ఉపఎన్నిక కౌంటింగ్  నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

 – రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : వరంగల్,ఖమ్మం,నల్గొండ శాసనమండలి ఉప ఎన్నిక  కౌంటింగ్ ప్రక్రియలో  కౌంటింగ్ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా  ఉండాలని రెవిన్యూ అదనపు కలెక్టర్  జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్గొండ  జిల్లా కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై  నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓట్ల లెక్కింపులో సిబ్బంది  షెడ్యూలు సమయం కంటే ముందే రావాలని, సమయానికి రిపోర్ట్ చేయాలని, సెల్ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు. ప్రాథమిక లెక్కింపులో చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్ల వర్గీకరణలో  పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే  పాటించే ఎలిమినేషన్ ప్రక్రియ పై  సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో   స్పెషల్ కలెక్టర్ నటరాజ్, శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, మాస్టర్ ట్రైనర్  బాలు లు పాల్గొన్నారు.
Spread the love