పాలస్తీనియన్లకు విద్యార్ధి లోకం మద్దతు

Alumni support for Palestinians– అమెరికావ్యాప్తంగా పలు వర్శిటీల్లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు
– వందలాదిమంది అరెస్టు, పోలీసుల అణచివేత చర్యలతో ఉద్రిక్త వాతావరణం
– భారత సంతతికి చెందిన విద్యార్ధి అరెస్టు, వర్సిటీ నుంచి బహిష్కరణ
లాస్‌ఏంజెల్స్‌ : అమెరికాలోని పలు యూనివర్సిటీ కేంపస్‌ల్లో ఈ వారంలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణహోమాన్ని ఖండిస్తూ విద్యార్ధి లోకం ఆందోళనలకు దిగింది. దీంతో పలు చోట్ల కేంపస్‌లను మూసివేసి, వందల సంఖ్యలో విద్యార్ధులను అరెస్టు చేశారు. వారిపై అణచివేత చర్యలకు దిగారు. ఈ అరెస్టులకు భయపడేది లేదని, ఆందోళనలను విరమించేది లేదని విద్యార్ధి నాయకులు స్పష్టం చేశారు. న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో గత వారం మొదలైన పాలస్తీనా అనుకూల అందోళనలు క్రమంగా అన్ని వర్శిటీల కేంపస్‌లకు విస్తరించాయి. దారుణమైన యూదు వ్యతిరేకతను కాలేజీ క్యాంపస్‌ల్లో సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు. అయితే క్యాంపస్‌ల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వుంటుందని వైట్‌హౌస్‌ తెలిపింది.
నిరసనల్లో పాల్గొన్నందుకు గానూ కాలిఫోర్నియా, టెక్సాస్‌ల్లో రెండు యూనివర్సిటీల్లో వందమందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా (యుఎస్‌సి) లాస్‌ఏంజెల్స్‌ కేంపస్‌లో కూడా నిరసనలు పెద్దఎత్తున సాగాయి. నిషేధాజ్ఞలను ధిక్కరించినందుకు 93మంది అరెస్టు చేశారు. అలాగే ఆస్టిన్‌లోని టెక్సాస్‌ యూనివర్సిటీలో 34మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల స్థాయిలో అదుపు చేయలేని చోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అమెరికా వ్యాప్తంగా పలు కాలేజీల్లో ప్రదర్శనలు జరుగుతుండడంతో బరిలోకి దిగిన పోలీసులు విద్యార్థులతో ఘర్షణలు పడడం, డజన్ల సంఖ్యలో అరెస్టులు చేయడంతో సహా అణచివేత చర్యలకు పాల్పడడంతో పలు యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్ధులకు, లా ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ అధికారులకు మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. నిరసన శిబిరాల్లోనే అరెస్టులు జరిగిన దృష్ట్యా ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నామని కొలంబియా యూనివర్శిటీ ప్రకటించింది. నిరసనలను నిలిపివేసి, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు క్యాంపస్‌ను మూసివేస్తున్నామని కాలిఫోర్నియా వర్సిటీ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది, క్యాంపస్‌ల్లో వ్యవహారాల కోసం వచ్చే వ్యక్తులు అందరూ కూడా సరైన గుర్తింపు కార్డులతో రావాల్సి వుంటుందని యూనివర్సిటీ ప్రకటించింది. లాస్‌ఏంజెల్స్‌ క్యాంపస్‌లో ఆందోళనకారులు అక్కడ నుండి వెళ్ళడానికి తిరస్కరించడంతో పోలీసులను పిలిపించి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా ఎవరూ గాయపడలేదని, ఆ ప్రాంతమంతా గురువారం గస్తీ బృందాల అదుపులో వుందని పోలీసు అధికారులు ప్రకటించారు.
భారత సంతతికి చెందిన విద్యార్ధి అరెస్టు
ప్రతిష్టాత్మకమైన ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో చదువుతున్న భారత సంతతికి చెందిన విద్యార్ధిని అరెస్టు చేసి, క్యాంపస్‌ నుండి బహిష్కరించారు. క్యాంపస్‌ల్లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొనడమే వారు చేసిన నేరం. కోయంబత్తూరులో పుట్టిన అచింత్యా శివలింగన్‌ ఇక్కడ చదువుతున్నారు. ఆమెపై క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొనాల్సి వుంటుందని వర్సిటీ ప్రతినిధి తెలిపారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు విద్యార్ధులు నిరసన శిబిరం ఏర్పాటు చేసుకుని ఆందోళనలు చేస్తూ పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేశారు. మొదటి శిబిరం ఏర్పాటు చేసిన ఆరు నిముషాల వ్యవధిలోనే వర్సిటీ అధికారులు వచ్చి హెచ్చరికలు చేసి, ఇద్దరు విద్యార్ధులను అరెస్టు చేయడంతో మిగిలిన వారందరూ ధర్నా చేశారు.
ఆస్టిన్‌ ఫ్యాకల్టీ ఖండన
పాలస్తీనియన్లకు మద్దతుగా విద్యార్ధులు ఆందోళనలు చేస్తుంటే వారిని అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను క్యాంపస్‌కు రప్పించడాన్ని యుటి ఆస్టిన్‌ ఫ్యాకల్టీ తీవ్రంగా ఖండించింది. గుర్రాలు, మోటార్‌సైకిళ్ళపై సాయుధులైన సిబ్బంది, పెప్పర్‌ స్ప్రే, భాష్పవాయు గోళాలు, తుపాకులతో వచ్చి మొత్తంగా క్యాంపస్‌లో యుద్ధ వాతావరణం సృష్టించారని, శాంతియుతంగా తమ నిరసన తెలియచేస్తున్న విద్యార్ధులపై ఈ రీతిలో అణచివేత చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. యుటి ఆస్టిన్‌ ప్రధాన ఆవరణలో పబ్లిక్‌ యూనివర్సిటీ ఫర్‌ గాజా పేరుతో ఒక విద్యాకార్యక్రమాన్ని నిర్వహించాలని పాలస్తీనా సంఘీభావ కమిటీ నిర్ణయించింది. ఇందులో టీచింగ్‌, స్టడీ సెషన్లు, ఆర్ట్‌ వర్క్‌ షాప్‌లు వున్నాయి. అంతేగానీ ఎలాంటి హింసకు పాల్పడతామన్న బెదిరింపులు గానీ తరగతులను అడ్డుకోవడం గానీ లేవని ఫ్యాకల్టీ పేర్కొంది.

Spread the love