Sunday, June 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపార్టీలపైనా బీజేపీ బుల్డోజింగ్

పార్టీలపైనా బీజేపీ బుల్డోజింగ్

- Advertisement -

దేశంలో తమ ఒక్కపార్టీ మాత్రమే వుండాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుందని విమర్శించారు శివసేనలో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే. ఇటీవల వివిధ పార్టీలలో వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం,గతంలో చీలికలు, విలీనం, తదితర చర్చలు ముందు కొస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్య చేయడం గమనించదగింది. బీజేపీ- ఆరెస్సెస్‌ల వ్యూహం లోతుపాతులు తెలియాలంటే ఈ కోణంలో ఆలోచిం చక తప్పదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏకకాలంలో అనేక రాష్ట్రాల్లో, అనేక పార్టీల్లో ఒకేవిధమైన పరిణామాలు సంభవిస్తున్నాయంటే వాటి వెనక స్పష్టమైన వ్యూహాలు, పాలకవర్గ ప్రభావాలు తప్పక వుండితీరతాయి. ఈ పరిణామాలకు ముందు పరిస్థితి, రానున్న రాజకీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
పశ్చిమబెంగాల్‌లో కేంద్రం పరోక్ష ఆశీస్సులతో అప్రజాస్వా మిక అరాచక పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శిష్యగణం ఆమెను వదిలేసి స్వంత దుకాణం తెరచుకోవడంతో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ, నిజానికి ఈ ప్రక్రియ అంతకు ఏడాది ముందే సాక్షాత్తూ దేశ రాజధానిలోనే మొదలైంది. ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ రాఘవ్‌చద్దాను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేయడం, ఆ వెంటనే ఆయన మరికొంతమందిని తోడు చేసుకుని రాజ్యసభ పక్షం మొత్తాన్ని ‌బీజేపీలో విలీనపర్చడం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. రాఘవ్‌ చద్దా చాలా కాలంగా బీజేపీపై విమర్శలు ఆపేసి సమోసాల వంటి అంశాలే మాట్లా డుతూ వచ్చారు. పరోక్షంగా మోడీకి వత్తాసునిచ్చే పనులు చేశారు.(చెప్పాలంటే కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కూడా కొంతకాలం అలా వ్యవ హరించి తర్వాత తగ్గారు)మీడియా దీనంతటికీ చాలా ప్రచారమిచ్చింది. వీటిపై ఆ పార్టీ నోటీసు ఇస్తే రాఘవ్ అడ్డం తిరిగారు. రాజ్యసభలో తగినంత బలం లేక నిరంకుశ బిల్లులు ఆమోదించుకోలేక సతమతమవు తున్న బీజేపీకి కాస్త ఊపిరిపోశారు. 2019లో ఓటమి తర్వాత టీడీపీ రాజ్యసభ పక్షం కూడా దాదాపుగా ఇలాగే బీజేపీలో విలీనమై పోయింది. వైసీపీ పక్షం విలీనం కాలేదుగానీ సభ్యుల రాజీనామాల వల్ల టీడీపీ, బీజేపీలకే మేలు కలిగింది. ఆప్ సభ్యులు ఆ పద్ధతినే కొనసాగించారని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. పైగా బీజేపీకి ఒకప్పుడు కంచుకోట లాంటి ఢిల్లీలో దాన్ని ఒక దశాబ్దం పాటు సవాలు చేసిన ఆప్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం ఇలా చతికిల పడటం చాలామందిని ఆశ్చర్చపరచింది.అంటే ఆ నేతలపై అంత బలమైన శక్తులు పనిచేశాయన్నది ఇక్కడ అసలు విషయం.

బెంగాల్‌లో జరిగిందేంటి?
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మోడీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా కేంద్రం ఇతర చోట్ల వలె ఇక్కడ దూకుడు ప్రదర్శించ లేదు, రెండోసారి మూడోసారి మమత విజయం సాధించేందువకు అనువైన వాతావరణం కల్పించడంలో కేంద్రం పాత్ర వుందనేది వాస్తవం. హ్యాట్రిక్ విజయం ముచ్చట ముగిశాక ఈసారి తామే నేరుగావచ్చి కూచోవాలని కమలదళాధిపతులు నిర్ణయం తీసుకోబట్టే సర్ ప్రక్రియ చాలా దారుణంగా అమలు చేశారు. 27 లక్షల ఓట్లు ఎటూ తేల్చకుండా నిరాకరించడమే గాక బంగ్లా దేశీయుల చొరబాటు పేరిట తీవ్రమైన వేట సాగించారు. ప్రజల్లోనూ వ్యతిరేకతకు గురైన తృణమూల్ సర్కారు ఇవన్నీ కలసి ఓటమిపాలైంది. మమతపైన వ్యతిరేకత పెరిగిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఒంటెత్తు వ్యూహాలు కూడా బీజేపీకే దోహదం చేశాయి.
టీఎంసీ తరపున గెలిచిన 89 మంది ఎమ్మెల్యేలలో 58 మందికి పైగా మమతకు అడ్డం తిరగడం అనూహ్య పరిణామంగా కనిపించినా అంత ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారితో సహా ఆ పార్టీ నేతలు చాలామంది గతంలో మమత అనుయాయులే. మొదట్లో శారదా స్కాం నుంచి తాజా కుంభ కోణాల వరకూ నిందితులుగా ఉన్న టీఎంసీ నాయకులు అనేకమంది బీజేపీలో చేరి రక్షణ మాత్రమే గాక పదవులు కూడా పొందారు. వామపక్ష కూటమిని రాకుండా చేయడం అనే ఒకే ఒక లక్ష్యంతో బీజేపీ, టీఎంసీలు కుమ్మక్కవడం బహిరంగ రహస్యమే. ఆ అవసరం ఇక లేదనుకోగానే బీజేపీ ఆమెను పక్కనపెట్టి ఆమెతో ఉన్న వారిని కూడా లాగేసుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా రితవ్రత ముఖర్జీ ఎంపికతోనే ఇది మొదలైంది, తర్వాత ఢిల్లీలోని ఆ పార్టీ ఎంపీలు ఇరవై మంది కూడా కాకోలీ ఘోస్ దస్తేదార్ నాయకత్వంలో ఏవో సాకులు చెప్పి చీలిపోయారు. బెంగాల్‌శాసనసభ స్పీకర్, లోక్‌సభ స్పీకర్ కూడా ఈ సభ్యులకు ఎలాంటి అనర్హత కలగకుండా ఓటు వేసే వీలు కలిగించారంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిన కథేనని స్పష్టమవుతుంది. ఇప్పుడు టీఎంసీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు.

మాయలు, మతలబులు
ఈ కథలో మరింత రసవత్తరమైన భాగం ఇంటర్వెల్‌ తర్వాత వచ్చింది. ఈ ఇరవై మంది ఎంపీలు బీజేపీలో చేరకుండా ఎన్‌సీపీఐ అనే నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరడం. పశ్చిమబెంగాల్‌లోనే పుట్టి, ల్రిపురలో రెండు స్థానాలకు పోటీచేసి నోటాకన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నట్టు? ఆ పార్టీని నాయకులైన సుహైల్‌ ‌కుందూ, ఉత్తీయ కుందు ఈ ఎంపీలు చేరిన సంగతి సోషల్‌ ‌మీడియా ద్వారా తెలుసుకున్నామంటున్నారంటే నమ్మశక్యమేనా? పైగా అతను సువేందు అధికారితో వున్న ఫోటోను షేర్ చేసి శుభాకాంక్షలు పెట్టాడు. 240 స్థానాలున్న బీజేపీ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్,37 స్థానాలతో సమాజ్ వాది పార్టీ వున్నాయి. 28 స్థానాలతో ఉన్న టీఎంసీ స్థానంలో ఇప్పుడు ఈ ఇరవై మంది చేరికతో ఎన్‌సీపీఐ ఒక్కసారిగా లోక్‌సభలో నాల్గవ పెద్ద పార్టీగా రూపొందింది. 22 మందితో అయిదో స్థానంలో ఉన్న డిఎంకె కూడా తాజా పరిణామాల తర్వాత గతంలో వలె కాంగ్రెస్‌తో కలసి ఉండడకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.
నాలుగో స్థానంలో తమకు అనుకూలమైన నవ్వులాట పార్టీని పెట్టుకున్నాక ఇప్పుడు బీజేపీ చూపు మూడోస్థానంలోని ఎస్‌పిపై పడింది. బెంగాల్‌లో మమతకు పట్టిన గతే యూపీలో అఖిలేష్‌యాదవ్‌కు కూడా పడుతుందని యూపీ మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీఎస్పీ చీలికవర్గమైన సుహల్తేవ్, భారతీయ సమాజ్‌పార్టీ నాయకుడు రాజ్‌భర్ 28 ఎస్‌పి ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. తర్వాత యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా అదే విదమైన ప్రకటన ఇవ్వగా ఎస్‌పిలోని బీసీ ఎంపీలు మాత్రం ఆ అవకాశం లేదని ఖండించారు.అయితే వచ్చే ఏడాది యూపీ శాసనసభ ఎన్నికలపైనే సర్వశక్తులూ పెట్టిన బీజేపీ నాయకత్వం ఏవేవో లోలోపల కుట్రలు చేస్తున్నదనే పరిశీలకులు సందేహిస్తున్నారు. ఎస్‌పికి కూడా గండిపెడితే అప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్ మినహా మొదటి వరసలో పెద్ద పార్టీలన్నీ బీజేపీకి మద్దతునిచ్చే పరిస్థితి వస్తుంది.

అసలు పథకం ఇదే
వాస్తవానికి అంతకన్నా తక్కువ సంఖ్యగల పార్టీలను కూడా వదలిపెట్టడం లేదనడానికి మహారాష్ట్రలో శివసేన పరిస్థితి నిదర్శనం, మొదట దానితో కలసి అధికారం పంచుకున్న బీజేపీ తర్వాత ఏక్‌నాథ్‌ షిండేను సీఎం చేసే హామీతో రెండుగా చీల్చింది, ఎన్నికలు కాగానే ఆయన్ను మళ్లీ ఉపముఖ్యమంత్రిగానే మార్చింది, తాజాగా ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరేతో ఉన్న తొమ్మిది మంది ఎంపీలలోనూ ఆరుగురిని చీల్చే ప్రయత్నం పూర్తయినట్టే కనిపిస్తున్నది. అవసరమైతే తానే పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తానని ఉద్ధవ్ అన్నారంటే అర్థమదే. కానీ అధికారం ప్రయోజనాలు ఆశచూపి బీజేపీ, సేన ఎంపీలను చేర్చుకోవడం తథ్యంగా కనిపిస్తున్నది. బహుశా ఉద్ధవ్ వర్గం బాగా పరిమితమైపోవచ్చు. ఇక శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి కూడా గతంలో చీల్చబడింది. అజిత్ పవార్ బీజేపీతోనే ఉన్నారు. ఇక మిగిలిన వారు కూడా అటే వెళతారని కథనాలు సాగుతున్నాయి, అసలు పవార్ తోనే చేతులు కలుపుతారని మరికొన్ని వార్తలు. ఇందులో కొన్ని కావాలని వ్యాపింపచేస్తున్న పుకార్లుగా కొట్టివేయబడినా బీజేపీ లక్షణం మాత్రం అదేనని మర్చిపోలేము. దాంతో పాటు ప్రాంతీయ పార్టీల అవకాశవాదధోరణుల రీత్యా కూడా అలా జరిగే అవకాశం చాలా ఉంటుంది. రాజ్యసభలో మూడింట రెండొంతులు మెజార్టీ తెచ్చుకోవడానికిదే సరైన సందర్భమని కూడా బీజేపీ-ఆరెస్సెస్‌లు భావిస్తున్నాయి. మొన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్‌నే తిరస్కరించడం, జార్ఖండ్‌నుంచి వ్యాపార వేత్త పరిమల్‌నత్వానీని గెలిపించుకోవడం వంటివి కూడా ఈ కారణంగా చేస్తున్నవే. ఇవన్నీ ముగిశాక జమిలి ఎ న్నికలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అతి పెద్ద రాజ్యాంగ సవరణలకు ఆమోదముద్ర వేసుకోవాలనే వ్యూహం అందరికీ తెలిసిందే. సర్ ప్రక్రియ ద్వారా వ్యతిరేక ఓట్లను కొన్ని తరగతుల మతాల ఓట్లను తొలగించడం, విదేశీ చొరబాట్ల నివారణ, జనాభా పరిశీలన పేరిట అల్ప సంఖ్యాక వర్గాలలో భయాందోళనలు పెంచి లోబర్చుకోవడం ఇవన్నీ ఆ వ్యూహంలో భాగాలు. గతంలో కొమ్ముకాసిన టీఎంసీ వంటి పార్టీలే గాక ఇప్పుడు మోస్తున్న తెలుగుదేశం, వైసీపీ, జేడీయూ, జనసేన వంటి పార్టీలను, మిశ్రమంగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్ వంటిపార్టీలను కూడా‌ బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందనేది నిస్సందేహం. బీహార్‌లో నితీశ్‌కుమార్‌ను నిర్దాక్షిణ్యంగా తొలగించేసిన తీరే అందుకో ఉదాహరణ.

ధనమే శాసనం…
చాలామంది పరిశీలకులు, వ్యాఖ్యాతలు ఈ తరుణంలో ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలు పదో షెడ్యూలు వివరాలు వంటివి ఏకరువు పెడుతున్నారు. కోట్ల ఓట్ల తొలగింపునకు దారితీస్తున్న సర్ వంటి ప్రక్రియపైనే జోక్యం చేసుకోని మన న్యాయవ్యవస్థ చట్టసభల అధ్యక్షుల విచక్షణాధికారంపై ఆధారపడిన ఫిరాయింపుల చట్టం అమలు కచ్చితంగా అమలయ్యే చర్యలు తీసుకుంటుందని ఆశించడం కుదిరేపని కాదు. 1985 జనవరి 30న 400 పైగా స్థానాలు కలిగిన రాజీవ్ గాంధీ ఫిరాయింపుల చట్టం తేవడానికి కారణం తన బలం కాపాడుకోవాలనే తాపత్రయమే. తర్వాత 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడే అవిశ్వాస తీర్మానం నుంచి బయిటపడేందుకు టీడీపీ, జెఎంఎం వంటి పార్టీలను చీల్చిన తీరు చూశాం, వీటిని చక్కదిద్దడానికే వాజ్‌పేయి హయాంలో మూడింట రెండొంతులు సంఖ్యాబలం ఉంటే విలీనం కావాలి తప్ప, పార్టీ మారే అవకాశం వుండకుండా చట్టాన్ని సవరించారు, అయినా పార్టీ విలీనమా లేక శాసనసభా పక్షం విలీనమా వంటి విషయాల్లో సభాపతులు అప్పటి అవసరాలకు అనుగుణంగా తీర్పులు చెబుతుంటారు. ఏపీ, తెలంగాణల్లోనే దశలవారీగా టోకున జరిగిన ఫిరాయింపులలో అనర్హత అంటూ వచ్చింది దాదాపు లేదు. నిజానికి రాజకీయాలను ధనబలం, కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నప్పుడు ఈ పార్టీల తీరుతెన్నులనూ అవేనిర్ధేశించడం కద్దు. నిజానికి ప్రజాస్వామ్యానికి నమూనాలుగా చెప్పబడే పాశ్చాత్య దేశాలలో ఫిరాయింపు నిరోధ చట్టాలు, విప్‌లు ఉండనే ఉండవు. ఉన్నా నిలవవు. దానికి వారి ఎన్నికల వ్యవస్థలు పాలనా పద్ధతులు కారణంగా కార్పొరేట్ వర్గాలు నేరుగా లాబీయింగ్ చేయడం తప్పుకాదు. నెమ్మదిగా మనం కూడా ఆ దశలోకి వెళుతున్నామనే సంకేతాలు ప్రస్తుత పరిణామాల వెనక దాగివున్నాయని గమనించడం అవసరం.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -