల్లలు లేవు. భక్తి నుంచి విప్లవం వరకు అన్నీ ఆ సముద్రంలోని అలలే. శరీరానికి నీరు, ఆహారం ఎంత అవసరమో, మెదడుకు పుస్తకం అంతే అవసరం. ప్రతి మనిషి తమ అభిరుచికి తగిన పుస్తకాలతో జ్ఞానం పొంతున్నారు. సాహిత్యం డిజిటల్ రూపంలోనూ, ఆడియో రూపంలోనూ దొరుకుతున్నా పుస్తక రూపమే శాశ్వతం. ఏటికేడు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు పెరుగుతున్న ఆదరణ అదే నిరూపిస్తోంది.
నుమాయిష్‌కు తీసిపోదు
హైదరాబాద్ మహానగరంలో జనవరి ఒకటిన ప్రారంభమై, మరో నాలుగు రోజుల్లో ముగియనుంది నుమాయిష్. నిన్న కాక మొన్న ప్రారంభమైంది హైదరాబాద్ బుక్‌ఫెయిర్ (జాతీయ పుస్తక మహోత్సవం). నాంపల్లిలోని పారిశ్రామిక, వస్తు ప్రదర్శన ఒక వైపు, తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతున్న పుస్తకాల ప్రదర్శన మరోవైపు. రెండు ప్రదర్శనల్లో దేని గొప్పదనం దానిదే. మూడు వందలపై స్టాళ్లతో రోజుకు సుమారు ఎనభైవేల మంది సందర్శించిన పుస్తకాల ప్రదర్శన గణాంకాల నిష్పత్తి రీత్యా నుమాయిష్‌కు ఏమి తీసిపోదు.
గద్దర్ పేరుతో ప్రాంగణం
పుస్తక ప్రదర్శన జరుగుతున్న తెలంగాణ కళాభవన్ కు ప్రజా యుద్ధనౌక, తెలంగాణ లెజెండ్, ప్రజల మనిషి గద్దర్ పేరు పెట్టారు. అదే విధంగా కార్యక్రమాలు జరిగే వేదికకు ఆచార్య రవ్వా శ్రీహరి పేరు పెట్టారు.
గ్రంథాలయోద్యమం మరలా రావాలి
ప్రభుత్వాలు గ్రంథాలయాలకు తగిన నిధులు మంజూరు చేయకపోవడంతో చదివే ఆసక్తి ఉన్నవారికి కూడా పుస్తకాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా తెలుగువారి పుస్తక పఠనం వెనుకబాటులో సర్కారు హస్తం కూడా ఉందనక తప్పదు. గ్రంథాలయాలు కళకళలాడితే చదివేవారి సంఖ్య పెరిగి పుస్తక అమ్మకాలపై కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మరోసారి గ్రంథాలయోద్యమం రావాలి. కేరళ, తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు ఏటా ప్రచురణకర్తలు, రచయితల నుంచి దాదాపు 4,5 వందల పుస్తకాలు కొంటాయి. తమిళనాట అయితే ఉత్తమ రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేసేందుకు ప్రభుత్వమే రచయితకు ఆర్థిక సహాయం చేస్తుంది. అలాంటి తోడ్పాటు తెలుగు రాష్ట్రాల్లో రావాలి.
సోషల్ మీడియా ప్రచారం
పుస్తక ప్రదర్శన పండుగలా సాగడానికి, దీని పట్ల ప్రజానీకానికి ఆసక్తి పెరగడానికి బుక్ ఫెయిర్ నిర్వాహకులు ప్రదర్శనకు ముందు నుండే ప్రముఖ రచయితల మాటలతో వీడియో క్లిప్‌లను ప్రచారంలో ఉంచారు. వీరంతా పుస్తక పఠన ప్రాముఖ్యతను పేర్కొంటూ ఈ జాతీయ పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.
జ్ఞాన తెలంగాణ నిర్మాణం
ప్రతిఏటా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు పదిలక్షల మంది సందర్శకులు వస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే స్పందన లభిస్తోందని ఆశిస్తున్నాం. సాహిత్యాభిలాష పెంపొందించేలా సాహిత్య కార్యక్రమాల రూపకల్పన చేశాం. పిల్లల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా జ్ఞాన తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్న కృషే.
– జూలూరు గౌరీశంకర్, అధ్యక్షులు, హైదరాబాద్ బుక్ ఫెయిర్‌నిన్నటి చరిత్ర,
రేపటి భవితల దర్పణం
పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. గొప్ప వ్యక్తిత్వ వికాసానికి సారధులు. గతమెంత ఘనకీర్తియో, వర్తమానపు చేవ ఏమాత్రమో అద్దంలో చూపగలిగే శక్తి ఒక్క పుస్తకాలదే. ప్రాపంచిక జ్ఞానం పెంపొంచుకోవాలనే జిజ్ఞాస ఉండాలేకానీ కూర్చున్నచోటే ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. చుట్టూ ఉన్న సమాజాన్ని, అందులోని మనుషులను అర్ధం చేసుకోవాలంటే పుస్తకం మన చెంత ఉండాలి. వివిధ రంగాలలో విజయం సాధించిన ప్రముఖులు కచ్చితంగా పుస్తకం గురించి మాట్లాడతారు. ఫలానా పుస్తకం తమకు స్ఫూర్తినిచ్చిందని చెబుతుంటారు. కొందరి ఆత్మకథలు చదువుతుంటే అవి మనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లనిపిస్తాయి. ఉత్సాహాన్నిస్తాయి. జీవనోత్సాహాన్ని పెంపొందిస్తాయి.
జీవన గమనంలో అటువంటి ప్రముఖ పాత్ర పోషించే పుస్తకాల ప్రదర్శన – ఉత్సవం ఆనవాయితీగా మన హైదరాబాద్ లో జరుగుతుండటం సాహిత్యాభిలాష కలిగిన వారందరికీ గర్వకారణం. ఎన్నో రకాల పుస్తకాలు ఒకేచోట లభించే అవకాశం ఉంటుంది. తెలియని రచయితల గురించి తెలుసుకోగలము. నిర్వాహకులు పలురకాల సాహిత్య, సాంస్కతిక కార్యక్రమాలను ఆసక్తికరంగా రూపొందించి కొత్త పాఠకులను తయారు చేసుకుంటుండడం అభిలషణీయం. సందర్శకులు తమ అభిమాన రచయితలను కలుసుకునే వారధి. అక్కడ వివిధ ప్రాంగణాలలో జరిగే సాహితీవేత్తల చర్చా కార్యక్రమాలు సరికొత్త ఆలోచనలు రేకెత్తించగల పునాదులు కాగలవు. కుల మత ప్రాంతాలకు అతీతంగా, సమస్త విజ్ఞానాన్ని తన పర భేదం లేకుండా అందించగలిగేది అచ్చంగా ఈ పుస్తకాల పండుగే. నాంపల్లిలో ఏటా జనవరి నుంచి ఫిబ్రవరి 15వరకు అనే ఐకానిక్ ఫెమిలారిటీ ఎలా వచ్చిందో నేషనల్ బుక్ ఫెయిర్ అంటే హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేలా ఎప్పటికీ నిలిచిపోయే గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఇలాగే నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. – నస్రీన్ ఖాన్
పుస్తకానికి ఆదరణ తగ్గలేదు
పుస్తకానికి ఆదరణ తగ్గలేదని మరోసారి ఈ బుక్ ఫెయిర్ రుజువు చేస్తుంది. వాస్తవానికి వివిధ కారణాలతో రెండు నెలలు ఆలస్యంగా పుస్తక ప్రదర్శన జరుగుతున్నా ఆదరణ బాగుంది. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, జీవితాన్ని, సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి పుస్తక పఠనమే సులువైన మార్గం.
– ఆర్.శ్రీనివాస్ (వాసు),కార్యదర్శి, హైదరాబాద్ బుక్ ఫెయిర్
పుస్తకం జ్ఞాననేత్రం
పుస్తకం వేల చేతుల్లో పుష్పించే కర్మాగారం. మేధావుల మస్తిస్కాలన్నీ ఆలోచనా పుటలుగా ఒంపే జ్ఞాననేత్రం. ఒక తరం నుండి మరో తరానికి అనుభవాల్ని అందించి మానవాళిని కాపాడుతున్న భాండాగారం. అలాంటిది ప్రతి ఏడాది ఒక ఉత్సవంగా లక్షల పుస్తకాలతో బుక్‌ఫెయిర్ మన దగ్గరికి రావటం, మనల్ని మరింత జ్ఞానవంతులను చెయ్యటం గొప్ప విషయం. ఎందరో గొప్పవారు రాసిన పుస్తకాలతో సమకాలీన సాహిత్య సమాజంలో వస్తున్న పరిణామాలు కూడా తెలిసుకోవచ్చు. మా అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ కూడా ప్రతి ఏడాది స్టాల్ పెడుతున్నాం. ఈ పండుగలో మహిళా సాహిత్య మూర్తులందరం చక్కగా పాల్గొని మళ్లీ ఏడాది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. – అయినంపూడి శ్రీలక్ష్మి
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417