– చిన్నారులు, వృద్ధులు, రోగులు, గర్భిణులకు తీవ్ర ఇబ్బందులు
– వినాయక ఉత్సవాల్లో శబ్ధకాలుష్యాన్ని నియంత్రించాలి: ఎస్‌ఐ రాజేష్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వినాయక చవితి ఉత్సవాల్లో డీజే ల హోరుతో సంబరాలు చేసుకునే కొందరి ఆనందం.. ఇతరుల ఆరోగ్యానికి, ప్రశాంతతకు ఇబ్బందిగా మారకూడదని దమ్మపేట ఎస్‌ఐ రాజేష్ సూచించారు. అధిక శబ్ధం వల్ల ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధులు, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, రాత్రి వేళల్లో పనిచేసి నిద్రించే కార్మికులు డీజే ల మోతతో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. శబ్ధకాలుష్యం వల్ల నిద్రలేమి, తలనొప్పి, ఆందోళన, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చన్నారు.
భక్తి పేరుతో ఇతరుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం సమంజసం కాదని, ఉత్సవ నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్‌ఐ రాజేష్ కోరారు. అనుమతులు లేకుండా డీజే లు వినియోగించినా, శబ్ధ పరిమితులను అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు పిలుపు: మన సంబరం మరొకరి అనారోగ్యానికి కారణం కాకూడదు. చిన్నారులు, వృద్ధులు, రోగులు, గర్భిణులు, విద్యార్థుల ఆరోగ్యం, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని డీజే ల వినియోగాన్ని నివారిద్దాం. శబ్ధకాలుష్య రహిత వినాయక ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించి, భక్తిని మానవత్వంతో చాటుకుందాం.



