15 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

15 percent fitment should be given– బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ పెన్షన్‌ సంఘాల సంయుక్త ధర్నా
న్యూఢిల్లీ : 15 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 2022 అక్టోబరు 17న జాయింట్‌ ఫోరం నాయకులకు టెలికాం శాఖాధిపతులు, కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ సవరణకు సంబంధించి ఇచ్చిన హామీ ఉల్లంఘనకు వ్యతిరేకంగా పెన్షనర్లు రెండు రోజుల ఆందోళనకు దిగారు. అందులో భాగంగానే ఎనిమిది బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ పెన్షనర్ల సంఘాలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఉమ్మడి ఫోరమ్‌ నేతృత్వంలో గురువారం జంతర్‌ మంతర్‌ వద్ద భారీ సామూహిక ధర్నా జరిగింది. గత నాలుగు నెలలుగా టెలికాం, సమాచార శాఖ మంత్రి ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా లేరనీ, పింఛను సంస్కరణల విషయంలో జాప్యం, నిరాకరణకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందని నేతలు తెలిపారు. ఈ ఆందోళనకు ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్‌ డాట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ (ఏఐడీపీఏ) ఆల్‌ ఇండియా అడ్వైజర్‌ విఎఎన్‌ నంబూద్రి అధ్యక్షత వహించారు. ఏఐఆర్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి, జాయింట్‌ ఫోరం జాతీయ కన్వీనర్‌ కెజి జయరాజ్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ, ప్రభుత్వ జేసీఎం శివ గోపాల్‌ మిశ్రా ధర్నాను ప్రారంభించారు. ఉమ్మడి వేదిక ధర్నాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ మద్దతు పలుకుతారనీ, వెంటనే పెన్షన్‌ సంస్కరణలు అమలు చేయాలని కోరారు. డిడి మిస్త్రీ, జిఎల్‌ జోగి, ఆర్‌ కె ముద్గిల్‌, జెఎఫ్‌ చౌదరి, థామస్‌ జాన్‌ వంటి వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా పెన్షనర్లు ధర్నాలో పాల్గొన్నారు.

Spread the love