ఫోబియాలతో జీవిస్తున్నారా?

ఫోబియాలతో జీవిస్తున్నారా?చాలామందికి సాలెపురుగులు, బొద్దింక, బల్లి, ఎత్తైన ప్రదేశాలు, దంతవైద్యుల భయం, బహిరంగ ప్రదేశాల భయం, ఇతర వ్యక్తులతో సంభాషించాలనే భయం (సామాజిక భయం), భయం ఫోబియా (ఫోబోఫోబియా)… ఇలాంటి భయాలన్నీ నిజానికి అసలు ప్రమాదం లేనివే. క్లోజ్‌డ్‌ ఏరియాస్‌, హైవే డ్రైవింగ్‌, ఎగిరే కీటకాలు, పాములు, సూదులు మొదలైనన్నీ సాధారణ భయాలే.
జీవితంలోకి ఫోబియా వచ్చిందంటే ఏ పనీ చేయలేం. చివరికి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌నూ ఉపయోగించుకోలేం. ఎవరితో మాట్లాడలేం. ఎవరూ ఫోబియాతో బాధపడుతూ జీవించాల్సిన అవసరం లేదు. అన్ని ఫోబియాలకు చికిత్స ఉంది. ఫోబియాలు అహేతుక భయాలు. చేయాలనుకుంటున్న పనులను ఈ ఫోబియా అడ్డుకుంటుంది. సమస్యను గుర్తించడం, చికిత్స చేయడం అధిగమించడానికి చిరు ప్రయత్నం…
చాలా ఫోబియాలు బాల్యంలోనే ఏర్పడతాయి. మనం ఎదుగుతున్న కొద్దీ అవి పెరుగుతుంటాయి. అహేతుకమని తెలిసినప్పటికీ ఆ భావన నుండి బయటపడలేరు. మీ భయాలను అధిగమించడానికి సహాయపడే మార్గాలు…
1. సమయాన్ని వెచ్చించండి : భయం, ఆందోళనతో వున్నప్పుడు స్పష్టంగా ఆలోచించడం అసాధ్యం. ఆ సమయంలో శారీరకంగా ప్రశాంతంగా ఉండటానికి సమయాన్ని కేటాయించాలి. బ్లాక్‌ చుట్టూ నడవడం, టీ చేయడం, స్నానం చేయడం వంటి పనులతో 15 నిమిషాల పాటు ఆందోళన నుండి మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు.
2. పానిక్‌ ద్వారా శ్వాస తీసుకోండి : హృదయ స్పందన పెరగడం, అరచేతులకు చెమట పట్టడం వంటి సమయాల్లో రిలాక్సింగ్‌గా, కదలకుండా కూర్చొని, అరచేతిని కడుపుపై ఉంచుకుని, నెమ్మదిగా ఎక్కువ శ్వాస తీసుకోండి.
3. భయాలను ఎదుర్కోండి : భయం ఏదైనప్పటికీ, దాన్ని ఎదుర్కొంటే, అది క్రమంగా క్షీణిస్తుంది. ఉదాహరణకు, లిఫ్ట్‌లోకి వెళ్లడానికి భయపడితే, మళ్లీ మళ్లీ లిఫ్ట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించాలి.
4. చెత్తగా ఊహించుకోండి : జరిగే చెడు విషయాన్ని ఊహించుకోవాలి. బహుశా అది ఇంకా భయాందోళనలను కలిగిస్తుంది. అప్పుడు మీకు గుండెపోటు వచ్చినట్లు ఆలోచించండి. ఇది సాధ్యం కాదు. ఇలా భయం మీ దరి చేరదు.
5. సాక్ష్యం చూడండి : మీరు లిఫ్ట్‌లో చిక్కుకుని ఊపిరాడకుండా భయపడితే, ఎవరికైనా ఇలా జరిగిందని ఎప్పుడైనా విన్నారా అని మీకు మీరే ప్రశ్నించుకోండి.
6. పరిపూర్ణతకి ప్రయత్నించవద్దు : ఎంతో ఒత్తిళ్లతో కూడిన జీవితంలో అన్నీ పరిపూర్ణంగా వుండాలని అనుకోవద్దు. ఎవరికైనా సరే జీవితం కొంత గందరగోళంగానే ఉంటుంది.
7. సంతోషకర విషయాల్ని దృశ్యమానం చేయండి : కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఊహించుకోవాలి. అందమైన బీచ్‌లో నడుస్తున్నట్లో, ఏదైనా సంతోషకరమైన జ్ఞాపకమో… రిలాక్స్‌గా ఉండడానికి సానుకూల భావాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
8. పంచుకోండి : భయాలను పంచుకుంటే అవి దూరమవుతాయి. భాగస్వామి, స్నేహితుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతే, టెలిఫోన్‌ ద్వారా కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ విధానాన్ని కూడ ప్రయత్నించండి.
9. తిరిగి బేసిక్స్‌కి వెళ్లండి : చాలా మంది ఆందోళనకు స్వీయ-చికిత్స కోసం ఆల్కహాల్‌/ డ్రగ్స్‌ వైపు మొగ్గు చూపుతారు. ఇది పరిస్థితులను మరింత దిగజార్చుతుంది. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన భోజనం, నడక వంటి రోజువారీ విషయాలు ఆందోళనకు ఉత్తమ నివారణలు.
10. మీరే రివార్డ్‌ చేసుకోండి : మీకు మీరే ఒక ట్రీట్‌ ఇచ్చుకోండి. ఉదా: మసాజ్‌, కంట్రీ వాక్‌, భోజనం, పుస్తకం, ఏదైనా చిన్న బహుమతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.
ఫోబియాని అర్థం చేసుకోవడమే దాన్ని అధిగమించడానికి మొదటి మెట్టు. ఫోబియాలు సర్వసాధారణమని తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం నియంత్రణలో లేనట్లు అనిపించినా, మీ ఆందోళన, భయాన్ని అధిగమించి, మీకు కావలసిన జీవితాన్ని గడపవచ్చు.
భయం ఆటోమేటిక్‌ ఫైట్‌-ఆర్‌-ఫ్లైట్‌ ప్రతిస్పందనను సక్రియం చేస్తుంది. మనసు, శరీరం అప్రమత్తంగా ఉంటే మనం త్వరగా స్పందించి, మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఫోబియాలతో ముప్పు ఉండదు.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love