Sunday, June 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం15 నుంచి విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు

15 నుంచి విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు

- Advertisement -

రవాణా శాఖ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుందని రవాణా శాఖ సంయుక్త రవాణా కమిషనర్‌ ఎం.చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. విద్యార్థులను పాఠశాలలకు బస్సులను తరలించే విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు. ఫిట్‌నెస్ లేని వాహనాలు, అధిక సంఖ్యలో విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోనున్నామని హెచ్చరించారు. వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా కచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. వాహనాలలో అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు అనుభవం కూడా తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలను పరిశీలించనున్నట్టు వివరించారు. వాహనాలకు బ్రేకులు, టైర్లు, లైట్లు ఇతర యాంత్రిక భాగాలు సక్రమంగా ఉన్నాయా ? లేదా ? అని తనిఖీ చేస్తామన్నారు. విద్యార్థుల భద్రత కోసం అటెండర్‌ వాహనంలో ఉండాల్సిందేనన్నారు. ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా ఓవర్‌లోడ్ చేస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేయడం జరుగుతుం దన్నారు. మోటార్ వాహన చట్టం ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యాసంస్థల విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు , నిబంధనల పాటింపు పూర్తి బాధ్యత సంబంధిత పాఠశాల , కళాశాల యాజమాన్యాలదేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,987 విద్యా సంస్థల బస్సులు ఉండగా 22,158 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయన్నారు. మిగిలిన 3829 బస్సులు సైతం ఫిట్ నెస్ సర్టిఫికెట్‌ ‌తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -