నాకు ఏ నోటీసులు రాలేదు : హీరో శ్రీకాంత్

నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనేకాదు.. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. రేవ్ పార్టీ ఎపిసోడ్‌లో పోలీసులు తీగలాగుతున్నాకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్, గంజాయి పట్టుబడటంతో పార్టీలో పాల్గొన్నవారి బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. దాదాపు 103 మంది దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా.. వారిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ నెల 18న సన్‌సెట్‌ టు సన్‌ రైజ్‌ విక్టరీ పేరుతో జరిగిన రేవ్ పార్టీలో వాసును ఏ1గా.. A2 అరుణ్, A3 నాగబాబు, A4 రణధీర్, A5 మహమ్మద్ అబూబకర్, A6 గోపాల్‌రెడ్డి, A7గా 68 మంది పురుషులు, 30 మంది యువతుల్ని A8గా పేర్కొన్నారు పోలీసులు. అలాగే 14 గ్రాముల MDMA, 5 గ్రాముల కొకైన్‌, పెద్దమొత్తంలో గంజాయిని సీజ్ చేశారు. 2 ఖరీదైన కార్లు, రూ.కోటిన్నర విలువైన డీజే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. హెబ్బగోడి పీఎస్‌ నుంచి సీసీబీకి కేసు బదిలీ అయింది. డ్రగ్స్ తీసుకున్న 86మందిలో 59 మంది పురుషులు, 27మంది యువతులు, మహిళలు ఉన్నారు. వీరిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. హేమ బ్లడ్ శాంపిల్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందన్నారు పోలీసులు. బ్లడ్ రిపోర్టులో పాజిటివ్ గా వచ్చిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇవ్వనుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో చాలామంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే రేవ్‌ పార్టీకి హాజరైన ఆషీరాయ్‌ మాత్రం కేవలం కేక్ మాత్రమే తిని వచ్చానన్నారు. ఇదిలా ఉంటే ఈ పార్టీకి సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా హాజరయ్యారంటూ కూడా వార్తలు వచ్చాయి. దీని పై శ్రీకాంత్ క్లారిటీ కూడా ఇచ్చారు. తనకు పబ్ లకు పార్టీలకు వెళ్లే అలవాటు లేదు అని తనకు ఎలాంటి పార్టీలకు వెళ్ళలేదు అని ఓ వ్యక్తి అచ్చం తనలానే ఉండటంతో అందరూ నేనే అనుకున్నారని శ్రీకాంత్ చెప్పారు. తన పై వస్తున్న వార్తలను నమ్మొద్దు అని కూడా చెప్పారు శ్రీకాంత్. కాగా ఇప్పుడు శ్రీకాంత్ కు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని వార్తలు పుట్టుకొచ్చాయి. దీని పై కూడాశ్రీకాంత్ స్పందించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాకు ఏ నోటీసులు రాలేదు.. నామీద తప్పుడు ప్రచారాలు చేస్తే .. నేనే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది అని హెచ్చరించారు హీరో శ్రీకాంత్.

Spread the love