– అశ్వారావుపేట నియోజకవర్గంలో 99.30 శాతం
– ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి
– ఎలక్షన్ డీటీ సయ్యద్ హుస్సేన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అశ్వారావుపేట నియోజకవర్గంలో యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది అని ఎలక్షన్ డీటీ సయ్యద్ హుస్సేన్ తెలిపారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ( ఎస్ఐఆర్) పై బీఎల్ఓ – బీఎల్ఏ ల సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. నియోజకవర్గంలో మొత్తం 1,60,221 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,59,247 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం ద్వారా 99.30 శాతం పంపిణీ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
సోమవారం సాయంత్రం 4.00 గంటల వరకు 7,362 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ వివరాలను బీఎల్ఓ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో బీఎల్‌ఓ లకు ఎదురవుతున్న సందేహాలను అధికారులు నివృత్తి చేసి, యాప్ వినియోగంపై అవసరమైన మార్గదర్శకాలు అందించారు. బీఎల్‌ఓ లు, బీఎల్‌ఓ సూపర్వైజర్లు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరిస్తూ, పూర్తి చేసిన ఫారాలను బీఎల్ఓ యాప్‌లో డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. అనంతరం నియోజకవర్గ ఎన్నికల ఆపరేటర్ సమీర్ హుస్సేన్ బీఎల్ఓ యాప్‌లో వివరాలను ఎలా నమోదు చేయాలో బీఎల్‌ఓ లకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. సమావేశంలో సీనియర్ సహాయకుడు లక్ష్మయ్య, నియోజకవర్గ ఎన్నికల ఆపరేటర్ సమీర్ హుస్సేన్, బీఎల్‌ఓ సూపర్వైజర్లు, బీఎల్‌ఓ లు పాల్గొన్నారు.



