Sunday, June 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిడర్టీ మైండ్స్

డర్టీ మైండ్స్

- Advertisement -

మనం ఎలా ఆలోచిస్తామో, ప్రతిదీ అలాగే కనిపిస్తూ ఉంటుంది. మనసు కలుషితమైపోయినప్పుడు పరిసరమంతా కలుషితం గానే కన పడుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు చెబుతుంటారు, పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనపడుతూ ఉంటుందని. మనం ఏ కళ్లద్దాలతో చూస్తున్నామనేదే అసలు విషయం. ఆ రకంగా ఈ దేశాన్ని, మనుషులను, సంఘటనలను, వాళ్ల వాళ్ల ఆలోచనలతో చూడటం వ్యాఖ్యానించటం ఇప్పుడు మరింత ఎక్కువైపోయింది. పై విషయాలన్నీ ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఆమె ఇటీవల ఒక ప్రకటన చేసింది. అదేమంటే, మన దేశంలో పనిచేస్తున్న నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్‌వాళ్లది. దాన్ని భారతీయకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ, నర్సుల వృత్తి లైంగికపరమైనదిగా మారిందని, ప్రజలు ఎవరూ వారిని గౌరవంగా చూడరని సెలవిచ్చారు.
ఆవిడ నిర్మిస్తున్న సినిమా ‘భారత భాగ్య విధాత’ విశేషాలను చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా సినిమా కథ, వాస్తవంగా జరిగిన ముంబయి పేలుళ్ల సంఘటనల తీవ్రవాదుల దాడి నుంచి వందల మంది రోగులను ప్రాణాలు పణంగా పెట్టి కాపాడింది హాస్పిటల్‌లోని నర్సులు. కరుణ, సేవాతత్పరత, దయ కలిగిన నర్సులను అలా పోల్చడం, హీనపర్చడం చాలా దారుణమైన విషయం. ప్రసిద్ధ నోబుల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిసా కూడా భారతదేశంలో రోగులకు విస్మృతంగా సేవలను అందిం చారు. ఆమె ధరించిన డ్రెస్ కూడా అదే తెల్లని వస్త్రాలు. ఆమెను చూస్తే దయార్ధ హృదయమే కనపడుతుంది.
ఇక అసలు విషయమేమంటే, ఈ రనౌత్ గారి సినిమా డ్రెస్సులు చూసి, ఈ మాటలను వింటే ఎంతటి విరోధాభాస. పీలికల డ్రెస్సులతో అంగాంగాన్ని ప్రదర్శించే నటీమణి, ప్రేక్షకులను రెచ్చగొడుతూ గెంతులేసే ఈవిడ, భారతీయత, వస్త్రధారణల గురించి వ్యాఖ్యానించటం మరి విడ్డూ రంగా ఉంది. కంగనా గొంతు ఎప్పుడు ఇలాంటి విపరీతాలే పలుకు తుంది. ఒక మాట మాట్లాడేటప్పుడు, తానెలా వ్యవహరిస్తుందో తిరిగి చూసుకోవాలి. పసిపిల్లల్లోనూ లైంగికతను చూస్తున్న నేటి దుర్మార్గ సమాజ తీరును అర్థం చేసుకోకుండా నర్సుల డ్రెస్ కోడ్‌పై నీచ వ్యాఖ్యలు చేయడం ఆమెకే చెల్లింది.

ఇలాంటి కంటిచూపు అన్ని వ్యవస్థల్లోకి పాకుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ మధ్య ఎన్. సి. ఇ. ఆర్. టి. చూపు కూడా ఇలాంటి లైంగికపరమైన చూపుతో చరిత్రను, సంస్కృతిక శకలాలనూ మార్చే పనికి పూనుకున్నది. అదేమిటంటే, ఎన్.సి.ఇ.ఆర్.టి. విడుదల చేసిన తొమ్మిదవ, తరగతి చరిత్ర పుస్తకంలోని మొదటి పాఠం ‘హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ మధురిమ’ ఇది అతి పురాతనమైన మెహంజోదారో నాగరికతకు సంబంధించిన పాఠం. ఇది మూడు వేల సంవత్సరాల క్రితపు సింధు నాగరికత విశేషం. ఇక్కడి తవ్వకాల్లో బయల్పడిన డ్యాన్సింగ్ గర్ల్ ఇత్తడి బొమ్మను గతంలో పాఠ్య పుస్తకాల్లో యధాతథంగా ముద్రించారు. కానీ ఇప్పుడు ఆ బొమ్మను కాస్త మార్పులు చేసి ముద్రించారు. ఎందుకంటే, తవ్వకాల్లో దొరికిన ఆ బొమ్మ ఏ రకమైన వస్త్రధారణ లేకుండా డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. పెద్ద అశ్లీలంగా ఏమీ ఉండదు. దాన్ని బొమ్మరూపంలో చూసిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రెచ్చగొట్టబడి చెడిపోతారనే భ్రమ వాస్తవిక చారిత్రక ఆధారపు చిత్రాన్ని మార్చేయటం, వీరి అవివేకానికి నిదర్శనం. ఆ బొమ్మకు వస్త్రాన్ని చుట్టారు సరే, సనాతన ధర్మ క్షేత్రాలైన దేవాలయాల శిల్పాలు ఎంతటి జుగుప్సాకరంగా ఉంటాయో వీళ్లెప్పుడైనా చూశారా? మన రామప్ప గుడిని, దాని శిల్ప సౌందర్యాలను చూడాలి కదా! పిల్లలు భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళితే, వాటిపై కనిపించేవన్నీ బూతు బొమ్మలే కదా! అయినా వాటిని ఆ కాలపు చారిత్రక కట్టడాలుగా, నాటి సమాజపు తీరుతెన్నుల అధ్యయనంగా మాత్రమే గ్రహించాల్సి ఉంటుంది.

విద్యార్థులు, యువకులు చెడిపోతున్నది చారిత్రక విషయాలతో కాదు. పురాతన శిల్పాలు, కట్టడాలు చూసి కాదు. సినిమాలు, సెల్ ఫోన్లలో ఎంత క్రూరత్వాన్ని, సెక్స్‌ను గుప్పించి వదులుతున్నారో ప్రభుత్వానికి తెలియంది కాదు. గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారం ఎంతగా విస్తరించి యువతను, విద్యార్థులను ముంచెత్తుతున్నదో వారికి తెలుసు. ఒత్తిడి, నిరుద్యోగం, యువత విచ్చలవిడితనానికి కారణమవుతున్నది. దానికి తోడు సాంస్కృతిక దాడి కొనసాగుతున్నది. ఇటు సనాతన ధర్మం పేర మూఢ విశ్వాసాల ప్రచారంతో అజ్ఞానం మెదళ్లను కప్పేస్తున్నది. వీటన్నింటినీ అరికట్టలేని, శాస్త్రీయతకు స్థానం లేని గమనాల్లో ఇలాంటి వైపరీత్యాలు తప్ప ఏముంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -