రెండింతలైన బ్రిక్స్‌ సభ్యత్వం

Dual BRICS membershipజొహాన్నెస్‌బర్గ్‌ : 2024 జనవరి నుంచి మరో ఆరు దేశాలకు బ్రిక్స్‌లో సభ్య దేశాలు పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించారు. ఆగస్టు 22-24 తేదీల్లో జొహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ దేశాల సమావేశం అజెండాలో సభ్యత్వ విస్తరణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అర్జెంటీనా, ఇథియోపియా, ఈజిప్ట్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, యు నైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలను గురువారంనాడు నూతన సభ్యదేశాలుగా బ్రిక్స్‌ ఆహ్వానించింది. ఇప్పటివరకు బ్రిక్స్‌ గ్రూపులో బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా దేశాలున్నాయి. ”బ్రిక్స్‌లో భాగస్వామ్యం కొరకు దేశాలు చూపుతున్న ఆసక్తికి మేం విలువిస్తాం. బ్రిక్స్‌లో చేర దలచిన దేశాల పట్టికను తయారు చేయటానికి, ఆయా దేశాలు చేర టానికి కావలసిన విధివిధానాలను రూపొందించే బాధ్యతను మా విదే శాంగ మంత్రులకు అప్పజెప్పాం’ అని దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు అన్నాడు.
2010లో మాత్రమే సౌత్‌ ఆఫ్రికాను చేర్చుకుని బ్రిక్స్‌ను విస్తరించారు. ఎటువంటి షరతులు లేకుండా సౌత్‌ ఆఫ్రికాను బ్రిక్స్‌లో చేర్చుకున్నారు. ఈ సంవత్సరం జరిగిన శిఖరాగ్ర సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలలో బ్రిక్స్‌లో చేరదలచిన దేశాలకు సభ్యత్వం ఇవ్వటానికి విధివిధానాలను రూపొందించటం కూడా ఒకటి. ఆవిర్భవిస్తున్న బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలను బ్రిక్స్‌ వ్యవహరిస్తున్న తీరు ప్రతిబింబిస్తుంది. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ఏర్పడిన ఏక ధ్రువ ప్రపంచంలో తమకు దక్కిన ఆధిపత్యాన్ని అమెరికా, దాని మిత్రపక్షాలు దుర్వినియోగం చేశాయని బ్రిక్స్‌ సభ్యదేశాలు విమర్శిస్తున్నాయి. పశ్చిమ దేశాల పలుకుబడి క్షీణిస్తుండగా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి డాలర్‌ ను ఆయుధీకరిస్తున్నాయని బ్రిక్స్‌ దేశాలు భావిస్తున్నాయి.

Spread the love