ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం

నవతెలంగాణ హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఈరోజు నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ మొదటి సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. ద్రవ్యోల్బణం రేటు స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (shaktikanta das) నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రెపో రేటు మునుపటిలాగే 6.5 శాతంగా ఉంది.
ఆహార ధరల్లో అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆర్‌బీఐ అప్రమత్తంగానే ఉందన్నారు. MSF రేటు 6.75% వద్ద ఉంది. ఆరుగురిలో ఐదుగురు ఎంపీసీ సభ్యులు రెపో రేటును యథాతథంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తెలిపారు.
అంతేకాదు గ్రామీణ డిమాండ్ ఊపందుకుంటోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. తయారీ ఆధారిత పారిశ్రామిక కార్యకలాపాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగం పెరిగి 2025 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2025 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇది మొదటి త్రైమాసికంలో 7.1 శాతం, రెండో త్రైమాసికంలో 6.9 శాతం, మూడో-నాల్గో త్రైమాసికంలో 7 శాతం ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సీపీఐ క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం ఉండవచ్చని తెలిపారు.

Spread the love