Sunday, June 21, 2026
E-PAPER
Homeమానవినాన్నంటే ఎంతో స్పెషల్‌

నాన్నంటే ఎంతో స్పెషల్‌

- Advertisement -

బాధ్యతలు నెరవేరుస్తూ బిడ్డల సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే ఏకైక శ్రమజీవి నాన్న. అమ్మ ఆత్మీయతకు వచ్చిన గుర్తింపు, నాన్న త్యాగానికి దక్కలేదు. అయినా నాన్న ఇవేమీ పట్టించుకోడు. అందుకే నాన్నంటే అందరికీ ఎంతో స్పెషల్. తండ్రులు చేసిన సేవలు, త్యాగాలకు గుర్తుగా ఏటా ఒక రోజున ఫాదర్స్ డే నిర్వహిస్తారు. ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా సెలబ్రేట్ చేస్తారు. మరి ఈ ఫాదర్స్ నాడు తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు…
సేకరణ: పాలపర్తి సంధ్యారాణి

నాన్నంటే అంతులేని శక్తి – కన్నెగంటి అనసూయ, ప్రముఖ రచయిత్రి
నాన్న యలమాటి వెంకట అప్పారావు. అమ్మ సత్యవతి. వ్యవసాయం చేసేవారు. మా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, పశివేదల గ్రామం.
వారికి నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలం, ఒక అబ్బాయి. నేను మూడవ అమ్మాయిని. ‘ఆత్మవిశ్వాసం అనేది వెలిగించిన దీపం కాదు. అది ఎంత ఆర్పినా ఆరని జ్వాల’ ఇది నాన్న నేర్పిన పాఠం. ఇది ఎంతగా ఆరని జ్వాల అంటే ఇప్పటికీ నాలో రగులుతూ ఏదో చెయ్యాలి, ఎంతో చెయ్యాలి, ఈ క్షణం గడిస్తే నాది కాదు అనే తపనను, తాపత్రయాన్ని పెంచుతూనే ఉంటుంది. అయితే సినిమాల్లో లాగా ఇలాంటి డైలాగులు చెప్పి నాన్న మమ్మల్ని ప్రోత్సహించారు అనుకుంటే పొరపాటే. నాన్న మిత భాషి. మాట్లాడారు అంటే ఆ మాట ఎంతో విలువైనదిగా ఉంటుంది. తన చేతలతో ఈ స్పూర్తిని రగిలించటం నాన్నకే సాధ్యం. అలా ఆయన నుండి ఎంతో నేర్చుకున్నాను. నాన్న నేర్పిన మరొక పాఠం ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకపోవటం. ‘మనది కానిది మనకు వద్దు’ అని ఆ రోజుల్లో తనకి సినిమా హాల్లో దొరికిన కరెన్సీనోట్ల మూటను నిజాయితీగా హాల్ యాజమాన్యానికి అప్పగించి మరీ నేర్పారు. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా ఇవ్వటమే తప్ప ఎప్పుడూ ఎదుటి వాళ్ళ నుండి ఏదీ ఆశించక పోవటం, తీసుకోవాలి అనుకోవటం అనే అలవాటు ఊహల్లో కూడా లేదు. అంటే అది నాన్న నుండి వచ్చిన వారసత్వం.

తన మీద, తను చేసే పనుల మీద, తన ఆత్మవిశ్వాసం మీద, ధైర్యం మీద నాన్నకి ఎంత విపరీతమైన నమ్మకం అంటే ఒక ఉదాహరణ.. ఒకసారి స్కూటర్ నడుపుతూ అన్ని వీధులు స్పీడుగా తిరగేస్తుంటే నాన్న స్నేహితుడు నన్ను చూసి భయపడి గబగబా ఇంటికి వెళ్ళి నాన్నతో ‘ఒరేయ్ అప్పారావ్. అనసూయ స్కూటర్ నడిపేస్తుందిరా. ఆ స్పీడ్ చూస్తే నా గుండాగిపోతుందేమో అని భయమేసింది. అందుకే పరిగెత్తుకొచ్చాను. అసలే ఆడపిల్ల. దేనికైనా గుద్దిందంటే ఏ కాలో చెయ్యో విరుగుతుంది. పెళ్లవదు. ఎవర్నైనా పంపి తనని వెనక్కి రప్పించరా’ అనీ కంగారు పడుతుంటే.. నాన్న నిదానంగా ‘తన సంగతి నీకు తెలవదులే మావయ్యా. ఇప్పటికిప్పుడు తనకు విమానం ఇచ్చినా నడుపుద్ది. నేర్చుకోవక్కల్లేదు. నువ్వేం భయపడకు. తను పడదు, దేనికీ గుద్దదు’ అనేసరికి వెళ్ళిపోయాడట. అదీ నాన్నకి తన పెంపకం మీదున్న నమ్మకం. స్నేహితులతో కలసి పది రోజులు నార్త్ టూర్ వెళ్ళి తీరా మూడురోజులు గడవక ముందే కూతురు కలలోకి వచ్చిందని, ఇక తనను చూడకుండా ఉండలేక మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేశాడు. అంతటి గొప్ప ప్రేమ నాన్నది. నన్నే కాదు మిగిలిన ముగ్గురిని కూడా అపురూపంగా ప్రేమించే వారు. నాన్న స్నేహితుడికి రాజమండ్రిలో ఫాన్సీ షాపుంటే ఆ రోజు ఫ్యాషన్‌గా ఏవీ వచ్చాయో అడిగి మరీ తెలుసుకుని వాటిని మా కోసం తెచ్చేవారు. మేము వాటిని పెట్టుకుంటే చూసి మురిసిపోయే వారు. అమ్మ పెట్టిన టిఫిన్‌లో సగం పక్షులకే పెట్టేసే నాన్న అలా ఎందుకని అడిగిన అమ్మకి ‘దానికీ పొట్ట ఉంది. పొట్టలో ఆకలీ ఉంది’ అని సమాధానం. ఇంట్లో కోళ్ళు, బాతులు, గిన్నెకోల్లు, పిల్లులు, కుక్కలనీ పెంచేవారు. ఇక స్కూల్స్ తెరిచే సమయం వచ్చిందంటే బడికి వెళ్ళే ఎవర్ని చూసినా నాన్నే గుర్తుకు వస్తారు. ప్రతి ఏటా కొత్త తరగతిలోకి వెళ్ళేముందు రాజమండ్రి తీసుకెళ్లి పుస్తకాలు, కొత్త బట్టలు, కొత్త చెప్పులు, పెన్నులు కొని సినిమా చూపించి హోటల్‌కి తీసుకెళ్ళి కావాల్సినవి తినిపించి తీసుకు వచ్చేవారు. అక్కలిద్దరూ బడి మానెయ్యటం, తమ్ముడు చిన్నవాడు కావడంతో ఈ ఆనందాలన్నీ నా ఒక్కదాని సొంతమయ్యాయి.

ఈ జ్ఞాపకాలు మరువతరమా ఎన్ని జన్మలకైనా! నాన్న సైకిల్ అడ్డగర్ర మీద కూర్చుని, చాగల్లు వెళ్ళి, వినాయక టాకీస్‌లో జంతికలు తింటూ, నాన్న ఒళ్ళో కూర్చుని ఎన్టీఆర్ సినిమాలు చూడటం ఎంతో మధుర జ్ఞాపకం. నాన్నంటే అంతులేని శక్తి. నాన్న పక్కలో పడుకుని రేడియోలో ఉషశ్రీ రామాయణం వినటం, అమాయకత్వంతో కూడిన నా సందేహాలకు నాన్న జవాబులు చెప్పి రామాయణానికి ఊహల్లో రంగుల పరిమళం అద్దడం, ఆ గుబాళింపు ఇప్పటికీ తాజాయే. చివరిగా ఉద్యోగం వచ్చి ఏలూరికి పయనమవుతున్న సందర్భంగా అమ్మమ్మని తోడు ఇచ్చి పంపుతూ ‘మా అమ్మ నన్ను ఎన్ని ఏళ్లు పెంచిందో అన్ని ఏళ్ళు మీ అమ్మమ్మ కూడా నన్ను పెంచారు. తొలిసారి నీ చేతుల్లో పెడుతున్నా. జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పటం ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతోంది. నాన్న ప్రేమించే గుణానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సంఘటన.
కళ్ళముందే కదదులుతున్నావు కానీ..
పట్టుకోలేక పోతున్న
చెవులకి వినపడుతున్నావు కానీ…
చేతులతో పట్టుకోలేక పోతున్న,
చుట్టు పక్కలే ఉన్నావు కానీ..
అందుకోలేక పోతున్న నాన్నా!

నాన్నలేని లోటు తీర్చలేనిది
శశికళ స్వామి, ప్రముఖ గాయని
నాన్న నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస వెంకటాచార్యులు. మా సొంత ఊరు సూర్యాపేట. అమ్మ చూడామణి. వారికి మేము ఏడుగురం సంతానం. నలుగురు అక్క చెల్లెళ్లం , ముగ్గురు అన్నదమ్ములు. నేను అందరికంటే చిన్న. నాన్న తెలుగు అకాడమీలో చేసేవారు, సంస్కృత పండితులు. నాన్న, పెదనాన్న ఇద్దరు కలిసి ఉండేవారు, అన్నదమ్ములు ఇద్దరు పుస్తకాలు చదువుతూ, శతావధానాలు చేస్తూ ఉండేవారు. అజంతా ప్రింటింగ్ ప్రెస్ అని ఉండేది. పెదనాన్న, నాన్న చూసుకునేవారు. ప్రతి ఏడాది అందరికీ అజంతా డైరీలు ఇచ్చేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఆంక్షలు పెట్టేవారు కాదు. నాన్న నుండి సాహిత్యం, అమ్మ నుండి సంగీతం నాకు అబ్బింది. అందరికీ డిగ్రీ వరకు చదువు ఉండాలి, అందరికీ సంగీతం రావాలి అని అనేవారు. నాన్నకి ప్రింటింగ్ ప్రెస్ ఉండటం వలన ప్రింట్ చేసే పుస్తకాలు కానీ ప్రింటింగ్ మ్యాటర్ కానీ ఇంటికి తీసుకొచ్చి ప్రూఫ్ రీడింగ్ కోసం నన్ను చూడమనేవారు. అలా నాకు కొంచెం సాహిత్యం అబ్బింది. నాన్నకు క్రమశిక్షణ ఎక్కువ. తన పనులు తానే చేసుకునేవారు. నేను అందరికంటే చిన్నదాన్ని కావడం వలన బాగా గారాభం చేసేవారు. కానీ తప్పు చేస్తే ఊరుకునేవారు కాదు. చనువు తక్కువ భయం ఎక్కువ. నాన్న నా 20 ఏండ్ల వయసులో వెళ్లిపోయారు. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాన్నకు బంధు ప్రీతి బాగా ఉండేది. అందరినీ కలుపుకుంటూ వెళ్లిపోయేవారు. సెలవులు వచ్చాయంటే అందరం సాహిత్యాన్ని ఆస్వాదించడంపై ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళం. నాన్న త్వరగా వెళ్లి పోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలను ఎప్పుడూ మరువలేను. నా చుట్టూ ఎందరు ఉన్నా నాన్నలేని లోటు నా మనసుకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -