– ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
– ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ దాసరి కిశోర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం అశ్వారావుపేట నియోజకవర్గంలో గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 30 కేంద్రాలకు సంబంధించిన సవరణ సామగ్రి ఇంకా అందాల్సి ఉంది. సామగ్రి అందుబాటులో ఉన్న 154 పోలింగ్ కేంద్రాల్లో 142 కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 12 కేంద్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.
సవరణ ప్రక్రియలో భాగంగా రెండు ఎన్యూమరేషన్ ఫారాల్లో ఒక ఫారాన్ని ఓటరుకు అందజేస్తుండగా, మరో ఫారంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలను నమోదు చేస్తున్నారు. మొదటి రోజు కొనసాగిన ప్రక్రియను అశ్వారావుపేట పట్టణంలోని మాలపల్లి, గుర్వాయిగూడెం, కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంతాల్లో తహశీల్దార్ దాసరి కిశోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓ లకు అవసరమైన సూచనలు చేశారు. తహశీల్దార్ వెంట ఎన్నికల విభాగం డీటీ సయ్యద్ హుస్సేన్ పాల్గొన్నారు.



