
నవతెలంగాణ – పెద్దవంగర
జిల్లాలో యూరియా కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు హెచ్చరించారు. బుధవారం మండలంలోని చిట్యాల, పెద్దవంగర, పోచంపల్లి గ్రామాల్లోని పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయాధికారి కుమార్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను, ఎరువుల ధరల పట్టికలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా తో పాటుగా, అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవన్నారు. ఎరువుల దుకాణాల్లో తప్పనిసరిగా ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బిల్లులు ఇవ్వాలన్నారు. మండలంలోని రైతులకు యూరియా కొరత లేదని, యూరియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుల ఆధార్ వివరాలను నమోదు చేయకుండా ఎరువుల విక్రయాలు చేపట్టరాదని ఆదేశించారు.