విలీన ప్రక్రియ త్వరగా పూర్తిచేస్తాం

We will complete the merger process quickly– టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలతో రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరలో పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, రవాణా, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు అన్నారు. గవర్నర్‌ న్యాయశాఖకు పంపిన విలీన బిల్లు తమ వద్దకే వచ్చిందనీ, తానే స్వయంగా గవర్నర్‌ను కలిసి, సందేహాలను నివృత్తి చేశానని తెలిపారు. ప్రోటోకాల్‌ ప్రకారం ఆ బిల్లులోని అంశాలకు సమాధానాలు ఇస్తూ, తిరిగి న్యాయశాఖకు పంపుతున్నామని వివరించారు. టీఎస్‌ఆర్టీసీ మెజారిటీ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చైర్మెన్‌ ఈ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్‌ కే హన్మంతు, కో కన్వీనర్లు మర్రి నరేందర్‌, పున్న హరికిషన్‌, సుద్దాల సురేష్‌, అబ్రహం, చెన్నారెడ్డి, పీ కమాల్‌రెడ్డి,చారి, రాజలింగం, కృష్ణ తదితరులు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో శ్రీనివాసరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారనీ, త్వరలోనే విలీన ప్రక్రియ పూర్తవుతుందని భరోసా ఇచ్చారని నేతలు తెలిపారు. రెండు వేతన సవరణలు, 50 శాతం బాండ్‌ డబ్బులు, డిఏ అరియర్స్‌,సీసీఎస్‌, ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌, పీఎఫ్‌ బకాయిల చెల్లింపు, చనిపోయిన పిల్లలకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు, రిటైరైన్‌ వారికి సెటిల్‌మెంట్లు, ప్రభుత్వ గ్యారెంటీ లోన్లను టేకోవర్‌ చేయడం, ఐదేండ్లు అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు వంటి పలు అంశాలతో కూడిన వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.

Spread the love