Saturday, May 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహమాలీల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు

హమాలీల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు

- Advertisement -

గిగ్‌వర్కర్ల చట్టానికి గవర్నర్‌ ఆమోదం

నెలరోజుల్లో విధివిధానాలు ఖరారు
ఈఎస్‌ఐ ఆస్పత్రులకు రూ.43వేల కోట్ల బకాయిలు
పీజేఆర్‌ పేరుతో లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్‌
‘శ్రమశక్తి’ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి
జూన్‌ 2 నుంచి ‘ప్రభాతభేరి’ : మంత్రి జూపల్లి
రవీంద్రభారతిలో ‘మేడే’ వేడుకలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన గిగ్‌వర్కర్ల చట్టానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారనీ, నెలరోజుల్లో విధివిధానాలు ఖరారు చేసి అమల్లోకి తెస్తామని కార్మిక, ఉపాధికల్పనా శాఖల మంత్రి జీ వివేక్‌ వెంకటస్వామి తెలిపా రు. దీనివల్ల 4 లక్షల మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి రవీంద్రభారతి లో ‘మేడే’ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు వందమంది కార్మిక సంఘాల నాయకులకు ‘శ్రమశక్తి’ అవార్డులు ప్రదానం చేశారు. గిగ్‌వర్కర్ల చట్టం తరహాలోనే హమాలీ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. దీనికి నిధుల సేకరణలో భాగంగా ‘సెస్‌’ వసూళ్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నా యని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికుల్లో అనేకమందికి ఈఎస్‌ఐ సౌకర్యం లేదనీ, దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మెరుగైన వైద్య సేవల కోసం కృషి జరుగుతుందన్నా రు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈఎస్‌ఐకి సంబంధిం చి రూ.43వేల కోట్ల బకాయిల్ని పెండింగ్‌లో పెట్టి పోయిందని విమర్శించారు.

వీటి చెల్లింపుల కోసం ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రామగుండం, శంషాబాద్‌ ప్రాంతాల్లో వంద పడకలు, మహబూబ్‌నగర్‌లో 30 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణాలకు అనుమతులు వచ్చాయనీ, త్వరలో ఆ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్మిక నాయకులు, మాజీ మంత్రి పీ జనార్థన్‌రెడ్డి పేరుతో లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసి, వచ్చే ఏడాది నుంచి కార్మిక సంఘాల నాయకులకు అందచేస్తామన్నారు. టామ్‌కామ్‌ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ.90 కోట్ల నిధుల్ని కేటాయించిందని తెలిపారు. టాటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోని 120 ఐటీఐ సెంటర్లను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మారుస్తున్నామనీ, దీనివల్ల ఏటా 20వేల మంది విద్యార్థులు లబ్దిపొందుతారని చెప్పారు. కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తరాలు మారుతున్నా కార్మికుల తలరాతలు మారడం లేదన్నారు.

దేశంలో సంపద పెరుగుతున్నా, మానవీయ కోణం పెరగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, యాజమాన్య ఆలోచనల్లో పరివర్తన రానంతవరకు మార్పు సాధ్యం కాదన్నారు. కార్మిక శాఖలో రూ.2వేల కోట్ల నిధులు నిష్ఫలంగా ఉన్నాయనీ, వాటిని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సూచించారు. కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అనేకం ఉన్నాయనీ, వాటిని సంఘటితంగా పోరాడి సాధించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ‘ప్రభాతభేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. రాష్ట్ర సంస్కృతి, జీవనశైలి, ఆలోచనా విధానాల్లో మార్పు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, ఎంపీ గడ్డం వంశీ, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, కమిషనర్‌ పమేలా సత్పతి, కనీస వేతన సలహా మండలి చైర్మెన్‌ డాక్టర్‌ బీ జనక్‌ప్రసాద్‌తో పాటు వివిధ ట్రేడ్‌ యూని యన్ల నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కార్మికచట్టాలపై ఆ శాఖ రూపొందించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -