Sunday, June 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపరీక్షాపే పరేషాన్!

పరీక్షాపే పరేషాన్!

- Advertisement -

నరేష్ ఆఫీసుకు సెలవు పెట్టాడు. ఎప్పుడూ సెలవు పెట్టని నరేష్ అడగ్గానే సెలవు ఇచ్చాడు వాళ్ల ఆఫీసర్. ఎందుకని కూడా ఆడగలేదు. కాని నరేష్ తన కొడుకు చందూ కోసం సెలవు పెట్టాడు. చందూ చాలా సంవత్స రాలుగా నీట్ పరీక్ష రాస్తున్నాడు. కొడుకును డాక్టర్‌‌గా చూడాలని తల్లిదండ్రుల ఆశ, తన జీతంలో సగం డబ్బులు కొడుకు చదువుకోసం.. అందునా నీట్‌ ‌కోచింగ్‌ ‌కోసమే నరేష్ ఖర్చుపెట్టాడు. మొన్నటి నీట్ పరీక్ష పేపర్ లీకైనందున వాయిదా పడింది. మరోసారి కొడుకును నీట్ సమరానికి సిద్ధం చేస్తున్నాడు.
తెల్లవారితే పరీక్ష‍!
నరేష్ కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని పరీక్షకు సంబంధించిన జాగ్రత్తలు చెబుతూ ‌తన ఫోన్ నుండి కొడుకు ఫోన్‌కు కొన్ని వీడియో లింకులు పంపి చూడమని చెప్పి బయటికి వెళ్లివచ్చాడు.
‘‘ఏరా వీడియోలు చూశావా?’’ అడిగాడు సరేష్.
‘‘ఆఁ చూశాను !’’ అన్నాడు చందూ క్యాజువల్ గా.
‘‘ఏంట్రా అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతవు! అది పెద్దాయన తన ‘మన్ కి బాత్’, ‘పరీక్షా పే చర్చా’లో పరీక్షలు ఎలా రాయాలో, ఎలా ప్రిపేర్ కావాలో చెప్పిన అత్యంత గొప్ప వీడియోలు. విద్యార్థులకు భగవద్గీత లాంటిది! అంత గొప్ప వీడియోలను చూసి నేర్చుకోరా!!’’ అన్నాడు కోపంగా నరేష్,
‘‘ఏమండీ ! పెద్దాయన ఒక ముఖ్యమైన విషయం మీద మన్ కి బాత్‌లో మాట్లాడలేదు! ఎప్పుడు మాట్లాడతారా! అని ఎదురు చూస్తున్నా!’’ అన్నది రాధ వంటింట్లో నుండి.
‘‘ఏ విషయం గురించి ఎదురు చూస్తున్నావు! తొందర్లోనే నీవు ఎదురు చూసే విషయంపై పెద్దాయన తప్పక మాట్లాడతారు!ఎందుకంటే మనం కోరుకునేవి ఏమి‌టో పెద్దాయనకు బాగా తెలుసు! ఇంతకూ ఏమిటా విషయం?’’ కుతూహలంగా అడిగాడు నరేష్.
‘‘లక్షలాది మంది పిల్లలు రాసే పరీక్ష పేపర్లు లీక్‌ కాకుండా ఆపటం ఎలా? అనే విషయం గురించి !’’ అన్నది రాధ.
వంటింట్లోకి దూసుకెళ్లి భార్యను కొట్టినంత పని చేశాడు నరేష్.
‘‘పెద్దాయనకేం పనుల్లేవా? ఇదొక్కటే పనా? ఏం చేయాలో, ఎలా చేయాలో పెద్దాయనకు బాగా తెలుసు! నీవు వంట చేసుకో! రేయ్ వీడియోలు బాగా చూడు!’’ అంటూ నరేష్ ఒక్కమాటతో తల్లి కొడుకుల నోర్లు మూయించాడు.
మొత్తానికి తెల్లారింది!
కొడుకును పొద్దున్నే లేపి స్నానం చేసి రమ్మని, తాను కూడా స్నానం చేసి పూజగదిలో దూరాడు! కొడుకును కూడా పిలిచి, పూజ చేయించి, దండం పెట్టుకోమన్నాడు! ఇద్దరు దండం పెట్టుకున్న తర్వాత కొడుకును అడిగాడు,
పరీక్ష బాగా రాయాలని కోరుకున్నావా?
కాదన్నట్టు తల అడ్డంగా ఊపాడు చందు.
‘‘మరి ఏం కోరుకున్నవురా!’’ కోపంగా అడిగారు నరేష్.
‘‘నీట్ పేపర్ ఈసారైనా లీక్ కాకూడదని కోరుకున్నాను!’’ అన్నాడు చందు.
‘‘మీ అమ్మ నిన్ను గారాబం చేసి చెడగొట్టింది! ఎవరైనా పరీక్ష బాగా రాయలని కోరుకుంటారు! బుద్ధిలేని వెధవ మాత్రం పేపర్ లీక్ కాకూడదని మొక్కాడంట!’’ అన్నాడు కోపంగా నరేష్.
‘‘బాగా చదివితే బాగా రాయోచ్చు ! కాని ఎంత బాగా చదివినా పేపర్ లీక్ కాకుండా ఆపలేం కదా! అందుకే అలా మొక్కుకున్నా!’’ అన్నాడు చందు లాజిక్‌గా!
‘‘ఈ వెధవ లాజిక్కులకేం తక్కువ లేదు! నిన్న నేను పంపిన వీడియోలు అన్నీ చూశావా?’’ మరోసారి అడిగాడు నరేష్..
‘‘ఆఁ అన్నీ చూశాను! అంతేకాదు నీవు పంపని వీడియోలు కూడా చూశాన్లే!’’ అన్నాడు చందు.
‘‘నేను పంపని వీడియోలేం చూశావురా!’’ అన్నాడు నరేష్‌ ‌కంగారుగా.
‘‘కంగారు పడకు డాడీ! పెద్దాయన వీడియోలే చూశాను. చాలా బాగా వచ్చాయి! చాలా విషయాలు ఆ వీడియోల ద్వారా నేర్చుకుని, అదే విధంగా ప్రిపేర్ అయ్యాను!’’ అన్నాడు చందూ ఎంతో నమ్మకంగా.
‘‘నా బాబు బంగారం! పెద్దాయనను ఫాలో అవుతున్నావంటే నీవు తప్పక గొప్పవాడివి అవుతావు!’’ అన్నాడు నరేష్ కూడా నమ్మకంగా.
ఇద్దరూ పరీక్షా కేంద్రానికి వెళ్లారు! కొడుకును లోపలికి పంపిస్తూ బెస్ట్ అఫ్ లక్ చెప్పాడు నరేష్.
నరేష్ కు కొత్త ఉత్సాహం ఉరకేలేస్తున్నది! దానికి కారణం కొడుకు పెద్దాయనను ఆదర్శంగా తీసుకోవటమే కాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెబుతుంటే నరేష్ కు గూస్‌ ‌బంప్స్‌ వచ్చాయి! కాని కొడుకు ముందు బయటపడలేదు! సాక్షాత్తూ విశ్వగురు అయినటువంటి పెద్దాయన్ను ఆదర్శంగా తీసుకున్న తన కొడుకు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతాడో ఊహించుకుంటున్న నరేష్ కు మళ్లీ గూస్ బంప్స్ వచ్చాయి! అంతేకాకుండా ఆనందంతో కళ్లు మూతలు పడ్డాయి!
కళ్లు తెరిచి చూసేసరికి చందూ ఎదురుగా ఉన్నాడు.
‘‘పరీక్ష ఎలా రాశావురా! అయినా నిన్న ప్రత్యేకంగా ఆడగాల్సిన అవసరమే లేదులే!’’ అన్నాడు నరేష్ ఆనందంగా.
పరీక్ష రాయలేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు చందూ.
‘‘మళ్లీ పేపర్ తీక్ అయ్యిందా!’’ అప్రయత్నంగా అడిగాడు నరేష్.
‘‘కాదు! నన్నే బయటకు పంపించారు!’’ అన్నాడు చందు తల దించుకుని.
‘‘ఎందుకు?’’ గందరగోళపడి ఆడిగాడు నరేష్.
‘‘మరి, నేను పెద్దాయనను ఆదర్శంగా తీసుకున్నాను కదా!’’ అంటూ చందూ ఏదో చెప్పబోయాడు.
‘‘పెద్దాయన్ను ఆదర్శంగా తీసుకోవటమే దేశభక్తి! దానికి భిన్నంగా ఆలోచించటమే దేశద్రోహం! మరి నిన్ను బయటకు పంపిన దేశద్రోహి ఎవడు? వాడి అంతు చూస్తాను!’’ అంటూ ఉద్రేక పడిపోయాడు నరేష్.
‘‘మీటింగుల్లో ఉపన్యాసాలు ఇవ్వటానికి పెద్దాయన ఎలా ప్రిపేర్ అవుతారో నేను కూడా ఆలాగే ప్రిపేర్ అయ్యాను! ఆ మాత్రం దానికే నన్ను బయటకు పంపారు! నా తప్పేం లేదు డాడీ!’’ అన్నాడు చందూ!
‘‘ప్రిపేర్ కావటం తప్పెందుకు అవుతుంది? ఇంతకూ నీవు ఏం ప్రిపేర్ అయ్యావు? వారెందుకు బయటకు పంపారో నాకు అర్థం కావటం లేదు!’’ అయోమయంగా అడిగాడు నరేష్,
‘‘పెద్దాయన విదేశాలకు వెళ్లి అక్కడ మీటింగుల్లో మాట్లాడేటప్పుడు టెలీ ప్రాంప్టర్లు వాడుతున్నారు! కొన్ని ప్రాంప్టర్లు ఈయర్ ఫోన్లవలె చెవిలో పెట్టుకుంటారు! మరికొన్ని బోర్డులు కూడా వాడతారు. ఈయర్ ఫోన్లలో వచ్చే మాటలనే ఉపన్యాసాలుగా, బోర్డు ప్రాంప్టర్లలో కదిలే వ్వ్యాక్యాలనే స్పీచులుగా మాట్లాడుతున్నారు! అది ఆదర్శంగా తీసుకుని ఈయర్ ఫోన్లు, ప్రాంప్టర్లు బోర్డులు ఎగ్జామ్‌ హాల్లోకి తీసుకుని పోయాను’’ అన్నాడు చందూ!
‘‘అంతేనా?’’ అడిగాడు నరేష్.
‘‘అంతేకాదు డాడీ! కొన్ని చిట్టీలు కూడా తీసుకుని పోయాను! మొన్న పెద్దాయన అమెరికాలో వాడారు కదా! అని నేను కూడా వాడాను! దానికే నన్ను డిబార్ చేశారు, మరి పెద్దాయన్ను ఎవరు డిబార్‌ ‌చేస్తారు డాడీ?’’ అడిగాడు చందు!
అప్పటికే కళ్లు తిరిగి పడిపోయాడు నరేష్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -