పోరాటానికి నిజమైన నిర్వచనం నల్లెల రాజన్న

పోరాటానికి నిజమైన నిర్వచనం నల్లెల రాజన్నఆరోజు నేను ప్రయాణంలో ఉన్నాను. మొబైల్లో వాట్సప్‌ ఓపెన్‌ చెస్తే పిడుగులాంటి వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజన్న ఇక లేరని. ఆ వార్తను జీర్ణించుకోలేక పోయాను. వాస్తవంగా రాజన్నది చనిపోయే వయసుకాదు. ఆయనతో నా అనుబంధం అంత తొందరగా ముగిసిపోతుందని ఊహించలేనిది. ఈ మధ్యకాలంలో దామెర రాజేందర్‌ రాసిన మరణ సందేశం పుస్తకావిష్కరణ సభలో ఇద్దరం కలుసుకున్నాం. ఆరోజు రాజన్న చాలా యాక్టివ్‌గా, హుషారుగా కనిపించారు. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం. ఏదేమైనా రాజన్న మరణం సాహితీకారులకి, అభ్యుదయ సమాజానికి తీరని లోటనే చెప్పాలి. రాజన్న గురించి చెప్పాల్సివస్తే నేను ఇష్టపడే సాహితీకారుల్లో రాజనొక్కరు. అంతేకాదు ఆయనతో కలిసి కొన్ని సాహితీ కార్యక్రమాలలో పాల్గొన్న అనుభవం ఉంది. ఒకటిరెండు కవి సమ్మేళనాలు కలిసి నిర్వహించాం.
2022లో ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతాంగానికి సంఘీభావంగా నేను పరకాలలో కవి సమ్మేళనం నిర్వహించాను. ఈ కవి సమ్మేళనం విజయవంతం కావడానికి రాజన్న అనేక సలహాలు, సూచనలు చేసారు. అప్పుడే రాజన్నకు నాకు దగ్గర సంబంధం ఏర్పడింది. అలా పరిచయమైన రాజన్న ఎంతో ఆదర్శవాది. తాను ఏంచేసినా అది సంచలనమే. ఉపాద్యాయుడిగా పదవీ విరమణ పొందిన రాజన్న నిత్యం ఏదో కార్యక్రమంతో పత్రికలు, సోషల్‌ మీడియా ద్వార ప్రజాగొంతుకై నిలిచేటోడు. అన్యాయమనిపించిన ఏ సమస్యపైనైనా తనదైన శైలిలో నిరసన తెలిపేవారు. హనుమకొండలోని తన నిసానికి సమీపంలో ఉన్న పద్మాక్షమ్మ గుడి సమస్య కావొచ్చు, నగరంలో ఏర్పడే పారిశుద్యం, కుక్కల బెడదవంటి చిన్నచిన్న సమస్యలు మొదలుకొని నల్లమల యురేనియం తవ్వకాలతో ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఖాజిపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పోరాటం, రామప్ప ఆలయ పరిరక్షణ, కాళోజీ కళాక్షేత్ర నిర్మాణంలో జాప్యం ఇలా అనేక పోరాటాలలో రాజన్న క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఏదైనా సమస్యమీద స్పందించాల్సి వస్తే వెంట ఎవరూ లేకపోయినా ఓ బ్యానరో, ప్లకార్డో పట్టుకొని ఒంటరిగానే నినాదాలిస్తూ, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసేవారు. అవకాశం ఉంటే జిల్లా కలెక్టరేట్‌కు వెళ్ళి ఓ మెమోరాండం అందజేసేవారు. అంతేకాకుండా ప్రకతి ప్రేమికుడిగా తన ఇంటినే ఓ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. ప్రకతి పరిరక్షణ కోసం నిరంతరం తపించేవారు. ఈ క్రమంలో పెద్దర్వాజ పేరుతో ఓ కవితా సంపుటి ప్రచురించడమే కాకుండా సహజ వనరుల దోపిడీ, విచ్చలవిడిగా ప్రకతి సంపదను ధ్వంసం చేస్తున్న మైనింగ్‌ మాఫియాపై చర్యలు చేపట్టాలంటూ అనేక పోరాటాలు నిర్వహించారు. ప్రకతి పరిరక్షణ కోసం కవితలు, వ్యాసాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేసేవారు. ఆందోళనకారుడిగా, ప్రకతి పరిరక్షకుడుగా, వికలాంగుల హక్కుల కోసం, భారత్‌ బచావో, స్వేచ్ఛ జాక్‌ ఉద్యమాలలో భాగస్వామ్యం అవుతూనే సాహిత్య రంగంలో సైతం తనదైన ముద్ర వేశారు రాజన్న.
అనేకమంది సాహితీకారులు తమ సొంత ప్రచురణలకి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాజన్న మాత్రం సంకలనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ సంకలనాల ద్వారా సమాజంలో అప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై కవి సమ్మేళనాలు నిర్వహించి తద్వారా వచ్చిన కవితలతో ఈ సంకలనాలు వెలువరించేవారు. దీంతో సమాజంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలపై గళంవిప్పేలా చేస్తూనే ఎంతోమంది యువ రచయితలకి, కొత్త వాళ్లకి అవకాశం కల్పించేవారు. అలా వచ్చిన రచనలన్నీ వరంగల్‌ రచయితల సంఘం ఆధ్వర్యంలో సంకలనాలుగా వెలువరించేవారు. అందులో బిల్కీస్‌ భానో, మేఘావల్‌ చంద్రకుమార్‌, కరోనా సమయంలో అమెరికాలో ప్రాయిడ్‌ అనే నల్లజాతీయుడిపై అక్కడి పోలీసు గొంతుపై కాలితో నొక్కి చంపిన ఇష్యూపై ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ అనే కవితా సంకలనం… ఇలా అనేక సందర్భాలను అనుసరించి కవి సమ్మేళనాలు, కవితా సంకలనాలు ప్రచురిస్తూ ఉండేవారు. ఆయనది నిరంతర తపన. సమాజాన్ని అభ్యుదయ దిశగా నడిపించాలని, పౌర సమాజం మొత్తంగా కూడా చైతన్యవంతం కావాలని నిరంతరం తపించే రాజన్న పోరాటానికే మరో నిర్వచనం. అభ్యుదయ సమాజ నిర్మాణం కోసం పోరాట రూపాల్ని ఎంచుకునే క్రమంలో ఆయన జీవితం మరో నిర్వచనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. రాజన్న జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ప్రతి ఒక్కరూ రాజన్న అడుగుజాడల్లో నడిచి అభ్యుదయ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావలసిన అవసరం ఉందనేది నిర్వివాదాంశం. తద్వారానే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లమవుతాం.
(ఈ నెల 25వతేదిన రాజన్న సంతాప సభ సందర్భంగా నివాళులతో)
– కోగిల చంద్రమౌళి
9573187218

Spread the love