– ఆర్‌సీఓ డేవిడ్ రాజ్
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన గురుకులాల్లో టెన్త్, ఇంటర్ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ఉత్తీర్ణత శాతం మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకోవటమే కాకుండా, అత్యున్నత మార్కులు సాధించేలా టీచర్స్, లెక్చరర్స్ దృష్టి సారించాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్, ఇన్చార్జి ఆర్‌సీఓ డేవిడ్ రాజ్ సూచించారు. భద్రాచలం గిరిజన గురుకులంను ఆయన శుక్రవారం సందర్శించి ప్రిన్సిపాల్, టీచర్స్, లెక్చరర్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన పిల్లలను తొందరగా పాఠశాలకు, కళాశాలకు వచ్చే విధంగా…సంబంధిత హౌస్ టీచర్స్ కృషి చేయాలని కోరారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి, మార్చిలో జరగనున్న టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఇప్పటి నుంచే పిల్లలను సిద్ధం చేయాలని తెలియజేశారు. అటెండెన్స్ ఎప్పుడు 100శాతం ఉండాలని తెలిపారు. చదవని పిల్లల పట్ల, బాగా చదివే పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూప, వారి విద్యా ప్రమాణాలు మరింత పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. పోటీ పరీక్షలకు కూడా పిల్లలను సన్నద్ధం చేయాలని, ప్రణాళిక బద్ధంగా బోధించాలని పేర్కొన్నారు. తమ తమ విధులు పట్ల ఎవ్వరు నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని సూచించారు. వివిధ రికార్డులను ఆయన పరిశీలించారు. దసరా సెలవులు అనంతరం పాఠశాలలకు తమ పిల్లల్ని తీసుకొస్తున్న పేరెంట్స్‌తో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు, లెక్చరర్స్, టీచర్స్, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.