కొంత అసంతృప్తి.. అలకలు వాస్తవమే..

Some dissatisfaction.. ripples are real..– అయినా గులాబీ ప్రభంజనం ఖాయం..!
–  జనంలో పాజిటివ్‌ వైబ్రేషన్‌ : బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ – సిరిసిల్ల/కామారెడ్డి
”నీళ్లు.. కరెంట్‌.. కొలువుల కోసం పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాం. సాధించింది చాలా వుంది.. సాధించాల్సిది ఇంకా వుంది అంతా.. పొరపాట్లు జరగలేదని అనట్లేదు. మేమూ మనుషులమే.. కొంత అసంతృప్తి.. కొన్ని అలకలు వున్న మాట వాస్తవమే సరిదిద్దుకుంటాం. ఈసారి అన్నీ పూర్తి చేసుకుంటాం.. మూడోసారి గులాబీ ప్రభంజనం ఖాయం.. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం పక్కా..!” అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
సిరిసిల్ల, కామారెడ్డిలో కేటీఆర్‌ మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ”వందల సభలు.. రోడ్‌ షోలు.. హాల్‌ మీటింగ్స్‌లో కోట్ల మందిని నేరుగా కలుసుకున్నాం.. వాళ్ల మనసు తెలుసుకున్నాం.. ఆదిలాబాద్‌ నుంచి ఆలంపూర్‌ దాకా, బాసర నుంచి భద్రాచలం దాకా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు.
జనంలో ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌ కనిపించింది” అన్నారు. కొత్త రికార్డులు నెలకొల్పడం.. చరిత్ర సృష్టించడం కేసీఆర్‌కు కొత్తకాదు..! ప్రజల ఆశీర్వాదం.. అభిమానంతో సౌత్‌ ఇండియాలో మూడోసారి సీఎంగా అరుదైన ఘనత సాధించబోతున్నారన్నారు. ఈ రెండ్రోజులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఫేక్‌ న్యూస్‌లను..ఫేక్‌ ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో టీఆర్‌ఎస్‌ పాత్ర, కేసీఆర్‌ కృషి, నాటి పరిస్థితులను, నేడు సాధించిన ప్రగతిని గుర్తించి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
కాంగ్రెస్‌ కొత్త పార్టీ కాదు మనం.. చెత్త బుట్టలో విసిరేసిన పార్టీ..! తెలంగాణను 50 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని విమర్శించారు. తెలంగాణను వున్న ఏకైక గొంతుక కేసీఆర్‌.. ఆ గొంతును నొక్కేయాలని చూస్తున్నారు.. కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని కేటీఆర్‌ అన్నారు. ఓటు వేసేముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలని కోరారు. మా బలం..మా బలగం తెలంగాణ ప్రజలేనన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, నాస్కాబ్‌ చైర్మెన్‌ కొండూరి రవీందర్‌రావు, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గూడూరి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ దోచుకోవడానికేముంది..
కామారెడ్డి భూముల్లో దోచుకోవడానికి ఏమైనా లంకె బిందెలు ఉన్నాయా.. ప్రతిపక్షాలు ప్రతిసారీ కేసీఆర్‌ భూములు దోచుకోవడానికి కామారెడ్డికి వస్తున్నారని చెప్తున్నాయి.. దోచుకోవాల్సిన అవసరం ఏముందని కామారెడ్డి రోడ్‌షోలో కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రజలు కేసీఆర్‌కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ కామారెడ్డి వస్తే పరిశ్రమలు.. విద్యాసంస్థలు వస్తా యన్నారు. ఇక్కడి భూములకు ధరలు పెరుగుతా యని, రైతులకు మేలు జరుగుతుంద న్నారు. అభివృద్ధి చేసేవారిని గుర్తించి ఓటువేయా లని కోరారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంప గోవర్ధన్‌, నాయకులు నిట్టు వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Spread the love