పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన స్పెయిన్‌, ఐర్లాండ్‌, నార్వేలు

పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన స్పెయిన్‌, ఐర్లాండ్‌, నార్వేలు– క్యాబినెట్‌ల ఆమోద ముద్ర
– ఆచరణాత్మక చర్యలతో ప్రపంచ
– దేశాలకు కీలక సందేశమని వ్యాఖ్య
– గత 24 గంటల్లో 46మంది పాలస్తీనియన్ల మృతి
గాజా : మధ్య ప్రాచ్యంలో శాంతిని శాశ్వతంగా నెలకొల్పడానికి ఏకైక మార్గం పాలస్తీనా దేశాన్ని గుర్తించడమేనని స్పెయిన్‌ ప్రధాని పెట్రో శాంచెజ్‌ వ్యాఖ్యానించారు. నార్వే, ఐర్లాండ్‌తో పాటూ స్పెయిన్‌ కూడా పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసేందుకై క్యాబినెట్‌ల్‌ సమావేశం జరగడానికి ముందుగా మంగళవారం నాడు శాంచెజ్‌ మాట్లాడారు. నార్వే, ఐర్లాండ్‌లు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. శాంతిని సాధించే క్రమంలో పాలస్తీనియన్లకు, ఇజ్రాయిలీలకు సాయపడాలన్నదే తమ లక్ష్యమని స్పానిష్‌ ప్రభుత్వ ప్రతినిధి పిలార్‌ అల్జీరియా ప్రకటించారు. చారిత్రక న్యాయానికి సంబంధించిన అంశమిదని స్పానిష్‌ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌తో కలిసి మెలిసి సహ జీవనం సాగించడమే ఈ సమస్య పరిష్కారానికి గల ఏకైక మార్గమని అన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలతో వున్న పాలస్తీనాకు తూర్పు జెరూసలేం రాజధానిగా వుండాలన్నారు. 1967కి ముందు నాటి సరిహద్దుల్లో మార్పులను స్పెయిన్‌ గుర్తించదని చెప్పారు.ఐర్లాండ్‌ క్యాబినెట్‌ల్‌ కూడా పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తూ ఆమోద ముద్ర వేసింది. డబ్లిన్‌లో పాలస్తీనా పతాకాన్ని ఎగురవేశారు. ఇదొక కీలకమైన ఘట్టమని, పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తూ ఆచరణాత్మకంగా తీసుకునే చర్యలు ప్రపంచ దేశాలకు ఒక సంకేతం పంపుతాయని, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారం అమల్లోకి వస్తుందనే ఆశ నెలకొంటుందని ఐర్లాండ్‌ ప్రధాని సిమన్‌ హారిస్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఏం కోరుకుంటోందో ఒక్కసారి వినాలని నెతన్యాహును ఆయన కోరారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనే దేశాల్లో నార్వే కూడా వుందని,ఇప్పటికి 30ఏళ్లకు పైగా ఇదే వైఖరిని కొనసాగిస్తూ వచ్చామని విదేశాంగ మంత్రి ఎస్పెన్‌ బర్త్‌ చెప్పారు. నార్వే, పాలస్తీనా సంబంధాల్లో ఇదొక మైలురాయని వ్యాఖ్యానించారు. తక్షణమే కాకపోయినా తాము కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటామని మాల్టా, స్లొవేనియాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు పాలస్తీనాను 144 దేశాలు గుర్తించాయి. ఇయులో 27 దేశాలు వుండగా, ఇప్పటికి 8 దేశాలు గుర్తించాయి. తాము ఈ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నామని బ్రిటన్‌, ఆస్ట్రేలియాలు తెలిపాయి. ఫ్రాన్స్‌ ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించింది. కాగా ఈ దేశాల తాజా ప్రకటనలన్నీ ఇజ్రాయిల్‌ ఆగ్రహానికి కారణాలయ్యాయి. యూదుల ఊచకోతను రెచ్చగొట్టడానికి స్పానిష్‌ ప్రధాని శాంచెజ్‌ చేతులు కలుపుతున్నారని ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రి ఇజ్రాయిల్‌ కట్జ్‌ ఆరోపించారు.
46మంది పాలస్తీనియన్ల మృతి
గత 24 గంటల్లో గాజావ్యాప్తంగా జరిగిన దాడుల్లో 46మంది పాలస్తీనియన్లు మరణించారు. 110మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా రఫాలో మిగిలిన రెండు ఆస్పత్రుల్లో ఒకటైన కువైట్‌ ఆస్ప్తరిని మూసివేశారు. ఇప్పటివరకు 36,096మంది పాలస్తీనియన్లు మరణించగా, 81,136మంది గాయపడ్డారు.
గాజాలో కీలకమైన మానవతా సాయం అందకపోవడం పట్ల జపాన్‌ తీవ్రంగా ఆందోళన చెందుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి యోకో కామికవా తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన ఆందోళనలను తక్షణమే అమలు చేయాల్సిందిగా ఆయన కోరారు. సోమవారం ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన జపాన్‌ వైఖరిని స్పష్టం చేశారు.

Spread the love