టాప్‌ పోస్టుల్లో ఎవరో?

Who is in the top posts?– కేంద్రంలో కొద్ది నెలల్లో ఏర్పడనున్న ఖాళీలు
– బ్యూరోక్రాట్ల నియామకం కోసం వేట
– జులైలో బడ్జెట్‌ తర్వాతే నియామకాలు
– విశ్వసనీయ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ : మరికొద్ది నెలల్లో కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి పోస్టులు ఖాళీ కానున్నాయి. వాటిలో క్యాబినెట్‌ సెక్రెటరీ, హౌం సెక్రెటరీ, విదేశాంగ కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌, యూఎస్‌ఏలో భారత రాయబారి వంటి పదవులు ఇందులో ఉన్నాయి. ప్రధాని మోడీ తన ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, జాతీయ భద్రతా సలహాదారు, మరో ఇద్దరు సలహాదారులను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో కొనసాగించిన విషయం విదితమే.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఐబీ డైరెక్టర్‌ తపన్‌ కుమార్‌ దేకా పదవీకాలం జూన్‌ 30తో ముగుస్తుంది. కాబట్టి, ఈ వారం పొడిగింపు ఇచ్చే అవకాశమున్నది. మోడీ 3.0 పరిపాలన మొదటి పూర్తి బడ్జెట్‌ తర్వాత చాలా ఇతర ఉన్నత పదవులకు సంబంధించిన నియామకాలు జరిగే అవకాశం ఉన్నది. ఇవి జులైలో కేంద్రం ప్రవేశపెట్టబోయే పూర్తి స్థాయి బడ్జెట్‌ తర్వాతనే జరగనున్నయి. విదేశాంగ కార్యదర్శి పదవికి డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ విక్రమ్‌ మిస్రీ ముందు వరుసలో ఉన్నారు. అయితే అక్టోబర్‌లో ఒక సంవత్సరం పొడిగింపు ముగియనున్న ప్రస్తుత వినరు క్వాత్రా భారత రాయబారిగా యూఎస్‌కు పంపబడవచ్చు. లండన్‌లోని భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి కూడా వాషింగ్టన్‌లో పోస్ట్‌ కోసం పోటీలో ఉన్నారు.
ఇక తన మూడోసారి పొడిగింపుపై ఉన్న క్యాబినెట్‌ సెక్రెటరీ రాజీవ్‌ గౌబా.. ఈ ఏడాది ఆగస్టులో తన ప్రస్తుత పొడిగింపు పూర్తయిన తర్వాత రిలీవ్‌ కావాలని అభ్యర్థించినట్టు సమాచారం. ఆయన తర్వాత ఆ పదవిలో ఎవరిని ఉంచాలన్న దానిపై వేట కొనసాగుతున్నది. హౌం సెక్రెటరీగా మూడోసారి పోడిగింపుపై పదవిలో ఉన్న అజరు భల్లా కూడా ఈ ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వం ఆయనను అదే పదవిలో లేదా మరేదైనా హౌదాలో కొనసాగించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Spread the love