ఉల్లి రైతుల ఆందోళన

– నాసిక్‌లో వేలం నిలిపివేత
– మద్దతు ధర కోసం డిమాండ్‌
నాసిక్‌ : ఉల్లి రైతులు కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. తమ పంటకు మద్దతు ధరను ఇవ్వాలని ఆందోళన ప్రారంభించారు. ఇందుకోసం మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలోని హోల్‌సేల్‌ మార్కెట్‌లలో ఉల్లి వేలాన్ని గురువారం నిలిపివేశారు. రైతులు తమ ఉత్పత్తులకు జాతీయ సహకార వ్యవసాయ మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌) ప్రకటించిన క్వింటాల్‌కు కనీసం రూ. 2,410 ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం ఎగుమతి సుంకాన్ని వ్యతిరేకిస్తూ ఇంతక్రితం మూడు రోజుల పాటు వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు సమ్మె చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల సమ్మె తర్వాత తొలి రోజు జరిగిన వేలం రైతుల ఆందోళనతో నిలిచిపోయింది. నిఫాద్‌ తాలూకాలోని లాసల్‌గావ్‌లోని హోల్‌సేల్‌ మార్కెట్‌ ఛైర్మన్‌ బాలాసాహెబ్‌ క్షీరసాగర్‌ మాట్లాడుతూ.. ”వ్యాపారులు చెప్పిన ధర రైతులకు నచ్చకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ.. వేలాన్ని నిలిపివేశారు. లాసల్‌గావ్‌లో నాఫెడ్‌ కొనుగోలు కేంద్రం కావాలని రైతులు కోరుకున్నారు. కొనుగోలు కేంద్రం మంజూరైనప్పటికీ.. అది ఇంకా పని చేయడం లేదు.” అన్నారు. ”మార్కెట్‌లో నాఫెడ్‌ వ్యాపారానికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో రైతులు డిమాండ్‌ చేశారు. నాఫెడ్‌ వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని హామీ ఇవ్వబడుతుంది. నాఫెడ్‌ ప్రత్యేక సేకరణ కేంద్రాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.” అని ఉల్లి సాగుదారుల సంఘం అధ్యక్షుడు భరత్‌ డిఘోలే పేర్కొన్నారు. తమ డిమాండ్‌కు అంగీకరించే వరకు నాసిక్‌లో ఉల్లి వేలాన్ని రైతులు అనుమతించబోమని డిఘోలే తెలిపారు.

Spread the love