ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం

నవతెలంగాణ హైదరాబాద్: మూడు రాష్ట్రాలను భూకంపం వణికించింది. అస్సాం, ఉత్తరాఖండ్‌, హిమాల్‌చల్‌ ప్రదేశ్‌లో ప్రకంపనలు నమోదయ్యాయి. తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం 5.55 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు తీశారు. భూకంప కేంద్రాన్ని 20 కిలోమీటర్ల లోతులో, తేజ్‌పూర్‌కు తూర్పున 42 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు పేర్కొంది. స్వల్ప భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగలేదని అధికారులు తెలిపారు. అంతకు ముందు ఉత్తరాఖండ్‌లో భాగేశ్వర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 12.47 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 2.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌లో 2.7 తీవ్రతతో భూమి కంపించింది. జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌లో మంగళవారం పలుచోట్ల భూ ప్రకంపణలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌ చమోలిలో రిక్టర్‌ స్కేల్‌పై 1.8 తీవ్రతతో, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో 3.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వివరించారు.

Spread the love